కోర్టులో లొంగిన ఎర్ర గంగిరెడ్డి
May 5, 2023, 12:30 IST
| హైకోర్టు అదేశాలతో లొంగిపోయిన వైనం
తాజాగా వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఎర్రగంగిరెడ్డి సీబీఐ కోర్టులో లొంగిపోయారు. ఈ మేరకు హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న సీబీఐ కోర్టుకు ఎర్రగంగిరెడ్డి వచ్చారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆయన మే 5లోపు∙లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డి హైదరాబాద్ నాంపల్లిలో ఉన్న సీబీఐ కోర్టులో లొంగిపోవడానికి వచ్చారు.
వివేకా హత్య కేసులో గంగిరెడ్డిని ఏపీ పోలీసులు 2019 మార్చి 28న అరెస్టు చేసిన సంగతి లె లిసిందే. ఆ తర్వాత 90 రోజులు గడిచినా చార్జిషీట్ దాఖలు చేయకపోవడంతో అతడు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో అదే ఏడాది జూన్ 27న గంగిరెడ్డికి డీఫాల్ట్ బెయిల్ వచ్చింది.
ఆ తర్వాత ఏపీ పోలీసుల విచారణ సరిగా లేదని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని వివేకా కుమార్తె సునీత ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు విచారణ బాధ్యతలను చేపట్టింది. ఇటీవల గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.అయితే కోర్టు ఆ పిటిషన్ కొట్టివేసింది.
దీంతో సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. తీవ్ర నేరారోపణలు ఉన్న కేసుల్లో స్పష్టమైన ఆధారాలు ఉంటే డీఫాల్ట్ బెయిల్ను రద్దు చేయొచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు గంగిరెడ్డికి ఐదో తేదీ లోపు సీబీఐ కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గంగిరెడ్డి లొంగిపోవడానికి నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు వచ్చారు.
కాగా వివేకా హత్య కేసులో ఎర్రగంగిరెడ్డి ఏ1 నిందితుడిగా ఉన్నాడు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వైఎస్ భాస్కరరెడ్డి ఉదయ్ కుమార్ రెడ్డి ఇప్పటికే జైలులో ఉన్నారు. అప్రూవర్ గా మారడంతో మరో నిందితుడు దస్తగిరి బెయిల్ పైన ఉన్నాడు.
ఈ కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డిని ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిని సీబీఐ ఇప్పటికే పలుమార్లు విచారించింది. వైఎస్ భాస్కరరెడ్డిని ఈ క్రమంలో అరెస్టు చేసింది. మరోవైపు అవినాశ్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.