home page

వర్సిటీ పేరు మార్పులో పంతం ఎందుకు ?

 షర్మిల మాటను విన్నారా ?

 | 
Raghu

చెల్లి సిల్లీగా తీసి పడేసిందంటే... ఒకటికి రెండుసార్లు ఆలోచించండి 

 ఆరోగ్య విశ్వవిద్యాలయానికి 30 ఏళ్లుగా ఉన్న పేరును మార్చాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని, చెల్లి షర్మిల సిల్లీగా తీసిపడేసిందంటే, ఒకటికి రెండుసార్లు ఆయన ఆలోచించాలని  నర్సాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు  రఘురామకృష్ణం రాజు సూచించారు. మళ్లీ లక్ష్మీపార్వతి చేత ఛాయిస్ చెప్పించడం కరెక్ట్ నిర్ణయం కాదన్నారు. పేరు మార్చిన తర్వాత వెనక్కి తగ్గే రకం నేను కాదని మీరు అనుకుంటే, కొద్ది రోజుల తర్వాత అయినా...ప్రజలు ప్రభుత్వాన్ని మార్చే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు. అంతకంటే ముందే మనమే పేరు మార్చితే మంచిదని రఘురామకృష్ణం రాజు హితవు పలికారు. ఒక అర జిల్లాకు ఎన్టీ రామారావు పేరును పెట్టి, మనల్ని మనమే కీర్తించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్టీఆర్ స్థాయి ఒక అర జిల్లా నా? అంటూ ప్రశ్నించారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే అభినందించరా? అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులను ప్రశ్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి, కడప జిల్లాకు వైయస్సార్ పేరు పెట్టిన మాజీ ముఖ్యమంత్రి రోశయ్య చనిపోతే, కనీసం ఆయన కుటుంబాన్ని కూడా పరామర్శించని మిమ్మల్ని ఏమనాలని నిలదీశారు. సోమవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు  మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై  హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒక ట్వీట్ చేయగా, మా పార్టీ వాళ్లు తాడేపల్లి కర్మాగారంలో తయారైన ట్వీట్లను వదిలారని అపహస్యం చేశారు. ఎన్టీఆర్ ఒక వ్యక్తి పేరు కాదని, ఒక సంస్కృతి అంటూ బాలకృష్ణ చేసిన ట్వీట్ లో తప్పేముందని ప్రశ్నించిన రఘురామకృష్ణం రాజు, ఎన్టీఆర్ అంటే ఒక సంస్కృతి , ఔన్నత్యం అని పేర్కొనడంలో సందేహం లేదన్నారు. ఇప్పుడు ఎంత లేకితనంతో రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారో చూస్తున్నామని,  కానీ ఏనాడు ఎన్టీ రామారావు ఏకవచనంతో ఎవరిని సంబోధించలేదని గుర్తు చేశారు. అందరినీ బహువచనముతో పలకరించిన సంస్కారి, అభ్యుదయవాది అంటూ రఘురామ కృష్ణంరాజు కొనియాడారు. బాలకృష్ణ తన ట్విట్ లో ఎవరు చూసుకోకపోతే, పంచభూతాలు చూసుకుంటాయనటంలో కూడా తప్పు లేదన్నారు . పంచభూతాలు అంటే దేవుడని, అందుకే ఆ దేవుడే చూసుకుంటాడని ఉద్దేశ్యంతో అని ఉంటారని  వ్యాఖ్యానించారు. ఎన్టీ రామారావు కు వెన్నుపోటు పొడిచిన మీరు ఎలా మాట్లాడు తారని నందమూరి బాలకృష్ణ, నారా చంద్రబాబు నాయుడు, రామోజీరావులను ఉద్దేశించి  మా పార్టీ వారు తమ ట్విట్ ల ద్వారా ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 30 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీలో సంభవించిన సంఘటనలను రఘురామ కృష్ణంరాజు ఈ సందర్భంగా పూసగుచ్చినట్లు మీడియా కు వివరించారు. ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీపార్వతీ ప్రవేశించడంతో, ఆయన జీవిత గతిని మార్చిందని అన్నారు. లక్ష్మీ పార్వతి తన భర్తను త్యాగం చేసిందని, ఆమె త్యాగాన్ని తక్కువ చేయలేమని పేర్కొన్నారు. జీవితంలో అరక్షణం  తీరికలేని ఎన్టీ రామారావు, రాజకీయ నాయకునిగా, సినిమా నటుడిగా  ఎల్లప్పుడూ బిజీగానే ఉన్నారన్నారు. అటువంటి ఎన్టీ రామారావు జీవితంలోకి, జీవిత కథ రాస్తానని ప్రవేశించిన లక్ష్మీపార్వతి, జీవిత కథ పుస్తకం రాసిందో... లేదో తెలియదని అన్నారు. ఎన్టీ రామారావు సినిమా నటుడిగా, రాజకీయ నాయకుడిగా జీవితంలో బిజీగా ఉండడం వల్ల, తన పిల్లలతో ఆయనకు ఎక్కువగా చనువుగా లేకపోయినా,  వారికి ఆయన పట్ల ప్రేమ ఎక్కువేనని చెప్పారు. పిల్లలు, వారి పిల్లలు పెద్దవారైన తర్వాత, ఆయనకు జీవితంలో తీరిక దొరికిందన్నారు. అప్పుడే ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి జీవిత కథ రాస్తానంటూ ప్రవేశించిందన్నారు. 
ఎన్టీ రామారావు తన పిల్లలకు ఆస్తులను పంచారని, కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగా ఓవర్ నైట్ కోటీశ్వరులను చేయలేదన్నారు. తిరుపతిలో జరిగిన మేజర్ చంద్రకాంత్ శత దినోత్సవ వేడుకలలో  లక్ష్మీపార్వతిని తన జీవిత భాగస్వామి చేసుకుంటానని ఎన్టీ రామారావు   ప్రకటించడంతో , ప్రజలు కూడా అంగీకరించారన్నారు. అయితే ఎన్టీ రామారావు రెండవసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత  ప్రభుత్వ పార్టీ కార్యకలాపాలలో లక్ష్మీపార్వతి జోక్యం మితిమీరడంతో, పార్టీకి ప్రమాదం సంభవించే పరిస్థితి వస్తుందని, ప్రజలు, పార్టీ పెద్దలు, కుటుంబ సభ్యులు  పెద్దాయనకు ఎన్నోమార్లు  విజ్ఞప్తులు చేశారని పేర్కొన్నారు. లక్ష్మీపార్వతి అతి జోక్యం వల్ల, ప్రజల కోసం ఏర్పాటు చేసిన పార్టీ నాశనం కావొద్దనే ఉద్దేశంతో, పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా, చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎన్టీరామారావు పై ఆనాడు పార్టీ పెద్దలు,  ప్రజాప్రతినిధులు తిరుగుబాటు చేశారన్నారు. వడ్డానం చేయించి ఇస్తే మంత్రి పదవి ఇస్తానని లక్ష్మీపార్వతి పేర్కొన్న విషయాన్ని ఇటీవల   తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించిన విషయం తెలిసిందేననీ ఈ సందర్భంగా రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు. నిష్కల్మషమైన వ్యక్తిత్వం కలిగి,  ఒక్క రూపాయి అవినీతి కూడా చేయని ఎన్టీ రామారావు, ఈ సంఘటన జరిగిన ఏడాదిన్నర లోపు మహాభినిష్క్రమణం చెంది ఉండకపోతే, మళ్లీ ముఖ్యమంత్రి అయి ఉండే వారేమోనని, పార్టీ పగ్గాలను కూడా ఆయనకే అప్పగించి ఉండే వారేమోనని రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు. వైస్రాయ్ హోటల్ ఎదురుగా ఎన్టీరామారావు పై చెప్పుల దాడి చేశారంటూ తన సొంత పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను  ఆయన ఖండించారు. ఆ చెప్పులు లక్ష్మీపార్వతి పై వేసి ఉంటారని అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీరామారావుకే కాదు, ఎన్టీఆర్ ఫోటో కు కూడా ఈరోజుకు దండ వేసి దండం పెట్టే వారే ఉన్నారని, ఆయనపై చెప్పుల దాడి చేయాలన్న నీచ సంస్కృతి ఎవరికీ లేదన్నారు.

