Janasena president, Pawan Kalyan,Capital is not an easy,amaravathi

రాజధానిని మార్చడం ఆషామాషీ వ్యవహారం కాదు: జనసేన అధ్యక్షులు ప‌వన్ కళ్యాణ్

* ఒక వేళ మార్చినా అది తాత్కాలికమే
* రాజధాని ఎక్కడ అనేది 2014లోనే నిర్ణయించారు
* రైతుల మరణాలకు ముమ్మాటికీ ప్రభుత్వ విధానాలే కారణం
* అహంకారం తలకెక్కి నిర్ణయాలు తీసుకుంటే కుప్పకూలతారు
* ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి గ్రామాల్లో జనసేన అధ్యక్షులు ప‌వన్ కళ్యాణ్
అమ‌రావ‌తి: రాజధాని ఎక్కడ ఉండాలనేది రాష్ట్ర ప్రభుత్వందే తుది నిర్ణయం అంటున్నారు… అయితే ఆ నిర్ణయం 2014లోనే జరిగిపోయిందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అమరావతిని రాజధానిగా నిర్ణయం తీసుకుంటే దానికి వైసీపీ మద్దతు తెలిపిందని గుర్తు చేశారు. ఇప్పుడు మాట తప్పి రాజధాని మారుస్తామంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. 60 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న రాజధాని రైతులకు భరోసా కల్పించడానికి శనివారం రాజధాని గ్రామాల్లో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అందులో భాగంగా ఎర్రబాలెం, కృష్ణాయపాలెం, రాయపూడి గ్రామాల్లో పర్యటించిన సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “ఎన్నికల సమయంలో వచ్చినట్లు ఓట్లు కోసం రాలేదు. రాజధాని ఎక్కడికిపోదు ఇక్కడే ఉంటుందనే భరోసా కల్పించడానికి రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నాను. గత ప్రభుత్వం, ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ కలిసి అమరావతినే రాజధానిగా నిర్ణయించాయి. దానిని మార్చే హక్కు ఎవరికి లేదు. రాజధాని మార్చడం అన్నది ఆషామాషీ విషయం కాదు. మారిస్తే చేతులు కట్టుకొని కూర్చోడానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఒక వేళ మార్చినా అది తాత్కాలికమే.

ఐదు కోట్ల మంది సమస్య…
రాజధాని అమరావతి సమస్య 29 గ్రామాలది కాదు. 5 కోట్ల మంది ఆంధ్రుల సమస్య. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూపోతే కోట్ల రూపాయల ప్రజాధనం, విలువైన కాలం, వనరులు దుర్వినియోగం అవుతాయి. రాజధాని రైతులకు అండగా ఉండే విషయంలో మడమ తిప్పే ప్రసక్తే లేదని, ఎవరూ వచ్చిన రాకపోయినా రైతుల పోరాటానికి బీజేపీ, జనసేన అండగా ఉంటాయి.

బీజేపీతో కలిసి త్వరలోనే నిరసన ర్యాలీ …
నా స్వార్ధం, స్వలాభం కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోలేదు. ప్రజా క్షేమం కోసమే పొత్తు పెట్టుకున్నాను. రాజధాని అమరావతికి మద్దతు ఇస్తాం. త్వరలోనే ఈ ప్రాంతంలో బీజేపీతో కలిసి మళ్లీ పర్యటిస్తాను. ముందుగా మీకు భరోసా ఇవ్వడానికి, ఒక అవగాహన కోసమే ప్రస్తుతం పర్యటిస్తున్నా. రాజధాని రైతులకు మద్ధతుగా ర్యాలీ నిర్వహిస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నా. బీజేపీ జాతీయ నాయకులు ఢిల్లీ ఎన్నికల సందర్భంగా రాలేమని చెప్పినందునే ర్యాలీ వాయిదా పడింది. మళ్లీ వారి వెసులుబాటును బట్టి తేదీ నిర్ణయిస్తాం. ర్యాలీ నిర్వహించి తీరతాం.. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీ రాజధాని అమరావతే అని కేంద్రం రికార్డుల్లోనే ఉంది. యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఆధార్ కార్డును ఎన్డీఏ వ్యతిరేకించింది. తర్వాత అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీని పక్కన పెట్టకుండా మరింత బలంగా ముందుకు తీసుకెళ్లారు. అదే విధంగా అమరావతి విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కాదని ముందుకు వెళ్ళడం సాధ్యమయ్యే పనే కాదు.

రాజధాని కోసమే భూములిచ్చారు… నవరత్నాల కోసం కాదు…
ఏడాదికి మూడు పంటలు పండే సారవంతమైన భూములను రాజధాని కోసం రైతులు త్యాగం చేశారు. రైతులు భూములు ఇచ్చింది రాజధాని కోసమే తప్ప… వైసీపీ నవరత్నాల పందేరం కోసం కాదు. తెలుగుదేశం పార్టీతో గొడవలు ఉంటే వారితో తేల్చుకోవాలి తప్ప … భూములిచ్చిన రైతులతో కంటతడి పెట్టించకూడదు. రాజధాని అనేది ఒక సామాజిక వర్గానిదే అని ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. అందులో ఎటువంటి నిజం లేదు. రాజధాని కోసం భూములు ఇచ్చిన వారిలో అన్ని కులాలు, అన్ని మతాల వారు ఉన్నారు. ఒక ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంటే… ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలి. అహంకారం నెత్తికెక్కి నిర్ణయాలు తీసుకుంటే కుప్పకూలిపోతారు. అమరావతిని మారుస్తున్నామని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆవేదన, ఆందోళనతో 41 మంది రైతులు చనిపోయారు. ఆ రైతుల చావులకు ముమ్మాటికి ప్రభుత్వ విధానాలే కారణం. 13 జిల్లాలు ఉన్న అతి చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడిపోతే నష్టపోతాం. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలి. ప్రజా సంక్షేమాన్ని కోరుకున్న వ్యక్తులు ఎవరూ కూడా రాజధానిని తరలించరు. అమరావతి రైతుల పోరాటానికి అండగా ఉండేందుకు బీజేపీ, జనసేన పార్టీలు సిద్ధంగా ఉన్నాయన్నారు.