devineni uma,cm jagan,ysrcp,AP,interpol

జగన్ వివరాలన్నీ ఇంటర్ పోల్ ద్వారా భారత్ కు చేరాయి: దేవినేని ఉమ

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణపై ధ్వజమెత్తారు. విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించిన ఉమ ఘాటైన విమర్శలు చేశారు. జగన్ క్యాబినెట్ లో బొత్సకు విలువంటూ లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు. త్వరలోనే జగన్ తదితరుల గుట్టు రట్టవుతుందని, పాపాలు బహిర్గతం కాబోతున్నాయని అన్నారు.

“జర్మనీ, సెర్బియా, బ్రిటీష్ ఐలాండ్స్, ఇతర దేశాల్లో మీరు చేసిన పాపాలన్నీ బయటపడుతున్నాయి. సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కొంటున్న నిమ్మగడ్డ ప్రసాద్ ప్రస్తుతం సెర్బియా దేశంలో రిమాండ్ లో ఉన్నారు. ఈ డబ్బంతా కూడా ఏ1 ముద్దాయి జగన్ వద్దకు వెళ్లింది. ఈ వాస్తవాలన్నీ కూడా ఆ దేశం నుంచి ఈ దేశానికి ఇంటర్ పోల్, ఇతర సంస్థల ద్వారా వచ్చాయి. ఈ వివరాలన్నీ ప్రధాని మోదీ వద్ద, హోంమంత్రి వద్ద బట్టబయలయ్యాయి. ఈ కేసుల భయం తరముకొస్తుండడంతో జగన్ కుప్పిగంతులు వేస్తున్నారు. ఢిల్లీలో ఉండగానే, బొత్సతో అవసరమొస్తే ఎన్డీయేలో చేరతామంటూ చెప్పించారు. ఢిల్లీలో పనులు అవ్వగానే, మేం ఆ మాట అనలేదని మాట్లాడించారు.

బొత్స గారూ మీరు వైఎస్సార్ క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నప్పుడు వైఎస్సార్ నే ప్రశ్నించారు. ఇప్పుడెందుకు చేతులు కట్టుకుని మాట్లాడుతున్నారు? మీకు ఈ క్యాబినెట్ పదవి అవసరమా? జగన్ ఏమేం మాట్లాడుతున్నాడో, ఎలా తిడుతున్నాడో మీడియా వాళ్లను అడిగి తెలుసుకో! నీ ఎదురుగానే ఆయన మాట్లాడిన మాటలు ఓసారి తలుచుకో! నిన్న నీ సహచర మంత్రే, పిచ్చాపాటీగా మంత్రులు మాట్లాడే మాటలు పట్టించుకోవద్దంటాడు.

ఇతర విషయాల గురించి మాట్లాడే మీరు మూడు ఇన్ ఫ్రా కంపెనీల గురించి ఎందుకు మాట్లాడరు? ఒక కంపెనీ గురించి మాట్లాడితే హైదారబాదులో వీపులు పగిలిపోతాయి. మరో కంపెనీ గురించి మాట్లాడితే ఢిల్లీలో వీపులు పగిలిపోతాయి. ఇంకో కంపెనీ గురించి మాట్లాడితే పోలవరంలో సిమెంటు ఆగిపోతుంది. ఏంటండీ మీరు చెప్పే కబుర్లు?” అంటూ మండిపడ్డారు.

Tags: devineni uma,cm jagan,ysrcp,AP,interpol