కథ ఈ చిత్రానికి ప్రాణం !
బ్లాక్ బస్టర్ రివ్యూ
నిర్మాతలు: ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ
దర్శకత్వం : రాజ్ విరాట్
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
సినిమాటోగ్రఫీ : సుజాతా సిద్ధార్థ్
ఎడిటర్ : బి. సుభాష్కర్
కథేంటంటే...
పోతురాజు(నందు) ఒక మత్స్యకారుడు. పూరీ జగన్నాథ్‌కి వీరాభిమాని. తాను కూడా పూరీ లాగా పెద్ద దర్శకుడు కావాలని కలలు కంటాడు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతో సినిమా తీసి హిట్ కొట్టాలనుకుంటాడు. సినిమాలపై పిచ్చితో ఏ పని చేయకుండా ఊర్లో అల్లర చిల్లరగా తిరుగుతూ.. వాణి(రష్మీ గౌతమ్)తో ప్రేమలో పడతాడు. ఆమె కోసం అందరితో గొడవలు కూడా పడుతుంటాడు. కట్ చేస్తే.. అనూహ్యంగా పోతురాజు తండ్రి హత్య చేయబడతాడు. ఆ తర్వాత పోతురాజ్ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? పోతురాజు తండ్రిని హత్య చేసిందెవరు? వాణితో లవ్ స్టోరీ ఏమైంది? చివరికి తన సినిమా లక్ష్యాన్ని చేరుకున్నాడా లేదా?అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే..
షార్ట్ ఫిలిమ్స్ ద్వారా వెలుగులోకి వచ్చిన దర్శకుడు రాజ్ విరాట్. గతంలో తాను చేసిన షార్ట్‌ఫిలిమ్స్ హిట్ కావడంతో.. 'బొమ్మ బ్లాక్ బస్టర్' ఆఫర్ వచ్చింది. ఎక్కువగా యాక్షన్ జానర్ లో షార్ట్ ఫిలిమ్స్ చేయడంతో ఇప్పుడు బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీని కూడా అదే జానర్ లో చేశాడు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ.. తెరపై చూపించడంతో కాస్త తడబడ్డాడు. పోతరాజు పాత్ర నేపథ్యం, ఫ్యామిలీ.. సినిమాల పిచ్చి తదితర విషయాలను పరిచయం చేస్తూ సినిమా ప్రారంభం అవుతుంది. కాసేపటికే కథలోకి వాణి పాత్ర వచ్చేస్తుంది. ఆమెతో పోతురాజు ప్రేమలో పడటం..వాణిని ఇంప్రెస్ చేయడానికి గొడవలు చేయడం..ఇలా సింపుల్‌గా ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆసక్తిని పెంచుతుంది. పోతరాజు ఫ్యామిలీ గురించి కొన్ని నిజాలు తెలియడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. అయితే సెకండాఫ్‌లో కూడా కథ ఆసక్తికరంగా సాగదు. కొన్ని సీన్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. పలు ట్విస్టులు, టర్నింగ్ పాయింట్స్ తో దర్శకుడు మంచి కథనే రాసుకున్నాడు. స్క్రీన్ ప్లేని ఇంకా బిగువుగా రాసుకోని ఉంటే.. సినిమా ఫలితం మరోలా ఉండేది.
ఎవరెలా చేశారంటే..
గతంలో అనేక సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసి మెప్పించాడు నందు. హీరోగా మారి 'సవారీ' చేశాడు. ఆ సినిమాలో నందు నటనకు అంతా ఫిదా అయ్యారు. హీరో పీస్ అని మెచ్చుకున్నారు. 'బొమ్మ బ్లాకబస్టర్'లో కూడా నందు మంచి నటనను కనబరిచాడు. పోతురాజు పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ లో కూడా బాగానే నటించాడు. వాణి పాత్రకి రష్మీ గౌతమ్ న్యాయం చేసింది. కీరీటీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ప్రశాంత్ విహారి పాటలు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. సిద్ధార్థ్ సినిమాటోగ్రఫీ తో మంచి విజువల్స్ చూపించాడు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి.