home page

బోల్తా పడిన ఏపీ అప్పు

తిరోగమనం వైపు -ఆర్ధిక వ్యవస్థ

 | 
Appulu

దేశవ్యాప్తంగా 'శ్రీలంక'పైనే చర్చ

సంక్షోభంలోనూ అగ్రస్థానం!

రాష్ట్రాల అతి అప్పులపై కేంద్రం ఆందోళన

అప్పులు, ఆదాయ లోటులో ఏపీదే 'అగ్రస్థానం'

సొంత ఆదాయంలో ఉచితం, సబ్సిడీలకే 73ు

జీతాలు, పెన్షన్లు, తప్పనిసరి ఖర్చులకు అప్పే గతి

చేస్తున్న అప్పులు దాచేస్తూ మరో పెద్ద తప్పు

బడ్జెట్‌ పుస్తకాల సాక్షిగా తప్పుడు లెక్కలు

ఇది ఆంధ్రప్రదేశ్‌ సంగతి మాత్రమే కాదు!

దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇదే గుబులు! 'శ్రీలంక' నేర్పుతున్న గుణపాఠాలు! పాకిస్థాన్‌ రేపుతున్న సందేహాలు! 'ఎడాపెడా అప్పులు చేయడం... దీనజనోద్ధరణ ముసుగులో మళ్లీ అధికారం కోసం సంక్షేమ మంత్రం జపించడం! ఇలా చేస్తూ పోతే రాష్ట్రాలు దివాలా తీయడం ఖాయమని... దేశంపైనా ఆ ప్రభావం పడుతుందని చర్చ మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశంలో... సీనియర్‌ బ్యూరోక్రాట్లు ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కొన్ని రాష్ట్రాలు మితిమీరి చేస్తున్న అప్పులపై ఆందోళన వ్యక్తం చేశారు.

పరిస్థితి ఇలాగే కొనసాగితే... 'శ్రీలంక తరహా సంక్షోభం తప్పదు' అని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే... ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి, అలవిమాలి చేస్తున్న అప్పులు, ప్రజాకర్షక పథకాలపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అంతేకాదు... రాష్ట్రాల అప్పులకు కళ్లెం వేయడంపై కేంద్రం కూడా చర్యలు చేపట్టింది. పరిస్థితులు తలకిందులై, నిజంగానే శ్రీలంక తరహా సంక్షోభం తలెత్తితే... అది ఆంధ్రప్రదేశ్‌తోనే మొదలవుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే... రాష్ట్రంలో అభివృద్ధి అటకెక్కింది. సొంత ఆదాయం పెరగడంలేదు. ఎంతసేపూ... అప్పు... అప్పు... అప్పు! ఇదే మాట, అదే బాట! పేదలను ఆదుకోవడం, ఆపన్న హస్తం అందించడం తప్పు కాదు! కానీ... ఆ డబ్బులు ఎలా తెస్తున్నారు? అప్పులు తెస్తూ ఎన్నేళ్లు పథకాలు అమలు చేయగలరన్నదే అసలు ప్రశ్న అని నిపుణులు పేర్కొంటున్నారు.

నివురుగప్పిన నిప్పులా...

తప్పులు జరిగినప్పుడు ఒప్పుకొని.. దానిని సరిదిద్దుకుంటే మంచిది. కానీ... ఏపీ పరిస్థితి వేరు. అప్పుల నిప్పును అబద్ధాల దుప్పటి కప్పి దాచేస్తోంది. మున్ముందు అదే రాష్ట్రాన్ని దహించి వేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బడ్జెట్‌ పత్రాల సాక్షిగానే ప్రభుత్వం అబద్ధాలు చెబుతుండటం నివ్వెరపరుస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు రూ.19,545 కోట్లు మాత్రమే ఉంటుందని బడ్జెట్‌ పత్రాల్లో సవరించిన అంచనాల్లో పేర్కొన్నారు. కానీ... కాగ్‌ ఇచ్చే నెలవారీ నివేదికలను చూస్తే లోటు రూ.24,000 కోట్లుగా తేలుతుంది. ఇదికాకుండా ఏపీఎ్‌సడీసీలో చూపించిన ఖర్చు రూ.4,700 కోట్లు, ఏపీఆర్‌డీసీలో రూ.2000 కోట్లు, ఏపీ స్టేట్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కార్పొరేషన్‌లో రూ.10,000 కోట్లు... ఇవన్నీ కలిపితే ప్రాథమికంగా రెవెన్యూ లోటు అంచనా రూ.40,700 కోట్లకు చేరుతుంది. ఇవన్నీ విస్మరించి లోటు రూ.19,545 కోట్లు మాత్రమే ఉంటుందంటూ పేర్కొనడం ఆర్థిక శాఖ చేస్తున్న మాయలకు నిదర్శనం.

