home page

ఆ అధికారం మీకెక్కడిది

ఏపి ప్రభుత్వాన్ని నిలదీసిన న్యాయ స్ధానం

 | 
hc

సింహాచలం దేవస్థానం ఆస్తులను క్రమబద్ధీకరించేందుకు చట్టం చేయడానికి ఏపి హైకోర్టు వీల్లేదంది. ఇతరుల ఆస్తుల విషయంలో చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడిదని ఘాటుగా వ్యాఖ్యానించింది.

విశాఖ జిల్లాలోని అడవివరం, వెంకటాపురం, వేపగుంట, పురుషోత్తపురం, చీమలపల్లి గ్రామాల్లో (పంచగ్రామాలు) నరసింహస్వామి దేవస్థానానికి చెందిన భూముల్లో వెలిసిన ఇళ్లు, ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించే నిమిత్తం రాష్ట్రప్రభుత్వం 2019లో తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్‌ చేస్తూ విజయవాడకు చెందిన రామనాథం రామచంద్రరావు హైకోర్టులో పిల్‌ వేశారు. ఈ వ్యాజ్యంపై 2019 ఏప్రిల్‌ 27న విచారణ జరిపిన హైకోర్టు.. భూముల క్రమబద్ధీకరణపై యథాతథ స్థితి పాటించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. గురువారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వీవీ సతీష్‌ వాదనలు వినిపిస్తూ.. దేవాలయాల భూముల విక్రయం, క్రమబద్ధీకరణకు వీల్లేదని 2005లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని అధిగమించేందుకు సింహాచల భూముల విషయంలో 'చట్టం' తీసుకొచ్చారన్నారు. ఆ చట్టాన్ని రద్దు చేయాలని కోరారు.

ఇది ప్రభుత్వ పథకమన్న ఏజీ

ధర్మాసనం దీనిపై వివరణ కోరగా.. ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ స్పందిస్తూ ఇది ప్రభుత్వ పథకమని చెప్పారు. ఆక్రమణదారుల నుంచి క్రమబద్ధీకరించగా వచ్చే సొమ్మును దేవస్థానానికి జమచేస్తామన్నారు. కోల్పోయిన భూమికి ప్రత్యామ్నాయంగా మరోచోట భూమి చూపుతామని తెలిపారు. ఏళ్ల తరబడి ఆ భూముల నుంచి దేవస్థానానికి ఆదాయం రావడంలేదని, క్రమబద్ధీకరణ ద్వారా కొంత ఆదాయం చేకూరుతుందని వివరించారు. సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణ అధికారి తరఫు న్యాయవాది కె.మాధవరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆక్రమణదారులను ఖాళీ చేయించే పరిస్థితి లేదని, ప్రభుత్వ నిర్ణయంతో దేవస్థానానికి ఆదాయం వస్తుందని చెప్పారు. క్రమబద్ధీకరణకు అనుమతి ఇవ్వాలని కోరారు. ధర్మాసనం స్పందిస్తూ.. దేవస్థానానికి చెందిన విలువైన భూముల్ని క్రమబద్ధీకరణ పేరుతో వేరేవారికి కట్టబెట్టే అవకాశం ఉందని పేర్కొంది. ప్రత్యామ్నాయంగా తక్కువ విలువ ఉన్న భూములను దేవస్థానానికి అప్పగించే ప్రమాదం లేకపోలేదని తెలిపింది. ప్రభుత్వం, దేవస్థానం సైతం కుమ్మక్కై క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టాయా? అనే కోణాన్ని సైతం పరిశీలించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. మీదికాని భూమిని ఆక్రమణలదారులకు ఏవిధంగా క్రమబద్ధీకరిస్తారని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్తులో ఇతరుల ప్రైవేటు ఆస్తులను భూమిలేని పేదలకు ఇస్తామంటారని వ్యాఖ్యానించింది. తుది వాదనలకు సిద్ధపడి రావాలని ఇరువైపుల న్యాయవాదులకు సూచిస్తూ విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.