home page

ప్రశ్నిస్తే కేసులు పెడతారా?

ఎంతమంది మీద పెడతారో ? పెట్టండి

 | 
Raghu

ప్రశ్నిస్తే కేసులు పెడుతారా?

పెట్టండి... బాధితులంతా ఆ కేసులో  ఇంప్లిడ్ అవుతారు


పబ్లిక్ డొమైన్ లో
ఈ క్రాప్ వివరాలు  అందుబాటు లో ఉంచాలి

దీనితో తప్పు జరిగితే పక్క వారు కూడా ప్రశ్నించే ఛాన్స్

ధాన్యం కొనుగోళ్లలో  దగా పై "పిల్లి బోస్ " ప్రశ్నించ లేదా?

ప్రముఖ దిన పత్రిక పై కేసు సరే...పిల్లి బోస్ పై కూడా కేసు పెడుతారా??

సీఎం, వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ మంత్రి పై కూడా కేసు పెడతారా??


రాజ్యసభ లో రాయలసీమ , ఉత్తరాంధ్ర కు ప్రాతినిధ్యం నిల్ 

రాజ్యసభ సభ్యుల ఎంపిక లో
మహిళలను ఎందుకు పరిగణలోకి తీసుకో లేదో చెప్పాలి

రాయలసీమ కు చెప్పింది ఏమిటి... మనం  చేసిందేమిటి?

ఉత్తరాంధ్ర విషయంలోనూ అదే వివక్ష

సీమ లో ప్రతిపక్ష నేత కు బ్రహ్మరథం...  ఇక గోదావరి జిల్లాల పరిస్థితి ఊహించుకోవచ్చు

జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై.. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడే వారి పై కేసులు పెడతాం ... అంటే ఎవరు భయపడరని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామ కృష్ణంరాజు అన్నారు.. ఈ క్రాఫ్ విధానంలో  పారదర్శకత లేకుండా, కేసులు పెడతామని బెదిరించడం విస్మయాన్ని కలిగిస్తోందన్న ఆయన,  ఉయ్యూరు కు చెందిన ఒక ఐ.టి ఉద్యోగి వ్యవసాయదారులయిన తన తల్లిదండ్రుల వివరాలను ఈ క్రాప్ లో నమోదు చేయించు కునేందుకు పది రోజులు వేచి చూసిన, అతడి తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయించుకోలేక పోయారని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ క్రాఫ్
 వివరాలను పబ్లిక్ డొమైన్ లో ఎందుకు పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. గ్రామ సచివాలయం కంప్యూటర్ లోఈ క్రాప్ వివరాలను అందుబాటులో ఉంచితే, గ్రామస్తులందరికీ వివరాలు తెలుస్తాయన్నారు.. అప్పుడు ఎక్కడ తప్పు జరిగినా  పక్కవారు కూడా  ప్రశ్నించే అవకాశం లభిస్తుందన్నారు. ఈ క్రాఫ్ నమోదులు జరుగుతున్న అవకతవకలపై వార్తాకథనం రాసిన ఈనాడు దిన పత్రిక పై కేసు పెడతామని పౌరసరఫరాల శాఖ మంత్రి బెదిరిస్తున్నారని, కేసు పెడితే.. అందులో  జిల్లాకు వెయ్యి మంది చొప్పున బాధితులు  ఇంప్లీడ్ అవుతారన్నారు. రైతు వద్ద నుంచి మిల్లర్లు నేరుగా ధాన్యం కొనుగోలు చేయ వద్దని, అయినా కొనుగోలు చేస్తున్నారని.. దీనికి ఎవరి పై కేసు పెడతానని... ముఖ్యమంత్రి పైన, వ్యవసాయ, పౌరసరఫరాల శాఖ మంత్రి పైన అంటూ ప్రశ్నించారు. తప్పు జరిగితే సరిచేసుకోవాలని అంతే కానీ కేసులు పెడతామనడం  కరెక్ట్ కాదన్నారు.  ప్రశ్నించే వారిపై కేసులు పెడతాం అంటే ఎవరు భయపడరని, జనం రోడ్ ఎక్కుతారని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లలో అవినీతి జరుగుతోందని, బస్తా వెనుక రైతును 200 రూపాయల మేరకు దగా చేస్తున్నారని మాజీ ఉపముఖ్యమంత్రి, ప్రస్తుత ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారని, మరి ఆయనపై కూడా కేసు పెడతారా?  అంటూ నిలదీశారు.  ఈ క్రాప్ విధానంలో అవకతవకలు జరగడం లేదని, వ్యవసాయదారుల అందరి పేర్లు నమోదు అయ్యాయని, రైతు భరోసా కేంద్రాలు వద్ద కాకుండా, మిల్లర్లు నేరుగా ఒక బస్తా ధాన్యం కూడా కొనుగోలు చేయలేదని,  అఫిడవిట్ దాఖలు  చేయాలన్న ఆయన... అప్పుడు తాను రాష్ట్ర ప్రభుత్వానికి సినిమా చూపిస్తానని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి తెలుగు అర్థం కాదు కాబట్టి ఇంగ్లీషులో బెండపూడి అమ్మాయిల చేత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేసే ప్రయత్నం చేద్దాం అన్నారు. బెండపూడి పాఠశాల చంద్రబాబు హయాంలోనే అభివృద్ధి చెందిందన్నారు. ఇంగ్లీష్ మీడియం ను ప్రోత్సహిస్తూనే, తెలుగు భాషను బతికించాలన్నారు.. విద్యార్థుల ఇంగ్లీషు ఉచ్చారణ ను చూసి మురిసి పోతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , యూట్యూబ్ లో విస్తృతంగా ప్రచారం చేస్తున్న మంత్రి రోజా వంటి వారు తెలుగు భాషను కూడా చక్కగా ఉచ్చరించాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు అందుబాటులోకి రాలేదని, అంతకుముందు కూడా ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయన్నారు. 


