home page

రెవెన్యూ ప్రక్షాళనలో సాయిప్రసాద్ ముద్ర !

నెలవారీగా పనితీరు మదింపు

సీసీఎల్ఏ సమగ్ర కార్యాచరణ
 

 | 
Saiprasad

జిల్లా కలెక్టర్ల పనితీరు మదింపు:

పన్నెండు అంశాలు ప్రాతిపదిక 

ఇటీవల కాలంలో రెవెన్యూశాఖ పనితీరుపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు వచ్చాయి. కొత్త గా రెవెన్యూ శాఖ మంత్రి పదవిని చేపట్టిన ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ శాఖ లో అవినీతి ఆరోపణలు ఉన్నాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. దానిపై అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ ఉద్యోగులు సైతం తాము ఎంతో కష్టపడి పని చేస్తామని, అనుభవం ఉన్న మంత్రి ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తే ఎలా అని ఎదురు ప్రశ్నించారు. ఈనేపధ్యంలో నే రాష్ట్రం లో రెవెన్యూ శాఖ సేవలు మరింత పారదర్శకంగా ఉండేందుకు ఆశాఖాధిపతి ,సీనియర్ ఐఏఎస్ జి.సాయి ప్రసాద్ కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రెవెన్యూ అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి కొన్ని మార్పులు చేర్పులు చేసి రికార్డు సృష్టించారు. మొన్న ప్రజలకు సంబంధించిన అంశాలు అధ్యయనం చేసి పలు ఆదేశిక సూత్రాలు జారీ చేశారు. ఇప్పుడు ఆయా మార్గదర్శకాలు అమలులో అధికారుల పాతరను స్పష్టం చేస్తూ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు. ఇటీవల కాలంలో రెవెన్యూ వ్యవస్ధను ఇంతగా అధ్యయనం చేసిన అధికారి ఎవరూ లేరు. ఆయన చేపట్టిన ప్రక్షాళనలో 12 అంశాల్లో సీసీఎల్‌ఏకు నివేదికలివ్వాలి

కలెక్టర్లకు ప్రభుత్వం నెలవారీ లక్ష్యాలు

నిర్దేశిత ఫార్మాట్లలో పంపాలని ఆదేశం

వారి పనితీరు మదింపునకు మాస్టర్‌ప్లాన్‌                 జిల్లా కలెక్టర్ల పనితీరును మదింపు చేసేందుకు ప్రభుత్వం మాస్టర్‌ప్లాన్‌ వేసింది.

రెవెన్యూతోపాటు ఇతర కీలక అంశాలపై వారు దృష్టిసారించేలా కీలకమైన బాధ్యతలు అప్పగించింది. నెలలో 12 అంశాలపై జిల్లా, డివిజనల్‌ స్థాయుల్లో సమీక్షలు జరిపి ఆయా అంశాలపై నెలవారీ పురోగతిని తెలియజేసేలా భూ పరిపాలనా ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)కు నివేదికలు పంపించాలని కలెక్టర్లను ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) కార్యాలయం నుంచి ఇటీవల రెండు కీలకమైన సర్క్యులర్లు వారికి చేరాయి. ఈ ఉత్తర్వులను ప్రస్తావిస్తూ.. 12 అంశాలపై నిర్దేశిత ఫార్మాట్ల ప్రకారం తనకు నివేదికలు అందించాలని సీసీఎల్‌ఏ జి.సాయిప్రసాద్‌ జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో ప్రతి కలెక్టరూ జవాబుదారీగా ఉండాలని, తామడిగిన నివేదికలు ఇచ్చి తీరాల్సిందేనని ఆయన ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆశించిన ఫలితాలు సాధించని వారిని నేరుగా సీఎం వద్దకు తీసుకెళ్లి కూర్చోబెడతానని హెచ్చరించారు కూడా. ముదుర్లకు వేరే ట్రీట్‌మెంట్‌ ఉం టుందని నర్మగర్భ వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపఽథ్యంలో ఎవరి పనితీరు ఏమిటో, సగటున ఒక నెలలో ఏ కలెక్టర్‌ ఎన్ని ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాల అమలను పర్యవేక్షించి సమీక్షించారో.. ఎంతవరకు వాటిలో పురోగతి చూపించారో నిర్ధారించేందుకు నివేదికలు కోరారు. నివేదికలు ఏ ఫార్మాట్‌లో ఉండాలో కూడా నిర్దేశించారు. వాటి ఆధారంగా ఆయా కార్యక్రమాల అమలుపై కలెక్టర్‌కున్న శ్రద్ధ ఏపాటిదో తెలుసుకోవచ్చు. ప్రతి నెలా కలెక్టర్‌ జిల్లా, సబ్‌ డివిజనల్‌ స్థాయిలో ఆ అంశాలపై విధిగా సమీక్షలు నిర్వహించాలి. ఆయా కార్యక్రమాల అమలు పురోగతిని స్వయం గా తెలుసుకోవాలి. పురోగతి లేకుంటే లోపాలను సరిదిద్దుకునేలా మార్గదర్శకాలు కూడా ఇచ్చారు.