 లక్ష్మీపార్వతి స్పందించిన తీరుతో అందరికీ అనుమానం నివృత్తి

 ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై నందమూరి లక్ష్మీపార్వతి స్పందించిన తీరుతోనే, తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ఎందుకు తలెత్తిందో ఎవరికైనా అనుమానం ఉండి ఉంటే, ఆ అనుమానం ఈరోజు తో  నివృత్తి అయినట్లు అయ్యిందని రఘురామకృష్ణం రాజు అన్నారు. తనని జిల్లాకు పేరు పెట్టామంటావా?, హెల్త్ యూనివర్సిటీ పేరు తీసివేయమంటావా?? అని జగన్మోహన్ రెడ్డి అడిగితే, జిల్లాకే పేరు పెట్టమని కోరుకునేదాన్ని లక్ష్మీపార్వతి  వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును నిరసిస్తూ, కనీసం మాట వరసకైనా రాజీనామా చేస్తానని పేర్కొనకపోవడం ఆమె నైజాన్ని తెలియజేస్తుందన్నారు.    ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును పరోక్షంగా లక్ష్మీపార్వతి సమర్ధించారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు.  సాక్షి, బ్లూ చానల్స్ ద్వారా ఆమె వల్లే ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీలో అవమానం జరిగిందని రాష్ట్ర ప్రజలకు అర్థమయిందన్నారు. 
 ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ లను తూలనాడుతూ, ఇక చంద్రబాబు నాయుడు, రాధాకృష్ణల మధ్య జరిగిన సంభాషణ వీడియోను వక్రీకరిస్తూ, వర్సిటీ పేరు మార్పు గురించి వారిద్దరి మధ్య చర్చకు వచ్చినట్లు లక్ష్మీపార్వతి పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. తమ ప్రభుత్వ పెద్దలు దొంగ డబ్బింగ్ చెప్పించి, ఆ వీడియోను అసెంబ్లీలో కూడా ప్రదర్శించారని గుర్తు చేశారు.

 తల్లికి చెల్లి పోటు, బాబాయికి గొడ్డలి పోటు...

 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో 16 నెలల పాటు  జైలులో ఉన్నప్పుడు, పార్టీకి అండగాతల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ఉన్నారని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. చెల్లి షర్మిల రోడ్డు ఎక్కి పార్టీ కోసం పాద యాత్ర చేశారన్నారు. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డిని ఓదార్పు యాత్ర చేయనివ్వలేదని కానీ షర్మిల పాదయాత్ర చేశారన్నారు. పార్టీని కాపాడడానికి ప్రయత్నించిన తల్లి,చెల్లిఇద్దరినీ ఏమి చేశారో ప్రజలకు తెలుసునన్నారు. పార్టీ నుంచి తల్లిని చెల్లిని పంపించి వేశారని, చెల్లి తెలంగాణలో వైఎస్ఆర్ టిపి పార్టీని  ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మనమేమో తల్లిని చెల్లిని పార్టీ నుంచి పంపించి వేయవచ్చు కానీ, పార్టీకి క్షేమం కోసం ప్రజలు, పార్టీ పెద్దలు, ప్రజా ప్రతినిధులు ఏకమై ఒక నిర్ణయం తీసుకొని చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటే, దాన్ని వెన్నుపోటు అని అంటారా?  అని ఎద్దేవా చేశారు . ఎన్టీఆర్ కు అది చేశారు... ఇది చేశారని ఇన్ లాజికల్ గా మాట్లాడే ముందు, తల్లికి పోటు చెల్లికి పోటు, బాబాయికి గొడ్డలి పోటు వేసింది ఎవరన్నారు. బాబాయికి గొడ్డలి పోటు మనము వేశామనడం లేదు... మనకు కావలసినవారు వేశారని  ప్రజలు  అనుకుంటున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్పుపై అసెంబ్లీలో మాట్లాడిన లేకి మాటలకు 
సోషల్ మీడియాలో అల్లరి చేసుకునే పరిస్థితులను కల్పించుకున్నది   మనమేనని అపహాస్యం చేశారు .

