త్వరలో డిజిటల్ రూపాయి
ఆర్బీఐ కసరత్తు
ఆర్థిక రంగంలో భారత్ అద్భుతాలు చేస్తూనే ఉంది! అతి త్వరలోనే డిజిటల్ రూపాయిని ఆవిష్కరించనుంది. ప్రత్యేక అవసరాలకు ఉపయోగించుకొనేలా పైలట్ ప్రాజెక్టును ఆరంభించబోతున్నామని ఆర్బీఐ ప్రకటించింది. అంతేకాకుండా సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC)పై ఒక కాన్సెప్ట్ నోట్‌ను విడుదల చేసింది. డిజిటల్ రూపాయి ఫీచర్ల గురించి అందులో అవగాహన కల్పించింది. ప్రాజెక్టు సక్సెస్ అయ్యేకొద్దీ మరిన్ని ప్రయోజాలు, ఫీచర్ల గురించి వివరిస్తామని వెల్లడించింది.
దేశంలో డిజిటల్ లావాదేవీలకు మరింత ఊతం లభించనుంది. డిజిటల్ రూపాయి విడుదల చేసేందుకు ఆర్‌బీఐ సిద్ధమవుతోంది. సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీ పేరుతో త్వరలోనే దీన్ని ప్రయోగాత్మకంగా విడుదల చేస్తామని తెలిపింది. అయితే ఎపుడు విడుదల చేస్తారనే విషయం మాత్రం నిర్దిష్టంగా వెల్లడించలేదు. డిజిటల్ రూపాయికి సంబంధించి ఒక ప్రాథమిక విధాన పత్రం విడుదల చేసింది. ఇందులో డిజిటల్ రూపాయి తీరుతెన్నులు, ఉపయోగాల గురించి ప్రస్తావించింది. దీంతో దేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుందని ఆర్‌బీఐ పేర్కొంది. చెల్లింపుల విధానం మరింత మెరుగుపడి నల్లధనం, అక్రమ నగదు లావాదేవీలకూ చెక్ పడుతుందని అభిప్రాయపడింది. ప్రస్తుతం మన నగదును డిజిటల్ రూపంలోకి మార్చుకుని, వినియోగించుకుంటున్నాం. ఈ చెల్లింపులకు బాధ్యత వాణిజ్య బ్యాంకులదయితే, సీబీడీసీ చెల్లింపులకు ఆర్‌బీఐ బాధ్యత వహిస్తుంది. ప్రస్తుత కరెన్సీ నోట్లు, నాణేల నిర్వహణ వ్యయాలను తగ్గించుకోవడానికి, నగదు చెలామణీ తక్కువగా ఉండే ఆర్థిక వ్యవస్థను సాధించడానికి ఈ డిజిటల్ రూపాయిని తీసుకొస్తున్నామని ఆర్ బీఐ తెలిపింది. చెల్లింపుల్లో పోటీ, సామర్థ్యం, వినూత్నత పెంచడానికి, విదేశీ లావాదేవీలను మరింత మెరుగ్గా నిర్వహించుకోవడానికి, క్రిప్టో ఆస్తుల నుంచి సామాన్యులను రక్షించి.. దేశీయ కరెన్సీపై విశ్వాసం పెంచడానికే తెస్తున్నామని రిజర్వు బ్యాంకు తెలిపింది.
'ప్రస్తుతం నగదుకు ఉన్న ప్రత్యామ్నాయ రూపాల్లో ఈ-రూపీ మరో అదనపు ఆప్షన్ ఇవ్వనుంది. బ్యాంకు నోట్లకు దీనికీ తేడా లేదు. డిజిటల్ రూపంలో ఉండటంతో సులభంగా, వేగంగా, తక్కువ ఖర్చుతోనే వాడుకోవచ్చు. ఇతర డిజిటల్ కరెన్సీకి ఉన్న ప్రయోజనాలే దీనికీ వర్తిస్తాయి' అని ఆర్బీఐ ప్రకటించింది. డిజిటల్ రూపాయి టెక్నాలజీ, డిజైన్, ఉపయోగాలు, జారీ పద్ధతుల గురించి కాన్సెప్ట్ నోట్‌లో ఆర్బీఐ వివరించింది. బ్యాంకింగ్ వ్యవస్థ, మానిటరీ పాలసీ, ఆర్థిక స్థిరత్వం, ప్రైవసీ అంశాల్లో డిజిటల్ రూపాయిని ప్రవేశపెట్టడం వల్ల కలిగే ప్రభావం మదింపు చేయనుంది
కాగితం కరెన్సీ నోట్లపై ఉండే గుర్తులే ఈ కరెన్సీపైనా ఉంటాయి. ముందు ప్రయోగాత్మకంగా కొన్ని పరిమిత చెల్లింపులకు మాత్రమే దీన్ని అనుమతిస్తారు. తర్వాత అన్ని రకాల చెల్లింపులనూ అనుమతిస్తారు. కాకపోతే ప్రస్తుత కరెన్సీ నోట్లు కాగితం రూపంలో ఉంటే, డిజిటల్ రూపాయి నోట్లు డిజిటల్ రూపంలో ఉంటాయి