బిజెపి ద్వంద్వ వైఖరి ఏమిటో ?
తెలంగాణ లో అప్పులు కుప్పగా పేరుకుపోతున్నాయి. అప్పు చేసి ప్రాజెక్టులు కట్టినా రోజువారీ ఖర్చులకు, జీతాలకు నిధులు సర్దుబాటు కావడంలేదు. తెలంగాణ ప్రభుత్వం బహిరంగ మార్కెట్‌లో రుణాలు సమీకరించుకునేందుకు ఒకవైపు కేంద్ర ప్రభుత్వం, మరోవైపు ఆర్బీఐ గతంలో లేని ఆంక్షలు, నిబంధనలు విధించడమే ఇందుకు కారణమని తెలంగాణ ఆర్థిక శాఖ వర్గాలు చెపుతున్నాయి. అప్పుల విషయంలో కేంద్రం, ఆర్బీఐ తీరును తీవ్రంగా ప్రతిఘటిస్తోన్న కేసీఆర్ సర్కారు న్యాయపోరాటం చేసే దిశగా సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. డబ్బుల్లేని కారణంగా తెలంగాణ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు ఆగిపోయే పరిస్థితో ఈ అంశంపై సీఎం కేసీఆర్ బుధవారం ఓ నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది.
కేంద్రం వర్సెస్ కేసీఆర్ సర్కార్ అన్నట్లుగా సాగుతోన్న వివాదం మరింత ముదరడం, తెలంగాణ అప్పులపై కేంద్రం ఇటీవలే తీవ్ర ఆంక్షలు విధించడం తెలిసిందే. ప్రాజెక్టులకు తీసుకున్న రుణాలను కూడా ఎఫ్‌ఆర్‌బీఎం కింద లెక్కగడుతున్నామని కేంద్రం తాజాగా ప్రకటించిన నేపథ్యంలో.. దానికి కొనసాగింపుగా ఆర్బీఐ అనుమతి తీసుకుంటేనే రుణాలిస్తామంటూ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఈసీ) మెలిక పెట్టడాన్ని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా నిరసిస్తున్నది. కేంద్రం ఆంక్షల కారణంగా ఆర్‌బీఐ మంగళవారం నిర్వహించిన వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బాండ్ల వేలంలో తెలంగాణ పాల్గొనలేకపోయింది. దీంతో రాష్ట్రం ఆశించిన రుణాలు రాలేదు. కనీసం గతంలో మంజూరైన రుణాల విడుదల కూడా ఆగిపోవడంతో ప్రాజెక్టులు, పథకాలకు అనివార్యంగా బ్రేక్ పడే పరిస్థితి నెలకొంది.
రుణాల సమీకరణకు అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమని, పాత అప్పులకు సక్రమంగా వడ్డీ చెల్లిస్తూనే, రుణాలను తిరిగి చెల్లించే ప్రక్రియ మొదలవుతున్న దశలో రుణాల విడుదలపై మెలిక పెట్టడం తగదంటూ అన్ని రాష్ట్రాల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల సమక్షంలోనే తెలంగాణ అధికారులు కేంద్రాన్ని నిలదీశారు. అప్పులకు కేంద్రం, ఆర్బీఐ మోకాలడ్డటంతో ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీలు)ను వినియోగించుకోవాలని తెలంగాణ ఆర్థిక శాఖ భావిస్తోంది. అయితే రానున్న 10 నెలల కాలంలో కూడా ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్ర ఆర్థిక నిర్వహణ చాలా కష్టతరం కానుంది. దీంతో అప్పులు తెచ్చుకునే విషయంలో కేంద్రం విధించిన అనవసరపు ఆంక్షల సడలింపు కోసం కేసీఆర్ సర్కార్ కోర్టులను ఆశ్రయించాలని భావిస్తున్నది. దీనిపై సీఎం కేసీఆర్ మరికొద్ది గంటల్లోనే నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
కేంద్రం, ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో కొత్త రుణాల జారీపై పీఎఫ్సీ, ఆర్‌ఈసీ తీసుకున్న నిర్ణయాలపై తెలంగాణ ప్రభుత్వం గట్టిగా స్పందించింది. ఈ మేరకు ఆ సంస్థలకు లేఖలు కూడా రాసింది. కాళేశ్వరం కార్పొరేషన్ పీఎఫ్సీ నుంచి రూ.37 వేల కోట్ల దాకా రుణం తీసుకోగా.. ఇప్పటిదాకా రూ.33 వేల కోట్లు విడుదలయ్యాయి. తదుపరి రుణం తీసుకోవాలంటే విధిగా ఆర్‌బీఐ అనుమతి కావాలని పీఎఫ్సీ తేల్చిచెప్పింది. ఇక ఆర్‌ఈసీ నుంచి కూడా కాళేశ్వరం కార్పొరేషన్, తెలంగాణ స్టేట్ వాటర్ ఇరిగేషన్ డెవల్‌పమెంట్ కా ర్పొరేషన్ రూ.30 వేల కోట్ల రుణాలు తీసుకున్నాయి. ఇందు లో ఇప్పటిదాకా రూ.12 వేల కోట్లు విడుదలయ్యాయి. ఇప్పటికే పీఎఫ్సీ వడ్డీల కింద రూ.2309 కోట్లు చెల్లించగా, ఆర్‌ఈసీకి రూ.1165 కోట్లు అసలుతోపాటు వడ్డీ కింద చెల్లించారు. రుణాలను తిరిగి చెల్లించే ప్రక్రియ మొదలవుతున్న దశలో రుణాల విడుదలపై మెలిక పెట్టడంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహంతో ఉంది. న్యాయపోరాటంపై నిర్ణయం తీసుకోనున్న సీఎం కేసీఆర్.. ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు పరిస్థితిని వివరించే అవకాశాలు లేకపోలేవు.