home page

దేశ ఆర్ధిక స్థితి సరిగాలేదు

రేటింగ్ సంస్థ  నివేదిక ఆందోళన 

 | 
No finance

క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ నివేదిక

  • మున్ముందు దేశ ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలమే
  • క్రిసిల్‌ రేటింగ్స్‌ తాజా నివేదిక

ముంబై, ఏప్రిల్‌ 19: దేశంలో ఆర్థిక పరిస్థితులు రాబోయే నెలల్లో మరింత సంక్లిష్టంగా మారే సంకేతాలున్నాయని క్రిసిల్‌ రేటింగ్స్‌ మంగళవారం తమ తాజా నివేదికలో పేర్కొన్నది.

నిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలో నెలకొన్న ఆర్థిక వ్యవస్థ తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది. 

పెట్టుబడులు తరలిపోవడం, విదేశీ ప్రతికూల పరిస్థితులు, దేశీయ ఒడిదుడుకులు.. భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డుకాలం తెచ్చిపెట్టవచ్చని అభిప్రాయపడింది. గత నెల మార్చిలో తమ ఫైనాన్షియల్‌ కండీషన్స్‌ ఇండెక్స్‌ (ఎఫ్‌సీఐ) శూన్య స్థాయి దిగువకు పడిపోయిందని పేర్కొన్నది. దేశీయ ఆర్థిక పరిస్థితుల్లో ఇది బలహీనతను సూచిస్తున్నదని వివరించింది. స్టాక్‌, రుణ, నగదు, ఫారెక్స్‌ మార్కెట్ల వంటి 15 ప్రధాన అంశాలను తమ ఇండెక్స్‌ ప్రతిబింబిస్తుందని క్రిసిల్‌ తెలియజేసింది.

రుణాలు భారం
చాలాకాలం తర్వాత బ్యాంకులు రుణాలపై వడ్డీరేట్ల పెంపు దిశగా అడుగులు వేస్తున్నాయి. బీవోబీ, ఎస్బీఐ, కొటక్‌, యాక్సిస్‌ బ్యాంకులు తమ ఎంసీఎల్‌ఆర్‌ను 5 నుంచి 10 బేసిస్‌ పాయింట్ల వరకు పెంచుతున్నట్టు కూడా ప్రకటించాయి. దీంతో ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలపై వడ్డీరేట్లు పెరగనుండగా, ఈఎంఐలు భారం కానున్నాయి. ఈ పరిణామం పెట్టుబడులకూ విఘాతం కలిగిస్తుందని క్రిసిల్‌ ఈ సందర్భంగా పేర్కొన్నది. కరోనా పరిస్థితుల దృష్ట్యా అటు ఆర్బీఐ, ఇటు బ్యాంకులు రుణాల లభ్యతను ఇన్నాళ్లూ చౌకగా ఉంచిన విషయం తెలిసిందే. అయితే జూన్‌ ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ రెపో రేటును పెంచవచ్చన్న అంచనాలున్న నేపథ్యంలో బ్యాంకులు ఇప్పట్నుంచే వడ్డీరేట్లను సవరిస్తుండటం గమనార్హం.

ముడి చమురు దెబ్బ
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు.. దేశ జీడీపీ, కరెంట్‌ ఖాతా లోటు, ద్రవ్యోల్బణం, రూపాయి, ద్రవ్యలోటు, వాణిజ్యలోటుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని క్రిసిల్‌ స్పష్టం చేసింది. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఈ వారంలో 77 స్థాయికి పడిపోవచ్చనీ అంచనా వేసింది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు.. సుదీర్ఘ విరామం తర్వాత కీలక వడ్డీరేట్లను మళ్లీ ఆర్బీఐ పెంచేలా చేస్తున్నాయన్నది. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో రెపో రేటు 50-75 బేసిస్‌ పాయింట్లు పెరగవచ్చని అంచనా వేసింది. ఇదే జరిగితే అన్నిరకాల రుణాల లభ్యత కఠినతరమవుతుందని హెచ్చరించింది. గ్లోబల్‌ మార్కెట్‌లో క్రూడాయిల్‌ ధరల్లో హెచ్చుతగ్గులతోపాటు ప్రభుత్వ సెక్యూరిటీ బాండ్లలో రాబడులు పెరగడం, ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్లను పెంచుతుండటం వంటివి భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరులను దూరం చేస్తున్నాయని క్రిసిల్‌ విశ్లేషించింది.

'దేశీయ ఒడిదుడుకులకు అంతర్జాతీయ ప్రతికూలతలు తోడవడంతో భారతీయ మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కిపోతున్నాయి. ఫలితంగా రాబోయే నెలల్లో దేశ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా మారే వీలున్నది. అంతకుముందు నెలతో చూస్తే ఆర్థిక పరిస్థితులు గత నెలలో బలహీనపడటమే కాదు.. గడిచిన దశాబ్దకాలంలోనే ఎన్నడూ లేనంత ఒత్తిడికి లోనైనట్టు తెలుస్తున్నది. అయితే కరెంట్‌ ఖాతా లోటును తగ్గించేందుకు, దేశంలో విదేశీ మారకపు నిల్వలను పెంచేందుకు జరుగుతున్న చర్యలతో కొంతమేర ఉపశమనం కలుగవచ్చు.'

-క్రిసిల్‌ రేటింగ్స్‌