కేసిఆర్ ఫెడరల్ పార్టీ ఏమైనట్టు?
టిఆర్ఎస్ తో పొత్తు ఉండదు : కాంగ్రెస్ ఠాకూర్

కేసీఆర్‌కు 'హ్యాండ్' ఇస్తున్న పీకే
కాంగ్రె్‌సను కలుపుకొని పోయేందుకు టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ సిద్ధం
కేసీఆర్ ఢిల్లీ దీక్షకు విపక్షాల సంఘీభావమేదీ?.. టికాయత్ తప్ప వచ్చిందెవరు?
2024 ఎలక్షన్స్‌కు ముందు 7 రాష్ట్రాల ఎన్నికల్లో ప్రధాన పార్టీగా కాంగ్రెస్
ఆ పార్టీని కాదని బలమైన బీజేపీయేతర కూటమిని ఏర్పాటు చేయడం అసాధ్యం
ఫెడరలిజం, గవర్నెన్స్ విషయంలో బీజేపీపై పోరాటానికే కేసీఆర్ మద్దతు అవసరం
రాజకీయ పోరాటం విషయానికి వస్తే కేసీఆర్ ఫ్రంట్‌కు అవకాశమే లేదు: నిపుణులు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు అటకెక్కినట్టే కనిపిస్తున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ అంటే ప్రాంతీయ పార్టీల కూటమి.. జాతీయ పార్టీలు లేని కూటమి, కాంగ్రెస్సేతర, బీజేపీయేతర కూటమి ఏర్పాటు చేయాలన్నది కేసీఆర్ ఆలోచన. కానీ.. కాంగ్రెస్ లేని బీజేపీయేతర ఫ్రంట్ అసాధ్యమని దాదాపు అన్ని ప్రతిపక్షాలూ తేల్చేశాయి. దేశంలో చెలరేగుతున్న మతహింస, విద్వేషాలపై మోదీ మౌనాన్ని ప్రస్తావిస్తూ 13 ప్రధాన ప్రతిపక్షాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటన ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ సహా పలు పార్టీల నేతల పేర్లు ఆ ప్రకటనలో ఉన్నాయిగానీ.. ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన చేస్తున్న కేసీఆర్ పేరు లేకపోవడం గమనార్హం.
బీజేపీతో పోరాటానికి తామే నేతృత్వం వహిస్తామన్న దీదీ కూడా కాంగ్రెస్‌ను అనివార్యంగా అంగీకరిస్తున్న వైఖరిని.. యూపీ ఎన్నికల ఫలితాల తర్వాత మారిన ధోరణిని సూచిస్తోంది. తాము ఐక్యంగా లేకపోతే బీజేపీకే ప్రయోజనం అనే విషయాన్ని ప్రతిపక్షాలు గ్రహించిన విషయాన్ని తెలియజేస్తోంది. ఈ సంయుక్త ప్రకటనలో ఆప్ అధినేత కేజ్రీవాల్ పేరు లేకున్నప్పటికీ.. ఇటీవల గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె్‌సతో కలవడానికి ఆప్ ఆసక్తి చూపింది. కానీ ఆ పొత్తు కుదరలేదు. త్వరలో గుజరాత్ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల్లో కూడా తమకు కొన్ని సీట్లు ఇస్తే కాంగ్రె్‌సతో పొత్తుకు సిద్ధమనే సంకేతాలను ఆప్ పంపిస్తున్నట్టు సమాచారం. మరోవైపు.. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఇప్పటిదాకా కేసీఆర్ కాంగ్రె్‌సతో కలిసి ఉన్న పార్టీల నేతలను కలిసి మాట్లాడారే తప్ప..
బీజేపీతో కలిసి ఉన్న పార్టీలను కలిసి, వాటిని ఒప్పించే ప్రయత్నాలు చేయని విషయాన్ని ప్రధాన ప్రతిపక్షాలు గమనిస్తున్నాయి. అలాంటి కూటమి వల్ల విపక్షాల ఓట్లు చీలి బీజేపీకి ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నాయి. అందుకే సంయుక్త ప్రకటనలో కేసీఆర్ పేరును చేర్చలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక.. రాష్ట్రంలో టీఆర్‌ఎ్‌సకు సర్వేలు చేస్తున్న ప్రశాంత్ కిశోర్ సైతం కొద్దిరోజుల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు సమాచారం. వీటన్నింటి నేపథ్యంలోనే.. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనకు పూర్తిగా గండిపడినట్టే భావించవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మద్దతు ఏదీ?
ఇటీవల ఢిల్లీలో సీఎం కేసీఆర్ దీక్ష చేస్తే రైతు నేత టికాయత్ వచ్చారు తప్ప.. దానికి ప్రాంతీయ పార్టీలేవీ మద్దతు తెలపని సంగతి తెలిసిందే. కనీసం సామాజిక మాధ్యమాల్లోనైనా ఏ పార్టీ నేతా కేసీఆర్ దీక్ష గురించి ప్రస్తావించలేదు. ఇక.. త్వరలో బీజేపీయేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముంబైలో సమావేశం కానున్నట్టు సంజయ్‌రౌత్ తాజాగా ప్రకటించారు. ఆ సమావేశానికి రావాల్సిందిగా కేసీఆర్, కేజ్రీవాల్‌కు కూడా ఆహ్వానం అందే అవకాశం.. ఆ భేటీకి కేసీఆర్ వెళ్లే అవకాశం కూడా ఉన్నాయి. కానీ.. ఆ భేటీ రాష్ట్రాల అధికారాలను ఆక్రమించే బీజేపీ ప్రయత్నాలను వ్యతిరేకించడానికి పరిమితమవుతుందే తప్ప.. రాజకీయం విషయానికి వస్తే మాత్రం బీజేపీ వ్యతిరేక కూటమి అంటూ ఏర్పాటైతే అందులో కాంగ్రెస్ ఉండాల్సిందేనన్నది పలు ప్రధాన ప్రతిపక్షాల అభిప్రాయంగా ఉంది.
గతంలో కేసీఆర్ తమిళనాడు సీఎం స్టాలిన్‌ను, మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేను, శరద్‌పవార్‌ను కలిసినప్పుడు వారు ఇదే విషయాన్ని విస్పష్టంగా చెప్పారు. ''కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దేశంలో రెండో అతి పెద్ద పార్టీ. అందుకే వారిని కలుపుకొని ముందుకెళ్లడం ముఖ్యం'' అని శరద్‌పవార్ నాలుగు రోజుల క్రితమే మరోసారి తేల్చిచెప్పారు. అటు శివసేన ఎంపీ సంజయ్ రౌత్దీ అదే మాట. కొన్నాళ్లపాటు... కాంగ్రెస్ లేని బీజేపీయేతర ఫ్రంట్‌కు తానే నేతృత్వం వహిస్తానని ఉత్సాహం చూపిన దీదీ కూడా ఇప్పుడు 'హస్తం' పార్టీని కలుపుకొని పోవడానికే సిద్ధమైనట్టు కనిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో..
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీ్‌సగఢ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే. మరో రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రధాన పార్టీగా ఉంది. కాబట్టి, కాంగ్రె్‌సను కాదని కూటమిని ఏర్పాటు చేయడం దాదాపు అసాధ్యమైన పరిస్థితి. అలాగని.. రాష్ట్రంలో కాంగ్రెస్ ఒక ప్రధాన పార్టీగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీతో కలుస్తామని చెప్పడం కేసీఆర్‌కు సాధ్యం కాదు. అటు కాంగ్రె్‌సకూ అది సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం టాగూర్ కూడా కేసీఆర్‌తో పొత్తుండదు అని చెప్పారు. రాహుల్‌గాంధీ సైతం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఈ విషయమై ఇప్పటికే స్పష్టతనిచ్చినట్టు తెలుస్తోంది. అయితే.. కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రత్యర్థిగా కలిగి ఉండి, బీజేపీని వ్యతిరేకిస్తున్న ప్రాంతీయ పార్టీలను ఏదో ఒక రకంగా ఎన్నికలకు ముందుగానీ, తర్వాతగానీ భాగం చేయడానికి ఢిల్లీలో కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. దాంట్లో భాగంగా.. ఫెడరలిజం (రాష్ట్రాల అధికారాలు), పరిపాలన అంశాల విషయంలో ఆయా పార్టీలను ఉపయోగించుకుని బీజేపీని బలహీనపరచాలనే ఆలోచన సాగుతున్నట్టు తెలిసింది. ఆ పాత్రకే కేసీఆర్ పరిమితం కావచ్చు తప్ప.. రాజకీయంగా బీజేపీపై పోరాటం (ఎన్నికల) విషయానికొచ్చేసరికి కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఉండే అవకాశమే లేదని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ను తాను ఏర్పాటు చేసి ఢిల్లీలో చక్రం తిప్పుదామని కేసీఆర్ అనుకున్నప్పటికీ.. అందుకు విపక్షాలు సిద్ధంగా లేవని వెల్లడైందని చెబుతున్నారు.
టీఆర్ఎస్తో పొత్తు ఉండబోదు: ఠాగూర్
హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో తాము టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ స్పష్టం చేశారు. వచ్చే నెలలలో రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న సందర్భంగా టీఆర్ఎస్తో పొత్తుల విషయంలో వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. పొత్తు విషయంలో వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుడు ప్రచారమని చెప్పారు. టీఆర్ఎస్, బీజేపీపై పోరులో తమ వైఖరి మారదని స్పష్టం చేశారు. ఆ రెండు పార్టీల నుంచి తెలంగాణను రక్షించేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు. ఇక, మే 6న వరంగల్‌లో తలపెట్టిన ర్యాలీకి సన్నద్ధమవుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ ర్యాలీలో తమ పార్టీ వైఖరి స్పష్టం చేస్తామని వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఠాగూర్ ట్వీట్ చేశారు.