3వ పేజీలో ఒకలా... 14వ పేజీలో మరోలా

2022-23 బడ్జెట్‌ సందర్భంగా ప్రచురించిన పుస్తకాల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరి చెవిలో జగన్‌ సర్కార్‌ పూలు పెట్టింది. అప్పులను దాచే ప్రయత్నంలో భాగంగా ఒక దగ్గర సరిచేసిన లెక్కను మరోచోట సరిచేయడం మర్చిపోయారో, సరిచేయడం కుదరక వదిలేశారో తెలీదు కానీ... జగన్‌ ప్రభుత్వం అప్పులను దాస్తోందనడానికి ఇది సాక్ష్యంగా నిలిచింది. బడ్జెట్‌ పుస్తకాల్లోని వాల్యూమ్‌ 6లోని 3వ పేజీలో ఓపెన్‌ మార్కెట్‌ బారోయింగ్స్‌ (కేంద్రం అనుమతితో ఆర్‌బీఐ వద్ద రాష్ట్ర సెక్యూరిటీలు వేలం వేసి తెచ్చే అప్పు) రూ.46,443 కోట్లుగా చూపించారు. అదే పుస్తకంలో 14వ పేజీలో పబ్లిక్‌ డెట్‌ (రాష్ట్ర ఖజానా నుంచి తీర్చే అప్పు) రూ.40,000 కోట్లు మాత్రమే పెరిగిందని టేబుల్‌ వేసి మరీ చెప్పారు. ఒక్క ఆర్‌బీఐ నుంచి తెచ్చిన అప్పు రూ.46,443 కోట్లు ఉంటే, మొత్తం అప్పు 40,000 కోట్లు మాత్రమే పెరిగిందనడం అబద్ధం కాదా? అప్పులు దాస్తున్నట్టు కాదా? అలాగే... 14వ పేజీలో 2020-21లో పబ్లిక్‌ డెట్‌ రూ.3,50,556 కోట్లని రాశారు. 2020-21 సవరించిన అంచనాల్లో అది... రూ.3,90,670కోట్లకి పెరుగుతుందని రాశారు.

ఈ రెండింటి మధ్య వ్యత్యాసం రూ.40,114 కోట్లు. కానీ, ఆర్‌బీఐ నుంచి తెచ్చిన అప్పు రూ.46,443 కోట్లు, కేంద్రం నుంచి తీసుకున్న ఈఏపీ లోన్లు రూ.3976 కోట్లు, నాబార్డు లోన్లు రూ.1600 కోట్లు, పబ్లిక్‌ అకౌంట్‌ నెట్‌ (ఉద్యోగుల పీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ డబ్బులు) సగటున రూ.11,000 కోట్లు... ఇవన్నీ కలుపుకొంటే మొత్తం పబ్లిక్‌ డెట్‌ రూ.4,18,689 కోట్లకు చేరుతుంది. కానీ, ప్రభుత్వం 14వ పేజీలో చూపిన పబ్లిక్‌ డెట్‌ మాత్రం రూ.3,90,670 కోట్లు మాత్రమే. అంటే, రూ.28,019 కోట్ల అప్పును దాచేశారన్న మాట! వీటికి తోడు కార్పొరేషన్ల అప్పులు, పెండింగ్‌ బిల్లులు కలుపుకొంటే ఏపీ మొత్తం అప్పు రూ.7,80,000 కోట్ల వరకు ఉంటుంది. కేంద్రం, నీతి ఆయోగ్‌, సర్వే కోసం ఇతర సంస్థలు అడిగినప్పుడు ప్రభుత్వం ఈ వాస్తవిక లెక్కలు ఇవ్వదు! అందుకే... అప్పుల్లో ఏపీకంటే ఇతర రాష్ట్రాలు ముందున్నట్టు నివేదికలు వెలువడుతున్నాయి. అసలు లెక్కలు బయటపెడితే ఏపీదే అగ్రస్థానం.

(ఆంధ్ర జ్యోతి సౌజన్యంతో)