 ఈసీ కి సుదీర్ఘ లేఖ

 కేంద్ర ఎన్నికల సంఘానికి రఘురామకృష్ణం రాజు సుదీర్ఘ లేఖను రాశారు. యువజన రైతు శ్రామిక పార్టీ పేరును, పార్టీ రాజ్యాంగం షెడ్యూల్ ఒకటిని సవరించి, ఇకపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీగా మార్చుకుంటున్నట్లు పార్టీ ప్లీనరీలో తమ పార్టీ నాయకులు తీర్మానించారని  గుర్తు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీగా పేరును మార్చుకునే అవకాశం ఉన్నప్పటికీ, వైయస్సార్  పేరును రాష్ట్రంలోని పురపాలక సంఘాల భవనాలకు, ప్రభుత్వ ఆసుపత్రులకు, రోడ్లకు,  ఇతర సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందన్న ఆయన, ఒకవేళ తమ పార్టీ పేరును వైయస్సార్ కాంగ్రెస్ పార్టీగా మార్చుకోవడానికి అనుమతిస్తే, రేపు ఎన్నికల సమయంలో, ఈ భవనాల పేర్లను గుడ్డలతో కప్పేడుతారా? అంటూ ప్రశ్నించారు. అప్పుడు ఏ బిల్డింగ్ ఏమిటో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీగా, యువజన రైతు శ్రామిక పార్టీ పేరు మార్చడానికి అవకాశం కల్పిస్తే, ఆ భవనాల, రోడ్లు, ఆసుపత్రుల  పేర్లను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఒకవేళ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించకపోతే, తాము న్యాయస్థాన్ని ఆశ్రయించడం మినహా మరొక గత్యంతరం లేదని అన్నారు. పార్టీ పేరును కాపాడుకునే వ్యక్తిగా ఆ బాధ్యత తనపై ఉన్నదన్నారు.

 ఎన్నిక దేనికోసం జరిగింది


 పార్టీ జీవితకాల అధ్యక్ష పదవి కోసం ఎన్నిక జరిగిందనీ 
 ఒక కార్యదర్శి పేర్కొంటుంటే, మరొక కార్యదర్శి మాత్రం... జీవితకాల అధ్యక్షుడిగా ఎన్నిక కు జగన్మోహన్ రెడ్డి అంగీకరించలేదని మరొక కార్యదర్శి చెబుతున్నారని రఘురామకృష్ణం రాజు వెల్లడించారు. అసలు ఎన్నిక దేనికోసం జరిగిందని ఆయన ప్రశ్నించారు. పార్టీ జీవితకాల అధ్యక్ష పదవి కోసమే ఎన్నిక జరిగినట్లు  తమ పార్టీ అధికార పత్రికైనా సాక్షిలో రాసిన వార్తా కథనాల క్లిప్పింగ్, సాక్షి మీడియాలో వచ్చిన వీడియో ఫుటేజ్ జతచేసి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపినట్లుతెలిపారు. జీవితకాల అధ్యక్ష పదవి కోసమే ఎన్నిక జరగడం వల్లే , ప్రజాస్వామ్య వ్యవస్థ పై గౌరవం ఉన్న వ్యక్తిగా తాను పోటీ చేయలేదని చెప్పారు. ప్రజాస్వామ్య బద్ధంగా పార్టీ ఏ ఒక్కరి ఆస్తి కాదని, ఈ విషయం పార్టీ రాజ్యాంగంలోనే పేర్కొనడం జరిగిందని గుర్తు చేశారు. జీవితకాల అధ్యక్షుడిని ఎన్నుకోలేదని చెప్పినట్లుగానే,  మా పార్టీ పేరును కూడా మార్చడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ఖండిస్తే చూద్దామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ కేసులను సుప్రీం కోర్టులో వాదిస్తున్న న్యాయవాది, వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న శివ శంకర్ రెడ్డి తరఫున కూడా వాదించడం అనుమానాలకు తావునిస్తుందన్నారు. సుప్రీంకోర్టులో శివ శంకర్ రెడ్డి కి చుక్కెదురు కావడం ముందే ఊహించిందేనని రఘురామకృష్ణం రాజు వ్యాఖ్యానించారు.  ఈ దశలో హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోలేమని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నదని వెల్లడించారు..