రాయలసీమకు మనము చెప్పింది ఏమిటి... చేసిందేమిటి... అలాగే ఉత్తరాంధ్రకు చెప్పిందేమిటి... రాజకీయంగా చేసింది ఏమిటని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన ఏ ఒక్కరికి రాజ్యసభ స్థానాన్ని కట్ట పెట్టకపోవడం   తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంద న్నారు  .  రాజ్యసభలో తమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తొమ్మిది మంది సభ్యులు ఉంటే ముగ్గురు నెల్లూరు జిల్లాకు, మరో ముగ్గురు ఇతర రాష్ట్రాలకు చెందిన వారని పేర్కొన్నారు. ఇక  బిసి మహిళలకు కూడా రాజ్యసభ సీటు కేటాయించక పోవడం పట్ల రఘురామకృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రకు చెందిన. బీసీ సామాజికవర్గానికి చెందిన కిల్లి కృపారాణి, బొత్స ఝాన్సీ రాణి, రాయలసీమకు చెందిన విద్యావంతురాలైన బుట్టా రేణుక లతో పాటు, జగన్ జైలుకు వెళ్లినప్పుడు పార్టీ పరిస్థితి  ఏమవుతుందోనన్న సమయంలో పార్టీ కోసం పని చేసిన విజయమ్మ, షర్మిలకైన రాజ్యసభ సభ్యత్వం కల్పించి ఉంటే బాగుండేదన్నారు. . ప్రస్తుతం పల్లకీ మోస్తున్న మంత్రులు, రిటైరయిన మంత్రులు కూడా జైలు పార్టీ అంటూ అసెంబ్లీలో ఏక వచనంతో సంబోధించిన వారేనని గుర్తు చేశారు.
విజయమ్మ ఒకసారి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారని, వైయస్ సతీమణిగా  ఆ పెద్దావిడను పెద్దల సభకు పంపాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డికి లేదా అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు. రాయలసీమలో, ఉత్తరాంధ్రలో రాజధానులు ఏర్పాటు చేస్తామనడం మినహా మనం   ఆ జిల్లాలకు చేసిందేమిటని ప్రశ్నించారు. ఈనెల 26 నుంచి బస్సు యాత్ర చేపడతానని చెబుతున్నారని, ఈ విషయాలన్నీ రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు ... బిసి మంత్రులను, నిధులు లేని కార్పొరేషన్ కు  చైర్మన్లు గా , సభ్యులుగా వ్యవహరిస్తున్న వారిని,  జీతాలు రాని, సిపియు రద్దు కోరుతున్న బిసిలు, ఎస్సీలు  ప్రశ్నించారా? అని ఆయన నిలదీశారు. అలాగే రాయలసీమ వాసులు... తాము రాజ్యసభకు అర్హులం కామా? అని ప్రశ్నించారా ? అన్న రఘురామకృష్ణంరాజు...  బిసి జాబితాలో కొంతమంది మాత్రమే బలిజ కులస్తులున్నారని, అందరినీ బీసీ జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. అదే మీ పెద్ద కష్టమైన పని కాదన్నారు. మనసుంటే మార్గం ఉంటుంది అని చెప్పుకొచ్చారు. 

ప్రాజెక్టులు కట్టరు...