ఆ 12 అంశాలివీ..

భూముల సమగ్ర సర్వే: జిల్లా పరిధిలో మొత్తం ఎన్ని గ్రామాలున్నాయి.. భూముల విస్తీర్ణం, సర్వే పూర్తయినవి, సర్వే కొనసాగుతున్నవి, పురోగతి శాతంపై నివేదిక ఇవ్వాలి. దీనిని సీసీఎల్‌ఏ నిశితంగా పరిశీలిస్తారు కాబట్టి జిల్లా కలెక్టర్‌ విధిగా ఇకపై ప్రతి నెలా భూముల సర్వేపై పర్యవేక్షణ చేయాల్సిందే. సర్వే పురోగతిని స్వయంగా తెలుసుకుని నివేదిక రూపంలో అందించాల్సిందే.

భూ రికార్డుల స్వచ్ఛీకరణ (పీవోఎల్‌ఆర్‌): ప్రస్తుత భౌతిక భూమి రికార్డులను వెబ్‌ల్యాండ్‌లో ఉన్న డిజిటల్‌ రికార్డులతో సరిపోల్చి లోపాలను సరిదిద్దే కార్యక్రమమిది. ఇప్పటివరకు ఏ మేరకు రికార్డుల స్వచ్ఛీకరణ పూర్తయింది.. పెండింగ్‌ ఎంత.. దీనికి కారణాలను నివేదికలో స్పష్టం చేయాలి.

రీ సర్వేలో అపరిష్కృత ఎల్‌పీఎంల పరిష్కారం: భూములకు ఇప్పటి వరకు కేవలం సర్వే నంబర్‌, సబ్‌ డివిజన్‌ నంబర్‌ ఇస్తున్న సంగతి తెలిసిందే. రీ సర్వే నుంచి ప్రతి భూకమతానికీ సర్వే నంబర్‌తోపాటు ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌ (ఎల్‌పీఎం) నంబర్‌ ఇస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ఎల్‌పీఎంపరిష్కారంపైనా కలెక్టర్‌ నివేదిక పంపించాలి.

స్పందన కేసుల పరిష్కారం: ప్రజల విన్నపాలను స్పందన పేరిట పరిష్కరిస్తున్నారు. ఒక నెలలో స్పందన పేరిట ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఎన్ని పరిష్కరించారు.. పెండింగ్‌లో ఉన్నవెన్ని.. తిరిగి ఎన్ని తెరిచారు.. పురోగతిలో ఉన్నవాటిపై నివేదికలు ఇవ్వాలి.

మ్యుటేషన్‌ దరఖాస్తుల పరిష్కారం: భూముల మ్యుటేషన్లు కోరుతూ వస్తున్న దరఖాస్తులను అడ్డగోలుగా తిరస్కరిస్తున్న ఉదంతాలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో సగటున నెలకు ఎన్ని మ్యుటేషన్‌ దరఖాస్తులు వచ్చాయి.. ఎన్ని తిరస్కరించారు.. ఎన్ని ఆమోదించారు.. ఏ స్థాయిలో పెండింగ్‌లో ఉన్నాయి? మ్యుటేషన్‌ ఆమోదించినవి, పాస్‌బుక్‌లు ఆమోదించిన కేసులు ఎన్ని.. ఇలా మ్యుటేషన్లకు సంబంధించి 11 అంశాల్లో కలెక్టర్‌ వివరాలందించాలి.

