home page

చుక్కల భూములకు 4 నెలలో పరిష్కారం

రెవెన్యూ సేవలలో మార్పులు:సాయి ప్రసాద్

 | 
Ap map

అన్ని రకాల సేవలకు కాల వ్యవధి ఉండాలి

-ఆటోమ్యుటేషన్‌ ఇక సులభతరం

-2023 నవంబరు నాటికి భూముల రీ సర్వే మిర్రర్ టుడే- అమరావతి బ్యూరో :రాష్ట్ర వ్యాప్తంగా చుక్కల భూముల సమస్య (డాటెడ్‌ ల్యాండ్స్‌)ను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని సిసిఎల్‌ఎ కమిషనరు రెవెన్యూ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్‌ పేర్కొన్నారు.

ఇందుకు సంబందించి 26 జిల్లాల్లో ఇప్పటి వరకు లక్షా పదివేల దరఖాస్తులు రాగా, అందులో వివిధ కారణాలతో 59వేల దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయన్నారు. తిరస్కరణకు గురైన దరఖాస్తులను తిరిగి పరిశీలించి సమస్యను పరిష్కరించాలని ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు సిసిఎల్‌ఎ పేర్కొన్నారు.. సమస్యను పరిష్కరించేందుకు 3నుంచి నాలుగు నెలల సమయం పడుతుందన్నారు. సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం సిసిఎల్‌ఎ కమిషనరు మీడియాతో మాట్లాడారు.

చుక్కల భూముల సమస్యకు పరిష్కారం కనుక్కునేందుకు ప్రభుత్వం కొన్ని సూచనలు చేసిందన్నారు. 2017 నాటికి పట్టాదారు పాసుపుస్తకాలు పొంది ఉండి, అంతకు మునుపు 12 సంవత్సరాలుగా ఆర్‌ఓఆర్‌, అడంగల్‌లో భూ యజమాని, సాగుదారుని పేరు ఉంటే అటువంటి వారికి పాస్‌పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందుకోసం ఫ్రేమ్‌ వర్క్‌ చేయాల్సి ఉందన్నారు. ఆటోమ్యుటేషన్‌ ప్రక్రియను ఎట్టిపరిస్థితుల్లోనూ రెండు నెలల్లో పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

భూముల అమ్మకాలు, కొనుగోలు 75శాతం మేర జరిగాయని, ఫలితంగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు, చేర్పులు జరుగుతూనే ఉంటాయన్నారు. రీ సర్వే ప్రారంభమైన గ్రామాల్లో మ్యుటేషన్‌కు ముందే సబ్‌ డివిజన్‌ తప్పనిసరి చేస్తున్నామన్నారు. ఇదే విధానం కర్నాటకలో అమల్లో ఉందన్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు ముందుగా రెవెన్యూ రికార్డులను వెరిఫై చేయాలని, రెండు రికార్డులు సరిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

రెవెన్యూకు సంబంధించి ఎటువంటి ప్రక్రియ ముందుకు సాగాలన్నా లబ్దిదారులు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, అనంతరం విఆర్‌ఓ, ఆర్‌ఐ లాగిన్‌కు దరకాస్తులు అందుతాయన్నారు. మండల స్ధాయిలో అధికారులు అభ్యంతరాలు పెడితే ఆయా దరకాస్తులు ఆర్డీఓకు పంపుతారన్నారు. 2023 నవంబరు నాటికి భూముల రీ సర్వే ప్రక్రియ పూర్తయ్యే విధంగా పనిచేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 430 గ్రామాల్లో సర్వే ప్రక్రియ పూర్తయ్యిందని, ఆయా గ్రామాలకు సంబంధించిన రికార్డుల తయారీ ప్రక్రియ జరుగుతోందన్నారు.

భూముల కొలతల్లో తేడాలస్తే ఆయా భూముల యజమానులు రెండో విడత కొలతలు వేయాలని ఎవరైనా దరఖాస్తులు చేసుకుంటే అటువంటి వారి భూములు కొలతలు వేసే ముందు ఆయా సర్వే నెంబర్లలోని మిగిలిన భాగస్వాములకు కూడా ముందస్తుగా నోటీసులు ఇవ్వడం జరుగుతుందన్నారు. నకిలీ పాస్‌పుస్తకాలు ఇచ్చారనే ఆరోపణలు వచ్చిన ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో సిబిసిఐడి విచారణ కొనసాగుతోందన్నారు. కుల సర్టిఫికెట్లు, పుట్టినతేదీ, ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్ల మంజూరును సరళతరం చేశామన్నారు. విలేకరుల సమావేశంలో సిసిఎల్‌ఎ సెక్రటరీ బాబు.ఏ, కమిషనరు ఆఫ్‌ సర్వే అండ్‌ సెటిల్‌మెంట్‌ కమిషనరు సిద్ధార్ధజైన్‌ పాల్గొన్నారు.