‘మహానాయకుడు’ సినిమా చూడు: మోదీకి చంద్రబాబు సలహా!

ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని తానిప్పుడు నడుపుతున్నానని, తానెలాంటివాడినో తన సత్తా ఏంటో తెలుసుకోవాలంటే, ‘మహానాయకుడు’ సినిమాను చూడాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కర్నూలులో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన, 1982 నుంచి 1984 మధ్య కాలంలో తెలుగోడి సత్తా ఏంటో కేంద్రానికి చూపించామని, మరోసారి అదే పని చేసేందుకు సిద్ధమని హెచ్చరించారు.

తనపై అలిపిరిలో 24 బాంబులు వేసిన రోజునే భయపడలేదని, ఇప్పుడు మోదీ, కేసీఆర్, జగన్ లు చేస్తున్న తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని అన్నారు. తనకు ఎవరిపైనా వ్యక్తిగత వైషమ్యాలు లేవని, అన్యాయం ఎవరు చేసినా ఎదిరించి తీరుతామని అన్నారు. కేంద్ర అన్యాయంపై ‘బొబ్బిలిపులి’లా తిరగబడతామని చంద్రబాబు అన్నారు.