crime

మస్కా కొట్టారు.. మాయ చేశారు!

నగరంలోని బేగంపేట ప్రాంతానికి చెందిన డాక్టర్‌ కమ్‌ డిజైనర్‌ను సైబర్‌ నేరగాళ్లు టార్గెట్‌ చేశారు. ఈయన రూపొందించిన వస్త్ర డిజైన్లు నచ్చాయంటూ సంప్రదించారు. ఖరీదు చేసేందుకు వస్తున్నామంటూ చెప్పి కస్టమ్స్‌ డ్రామా ఆడారు. మొదట రూ.65 వేలు కాజేసిన నేరగాళ్లు మరో రూ.1.5 లక్షలకు ఎర వేయడంతో డాక్టర్‌కు అనుమానం వచ్చింది. ఆయన బుధవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బేగంపేటకు చెందిన ఓ వైద్యుడు బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో పని చేస్తుంటారు. ఈయనకు వస్త్రాల డిజైనింగ్‌పైనా పట్టుంది. తాను రూపొందించిన డిజైన్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెబ్‌సైట్‌లో పొందుపరుస్తూ ఉంటారు.

వీటిని చూసిన సైబర్‌ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటూ రంగంలోకి దిగారు. సదరు డాక్టర్‌కు వాట్సాప్‌ ద్వారా ఫోన్‌ చేసిన ఓ వ్యక్తి తన పేరు టేలర్‌ రైట్‌ అని, తాను లండన్‌ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్నాడు. సదరు వెబ్‌సైట్‌లో ఉన్న వస్త్రాల డిజైన్లు తనను ఆకట్టుకున్నాయంటూ వారం రోజుల పాటు సంప్రదింపులు జరిపాడు. ఆపై వాటిని తాను ఖరీదు చేస్తానని, అందుకోసం ఇండియాకు వస్తున్నానంటూ చెప్పాడు. ఇది జరిగిన మరుసటి రోజు ముంబై కస్టమ్స్‌ విభాగం పేరుతో వైద్యుడికి ఫోన్‌ వచ్చింది. మిమ్మల్ని కలవడానికి, మీరు రూపొందించిన డిజైన్లు ఖరీదు చేయడానికి లండన్‌ నుంచి టేలర్‌ ౖరైట్‌ అనే వ్యక్తి వచ్చాడంటూ చెప్పారు.