కట్టాల్సిన ప్రాజెక్టులను కట్టరని, అలాగే పెద్దలు కట్టిన ప్రాజెక్టుల నుంచి నీళ్ళు తో డాల్సిన బాధ్యతను విస్మరిస్తున్నారని రఘురామకృష్ణంరాజు ధ్వజ మెత్తారు. హంద్రీనీవా ప్రాజెక్టు మూడు వేల కోట్ల బకాయిలు చెల్లించకపోతే, ఆ ప్రాజెక్టు కూడా ఎప్పుడు నిలిచి పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. అనంత ప్రజల దాహార్తిని తీర్చేందుకు భగవాన్ సత్యసాయి బాబా భక్తుల నుంచి సేకరించిన అరు, ఏడు వందల కోట్ల రూపాయలతో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు  నిర్వహణ లోపం కారణంగా ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్నారు.. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన హర్ ఘర్ , ఘర్ కో జల్..జల్  పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మార్జిన్ మనీ చెల్లించకపోవడం వల్ల, ఆ నిధులు నిరుపయోగమయ్యాయని చెప్పారు. ఇక రాయలసీమ , ఉత్తరాంధ్ర ప్రజలకు బస్సు యాత్ర ద్వారా బీసీ మంత్రులు, బీసీ కార్పొరేషన్ల  చైర్మన్లు సభ్యులు  ఏమి సమాధానాన్ని చెబుతారని ప్రశ్నించారు

విద్వంసమే  తప్ప సాధికారిక  నిర్మాణం ఏది

రాష్ట్రంలో విధ్వంసమే తప్ప, సాధికారిక నిర్మాణ పనులు ఎక్కడ చేపట్టారని ప్రశ్నించారు. దావోస్ కు వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ,  పారిశ్రామికవేత్తల నుంచి ఎలా పెట్టుబడులను ఆహ్వానిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.. వేలాది మంది కి ఉపాధి కల్పిస్తున్న కంపెనీల పట్ల  కక్షసాధింపు ధోరణి చర్యల ద్వారా వేధిస్తున్న తీరు ... పారిశ్రామికవేత్తలకు తెలియకుండా ఉంటుందా? అని రఘు రామ ప్రశ్నించారు.
దావోస్ సదస్సు లోఎవరైనా పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తే జగన్మోహన్ రెడ్డి ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు.. రాష్ట్రంలో నూతన పెట్టుబడులను ఆకర్షించడానికి జగన్మోహన్ రెడ్డి కి ఉన్న ఫేస్ వాల్యూ  ఏంటో చెప్పాలన్నారు.

ప్రతిపక్ష నేత కోసం ప్రజల ఎదురుచూపులు

రాయలసీమ జిల్లాలలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తిలకించేందుకు ఎండనక వాననక యువత,  విద్యార్థులు పోటీ పడుతున్నారని,  ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పిట్టగోడ లెక్కి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. అదే మన ముఖ్యమంత్రి సభలో మహిళలు సైతం పోలీసులు ప్రాధేయ పడుతున్నా వినకుండా మధ్యలోనే గోడలు దూకి పారి పోతున్నారన్నారు. 1982లో ఎన్టీఆర్ కు కూడా  ఇదే విధంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారని, అయితే ఆయన సినిమా హీరో అని, సినిమా హీరోల ను చూసేందుకు జనాలు తండోపతండాలుగా రావడం సహజమేన ని అన్నారు. అయితే 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉన్న చంద్రబాబు నాయుడిని చూసేందుకు యువత, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు పోటీ పడడం  పరిశీలిస్తే, జగన్ ప్రభుత్వంపై ఉన్న జనాగ్రహం స్పష్టమవుతోందన్నారు.

రేపు మధ్య నిషేధం విధిస్తే  పరిస్థితి ఏమిటి?

రాష్ట్ర ప్రభుత్వం బేవరేజెస్ కార్పొరేషన్ పేరిట తప్పు చేసి అప్పు చేయాలని చూస్తోందని  కానీ రేపు వచ్చే ప్రభుత్వం మద్య నిషేధం విధిస్తే... అప్పిచ్చిన బ్యాంకర్ పరిస్థితి ఏంటని ఆయన  ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో కుమ్మక్కై బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారులు  రుణాన్ని ఇచ్చేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారని,  అప్పు ఎలా ఇస్తారో తాను కూడా చూస్తానని రఘురామ అన్నారు. ఇదే విషయమై తాను  ఇప్పటికే ఆర్బిఐ గవర్నర్ లేఖ రాసినట్లు పేర్కొన్నారు.