hareesh rao

తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో కోమటిరెడ్డి రాజగోపాల్ భేటీ..

  • అసెంబ్లీ లాబీలో ఇరువురు నేతల భేటీ
  • దాదాపు 30 నిమిషాల పాటు ఏకాంత చర్చ
  • బీజేపీకి అనుకూల వ్యాఖ్యలు చేసిన కోమటిరెడ్డి బ్రదర్స్

తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు మంత్రి హరీశ్ రావుతో సమావేశమయ్యారు. అసెంబ్లీ లాబీలో ఈ రోజు మధ్యాహ్నం హరీశ్ తో సమావేశమైన రాజగోపాల్ రెడ్డి దాదాపు 30 నిమిషాల పాటు ఏకాంతంగా చర్చలు జరిపారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలు, పార్టీ మార్పులపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు.  గత కొన్ని రోజులుగా కోమటిరెడ్డి సోదరులు కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో బీజేపీకి అనుకూలంగా కొన్ని వ్యాఖ్యలు చేయడంతో కమలదళంలో చేరుతారని వార్తలు వచ్చాయి. కానీ తాము కాంగ్రెస్ లోనే కొనసాగుతామని కోమటిరెడ్డి సోదరులు స్పష్టం చేశారు. తాజాగా హరీశ్ రావుతో రాజగోపాల్ రెడ్డి భేటీ నేపథ్యంలో ఇరువురు సోదరులు టీఆర్ఎస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది.