Capital Lands Case for CBI

సిబిఐకి రాజధాని భూముల కేసు

క్రొత్త రాజధాని ఏర్పాటు విషయంలో గత ప్రభుత్వం లోని వ్యక్తులు పాల్పడిన అవకతవకలపై, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1946 లోని సెక్షన్ 6 కింద, సీబీఐ విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోం శాఖ ద్వారా జారీ చేసిన జీవో నెంబర్ 46, ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వులు G.O. Rt. No. 1411, జనరల్ అడ్మినిస్ట్రేషన్ (క్యాబినెట్. ఐ) విభాగం తేదీ 26.06.2019 ద్వారా, క్రొత్త రాజధాని ప్రాంతం పై వచ్చిన అభియోగాల అధ్యయనం  కోసం, క్యాబినెట్ సబ్-కమిటీని నియమించడం జరిగింది. క్రొత్త రాజధాని ఏర్పాటుకు ఆనాటి ప్రభుత్వం అవలంభించిన విధానాలు, అవినీతి చర్యలు, స్వపక్షపాతం, ప్రజా ప్రతినిధుల ద్వారా దుర్వినియోగం మొదలైన అంశాలపై అధ్యయనం చేసి, రాజధాని పై వచ్చిన వివిధ ఆరోపణల పై వివరణాత్మక నివేదికను సమర్పించాలని కమిటీకి సూచించింది.

కేబినెట్ సబ్-కమిటీ ప్రభుత్వ రికార్డులను పరిశీలించిన తరువాత, 27/12/2019 నాడు తన నివేదికను సమర్పించింది. పూర్వపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో వ్యవహారాలు నిర్వహించిన ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి తమ సహచరులకు కొత్త రాజధాని భౌగోళిక ప్రాంతానికి సంబంధించిన గోప్యతతో కూడిన సమాచారాన్ని వెల్లడించారని, వారి సహచరులు, వారి కంపెనీలు మరియు వ్యాపారాలు, కుటుంబ సభ్యులు, రాజకీయ పార్టీ సభ్యులకు అన్యాయంగా మరియు చట్టవిరుద్ధంగా ప్రయోజనం చేకూర్చేందుకు రాజధాని ప్రాంతంలో భూములను కొనుగోలు చేశారని, రాజధాని యొక్క సరిహద్దులు మరియు దాని మౌలిక సదుపాయాలు వారి వ్యక్తిగత ప్రయోజనాలకు అనుగుణంగా సవరించుకున్నారన్నారని కమిటీ తన నివేదికలో పేర్కొంది. భూములను స్వాధీనం చేసుకోవడంలో ఆనాటి ప్రభుత్వం అనుసరించిన అక్రమాలు, అవకతవకలు మరియు నేరాలు-విస్తృతమైన కుట్ర, ఫోర్జరీ, పత్రాల కల్పన, ట్యాంపరింగ్, రికార్డులు తదితర  చట్టవిరుద్ధమైన చర్యల ద్వారా అసైన్డ్ భూముల నుండి భూమిలేని పేదలను ఆ భూములనుంచి వెళ్లగొట్టడం వంటి అంశాలను కమిటీ ధృవీకరించింది. ఈ లావాదేవీలు భారత శిక్షాస్మృతి, అవినీతి నిరోధక చట్టం, 1988,  బినామి లావాదేవీల (నిషేధ) చట్టం, 1988, మనీలాండరింగ్ నిరోధక చట్టం పరిధిలోకి వస్తాయి.

సదరు అభియోగాలపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం “ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని” ఏర్పాటు చేసి, రాష్ట్ర వ్యాప్తంగా అధికార పరిధి కలిగిన పోలీసు స్టేషన్‌ గా అధికారాలు కట్టబెట్టింది. క్యాబినెట్ సబ్-కమిటీ నివేదికలోని విషయాలలో మరియు సిబిసిఐడి, ఎపి చేసిన దర్యాప్తులో తేలిన అంశాలల్లో లావాదేవీలు జరిపిన వ్యక్తులు కొంతమంది రాష్ట్రంలోని వారని, కొందరు ఆంధ్రప్రదేశ్ వెలుపల మరియు విదేశాలలో  నివశిస్తున్నందున, అంతర్-రాష్ట్ర మరియు అంతర్జాతీయ ప్రాంతాలలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నందున, ఇది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి జాతీయ సంస్థ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావించింది. సిబిఐ తో దర్యాప్తు చేయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ, కేబినెట్ సబ్-కమిటీ నివేదికను కేంద్ర సిబ్బంది మరియు శిక్షణ శాఖకు పంపిన విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Leave a Reply