AP constables in telangana state

తెలంగాణా లో ఆంధ్రా కానిస్టేబుళ్ళు

పొరుగు రాష్ట్రాల నిఘావర్గాలు తెలంగాణలో గూఢచర్యం నిర్వహిస్తున్న ఉదంతాలపై చర్యలు తీసుకుంటామని ఇటీవలే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఓపీ రావత్ స్పష్టంచేసినా….ఓ వైపు అధికార టీఆర్ఎస్ పార్టీలో ఈ ఎపిసోడ్‌పై గ‌గ్గోలు పెడుతున్నా….తెలంగాణ‌లో ఏపీ ఇంటెలిజెన్స్ క‌ద‌లిక‌లు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి.

అది కూడా రాష్ట్ర రాజ‌ధాని హైదరాబాద్‌లో కాకుండా దాదాపు 250 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న జ‌గిత్యాల జిల్లా ధర్మపురిలో కావ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. తాజాగా ఈ ప‌ట్ట‌ణంలో జర్నలిస్టులమని చెప్పుకొంటూ పట్టణంలో ప్రజలను, ఆలయానికి వచ్చే భక్తులను ప్రశ్నిస్తుండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో వారు ఏపీకి చెందిన ఐడీ కానిస్టేబుళ్లని తేలింది. దీంతో , ఏపీ ఇంటెలిజెన్స్ ప‌నితీరుపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు…మూడ్రోజులుగా ధర్మపురి గోదావరి తీరాన, దేవాలయం, బస్టాండ్ ప్రాంతాల్లో క్షేత్రానికి వచ్చిపోయే భక్తులను, స్థానికులను తాము జర్నలిస్టులమంటూ ఆరుగురు వ్యక్తులు ఎన్నికల గురించి ప్రశ్నిస్తున్నారు. ఓటు ఎవరికి వేస్తారు? కేసీఆర్ ప‌రిపాల‌న ఎలా ఉంది? అంటూ ఆరా తీస్తున్నారు.

శుక్రవారం కూడా గోదావరి తీరాన ముగ్గురు వ్యక్తులు జర్నలిస్టుల పేరుతో కొందరిని ఎన్నికల గురించి ప్రశ్నించారు. వారి వ్యవహారశైలిపై అనుమానం వచ్చిన స్థానికులు అడ్డుకుని, గుర్తింపుకార్డులు చూపాలని నిలదీశారు. దీంతో ఇరువర్గాల మధ్య స్వ‌ల్పంగా వాగ్వాదం జరిగింది. వారిని స్థానికులు అనంతరం పోలీసులకు అప్పగించారు. దీనిపై ఎస్‌ఐ అంజయ్యను స్పందిస్తూ వచ్చింది ఏపీ ఐడీ పార్టీ కానిస్టేబుళ్లని తెలిపారు. వారిని నారాయణరెడ్డి, వెంకటేశ్వర్‌రావు, మధుగా గుర్తించామని, వారిని హైదరాబాద్‌కు పంపిస్తున్నామని చెప్పారు.

కాగా, ఇదంతా ఏపీ సీఎం చంద్రబాబు, టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎల్ రమణ కుట్రలో భాగమేనని టీఆర్ఎస్ నాయ‌కులు దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణలో సర్వే కోసం ఎల్ రమణ ఈ నెల 25న రప్పించారని, ధర్మపురికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు భాస్కర్‌రెడ్డి, ధర్మపురి మండలం నక్కలపేటకు చెందిన ఉప్పుల రామకిష్టయ్యకు వారి బాధ్యతలు అప్పగించారని స్థానిక టీఆర్ఎస్ నాయ‌కులు పేర్కొంటున్నారు. వీరిద్దరూ ఐడీ పార్టీ కానిస్టేబుళ్లను ధర్మపురి దేవస్థానం ధర్మశాలలో ఉంచి సర్వే చేయిస్తున్నారని వెల్లడైందని, ఇక‌నైనా చంద్ర‌బాబు ఈ తీరును మార్చుకోవాల‌ని కోరుతున్నారు.