ప్రపంచ ఆర్ధిక చిత్రం మిశ్రమం!
Aug 26, 2023, 19:40 IST
|
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ: మిశ్రమ చిత్రం
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మిశ్రమ చిత్రాన్ని కలిగి ఉంది. అమెరికా నుంచి వస్తున్న డేటా చాలా బలోపేతంగా ఉంది. అయితే జర్మనీ ఆర్థిక వ్యవస్థలో మాత్రం మాంద్యం కనిపిస్తోంది. భారత్ ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకంగా ఉంది.ఇటీవలే విడుదలైన చైనా నిరుద్యోగిత నివేదిక ప్రకారం ఆదేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఐరోపా దేశాల ఆర్థిక వ్యవస్థ మాత్రం బలంగా ఉంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికా స్థితి స్థాపకంగా ఉండగా , మాంద్యం దిశగా సాగే అవకాశాలైతే దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు.ఇటీవలే విడుదలైన అమెరికా రీటైల్ సేల్స్ నివేదిక ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా బలోపేతంగా ఉందనే సంకేతాలు ఇచ్చింది.వాస్తవానికి స్టోర్స్‌లోని రీటెయిల్ సేల్స్, ఆన్‌లైన్ సేల్స్, రెస్టారెంట్లలో గత ఏప్రిల్ నుంచి మే నెల వరకు గమనిస్తే సేల్స్ 0.3శాతం పెరిగాయి. ఆర్థికవేత్తలు 0.1శాతం తగ్గుదల ఉంటుందని అంచనా వేశారు. అయితే ఈ అంచనాలు తలకిందులయ్యాయి.
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జపాన్ తొలి త్రైమాసికంలో 2.7శాతం వృద్ధిని నమోదు చేసింది.ఈ వృద్ధి నమోదు కావడానికి కారణం బలమైన వ్యయమే అని తెలుస్తోంది. అయితే జపాన్ ఈ స్థాయిలో వృద్ధి నమోదు చేయడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక భారత ఆర్థిక వ్యవస్థకు వస్తే 2023 జనవరి నుంచి మార్చి త్రైమాసికంలో 6.1శాతం పెరిగింది.2022-23 ఆర్థిక సంవత్సరంకు ఆర్థిక వృద్ధి 7శాతం అంచనా వేయగా అది 7.2శాతంగా నమోదైంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు పాజిటివ్‌గానే ఉండగా ఒక్క జర్మనీ, చైనా దేశాల ఆర్థిక వ్యవస్థలు మాత్రం కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై నిపుణులు ఏం చెబుతున్నారు..?
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర స్థితిలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రపంచ బ్యాంక్ గ్రూప్ చీఫ్ ఎకనమిస్ట్ , సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇండెర్మిట్.తూర్పు మరియు దక్షిణాసియా వెలుపల పేదరికాన్ని నిర్మూలించేందుకు, వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు, హ్యూమన్ క్యాపిటల్ గాడిలో పెట్టేందుకు అవసరమైన అవగాహన లోపించిందిని ఆయన అన్నారు.
మోర్గాన్ స్టాన్లీ నివేదిక ప్రకారం అత్యధిక వడ్డీ రేట్ల నేపథ్యంలో ప్రపంచ జీడీపీ వృద్ధి 2.9శాతంకు 2023లో పడిపోతుందని అంచన వేసింది. ఇది ఇలానే 2024లో కూడా కొనసాగుతుందని పేర్కొంది.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పిన నివేదిక అమెరికాలో నిరుద్యోగిత రేటు 1968 తర్వాత తొలిసారిగా ఆ స్థాయిలో ఉందని వెల్లడించింది. అదే సమయంలో 1983 తర్వాత తొలిసారిగా ద్రవ్యోల్బణంపెరుగిందని మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ పేర్కొంది.