22-ఏ కేసుల పరిష్కారం:నిషేధిత భూముల జాబితా నుంచి విముక్తి కోరుతూ వచ్చిన దరఖాస్తుల పరిష్కారం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఈ అంశంపై కలెక్టర్ల నుంచి నివేదికలు కోరుతున్నారు. 22-ఏలోని ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీల్లో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. ఎన్ని తిరస్కరించారు.. ఎన్ని ఆమోదించారు.. ఎన్ని పరిష్కరించారు.. ఎన్ని పెండింగ్‌లో ఉంచారు..అన్న అంశాలపై కలెక్టర్లు స్పష్టమైన నివేదికలను ప్రతి నెలా సీసీఎల్‌ఏకు పంపించాలి.

సర్టిఫికెట్ల జారీ: విద్యార్థులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఇచ్చే సర్టిఫికెట్లపై కూడా కలెక్టర్లు నెలనెలా నివేదికలు ఇవ్వాల్సి ఉంటుంది.

పట్టా సబ్‌డివిజన్‌ దరఖాస్తుల పరిష్కారం: రెవెన్యూకు సంబంధించి భూముల పట్టా సబ్‌ డివిజన్‌ దరఖాస్తుల పరిష్కారంపై కూడా నివేదికలు పంపించాలి.

ఎఫ్‌ లైన్‌ పిటిషన్ల పరిష్కారం: గ్రామీణ ప్రాంతాల్లో భూముల సరిహద్దులను తేల్చాలని కోరుతూ వచ్చే ఫీల్డ్‌ లైన్‌ (ఎఫ్‌ లైన్‌) దరఖాస్తుల పరిష్కారంపై కూడా నెలనెలా కలెక్టర్లు నివేదిక ఇవ్వాలి. నెలలో ఎన్ని పిటిషన్లు వచ్చాయి.. ఎన్ని పరిష్కరించారు.. ఎన్ని పెండింగ్‌లో ఉంచారు.. ఎన్ని తిరస్కరించారో తెలియజేయాలి. ఇందుకు సబ్‌ డివిజనల్‌ స్థాయిలో సమీక్షలు చేయాలి. ఎఫ్‌ లైన్‌ పిటిషన్ల పరిష్కార బాధ్యతను ఇటీవలే గ్రామ సర్వేయర్‌కు అప్పగిస్తూ సీసీఎల్‌ఏ ఉత్తర్వు లిచ్చిన నేపఽథ్యంలో కలెక్టర్లు మరింత దృష్టిపెట్టేలా పర్యవేక్షణ జాబితాలోకి తీసుకొచ్చారు.

రెవెన్యూ వసూళ్లు: రెవెన్యూశాఖ భూముల వినియోగ మార్పిడి ఫీజు, నీటితీరువాలను వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. జిల్లా వారీగా ఏ సేవకు ఎంత పన్ను వసూలు చేశారో తెలియజేస్తూ నివేదిక ఇవ్వాలి.

90 రోజుల్లో ఇల్లు స్కీమ్‌: పేదలు ఇంటిస్థలం కోరుతూ దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోనే పరిష్కారం చూపాలని సర్కారు ఇటీవల మార్గదర్శకాలు ఇచ్చింది. ఈ నేపఽథ్యంలో ఈ స్కీమ్‌ కింద ఎన్ని దరఖాస్తులు వచ్చాయి.. పరిష్కరించినవి..తిరస్కరించినవి ఎన్ని.. తదితర వివరాలపై కలెక్టర్‌ నివేదికలు ఇవ్వాలి.

కోర్టు కేసులు, ధిక్కరణ కేసులు: ఇటీవలి కాలంలో రెవెన్యూతోపాటు అనేక శాఖలపై కోర్టు కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కలెక్టర్లు మరింత అప్రమత్తంగా ఉండేలా ప్రతి నెలా కోర్టు కేసులపై నివేదికలివ్వాలని సీసీఎల్‌ఏ ఆదేశించారు. కోర్టులు ఏయే అంశాల్లో ఏ పిటిషన్లపై ఎలాంటి ఆదేశాలు ఇచ్చాయి? వాటిని ఎప్పటిలోగా అమ లు చేయాలని ఆదేశించింది.. కోర్టు ఆదేశాలు స్వీకరించిన తేదీ, ఆ ఆదేశాలు అమలు చేశా రా లేదా..కౌంటర్‌ దాఖలు చేశారా.. ధిక్కరణ కేసు నంబరు.. అధికారులు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఇచ్చిన ఆదేశాలు.. ధిక్కార కేసు ఎందుకు దాఖలైందో తెలియజేస్తూ కలెక్టర్లు జిల్లాల వారీగా నివేదికలు పంపాలి.