అంతకుముందు, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒకేసారి మాంద్యంలోకి కూరుకుపోకుండా క్రమంగా తగ్గిపోతుందని ఆర్థికవేత్తలు అంచనావేశారు. అమెరికాలో ఉద్యోగాల కల్పన తగ్గిపోతుందని 2023కల్లా నిరుద్యోగిత రేటు 4శాతం వద్ద నిలుస్తుందని 2024 చివరినాటికి అది 4.4శాతంకు చేరుకుంటుందని అమెరికా ఆర్థికవేత్త ఎల్లెన్ జెంట్నర్ అభిప్రాయపడ్డారు.
2024 ప్రారంభ త్రైమాసికంలో 0.25శాతంకు పడిపోకముందు అమెరికా ఫెడ్ తన పాలసీ రేటు 5.1% వద్దే పరిమితం చేస్తుందని జెంట్నర్ అంచనా వేశారు.
ఇదిలా ఉంటే 2024 ముగిసేవరకు ఎలాంటి మాంద్యం ఉండబోదని మోర్గాన్ స్టాన్లీ రిపోర్ట్ వెల్లడిస్తోంది.ఈ నివేదిక ప్రకారం 2023లో జీడీపీ వార్షిక వృద్ధి 1.2శాతం అందుకోగా 2024లో అది 0.8శాతం ఉండొచ్చని పేర్కొంది.
ఐఎంఎఫ్ రిపోర్ట్ ప్రకారం ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల్లో జర్మనీ వృద్ధి 2023లో 0.1శాతం క్షీణిస్తుందని,2024 అది 1.1శాతం వృద్ధి నమోదు చేసుకుంటుందని పేర్కొంది.అదే అమెరికా ఆర్థిక వ్యవస్థ 2023లో వృద్ధి రేటు 1.6శాతం వద్ద ఉంటూ 2024 నాటికి అది 1.1శాతంకు పడిపోతుందని పేర్కొంది. ఇక జపాన్ ఆర్థిక వృద్ధి2023లో 1.3శాతం ఉండగా 2024నాటికి అది 1శాతంకు చేరుకుంటుందని చెప్పుకొచ్చింది.యూకే ఆర్థిక వృద్ధి 2023లో 0.3శాతం క్షీణించి 2024 నాటికి అది 1శాతం వృద్ధి నమోదు చేస్తుందని స్పష్టం చేసింది.
అన్నీ సానుకూల అంశాలున్నప్పటికీ ప్రపంచ ఆర్థిక వృద్ధి పెరిగేందుకు చాలా సమయం పడుతుందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు.2022లో ప్రపంచ జీడీపీ వృద్ధి అంత ఆశావాహకంగా లేనప్పటికీ, ఎనర్జీ ధరలు తగ్గపోవడం,చైనా మార్కెట్లు పునఃప్రారంభం,సప్లయ్ సరళీకృతం కావడం వంటి అంశాలతో తిరిగి ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడతాయని చెప్పేందుకు పైన ఉన్న అంశాలు దోహదపడతాయని వివరిస్తున్నారు.
ప్రపంచ బ్యాంక్ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ ఆర్థిక ప్రాస్పెక్ట్స్ నివేదికలో 2024 ప్రపంచ వృద్ధిని ముందుగా అంచనా వేసినట్లుగా 2.7శాతం కాకుండా 2.4శాతంకు తగ్గించింది.ఇందుకు ప్రధాన కారణాలను ప్రస్తావించింది.ప్రపంచ బ్యాంకు ద్రవ్యపరపతిని కఠినతరం చేయడంతో పాటు రుణాలను కూడా నియంత్రించింది. ఏది ఏమైనప్పటికీ, ప్రపంచ బ్యాంకు ఈ సంవత్సరానికి అంచనాను పెంచింది వాస్తవ ప్రపంచ వృద్ధిరేటు మునుపటి అంచనా 1.7%తో పోలిస్తే 2.1% పెరుగుతుందని ప్రకటించింది.