home page

విశాఖ తీరంలో హోరెత్తిన అల్లూరి సీతారామరాజు నినాదం

విప్లవ జ్యోతి అల్లూరి కి ఘన నివాళులు

 | 
March fast

మిర్రర్ టుడే,‌ విశాఖ బ్యూరో : విశాఖ సాగర తీరం... మన్యం వీరుడు విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 98వ వర్థంతి సందర్భంగా విశాఖ ఆర్‌కె బీచ్‌ రోడ్డులో నిర్వహించిన 'యూత్‌ మార్చ్‌' ఆద్యంతం సాగర తీర జనాలను ఉత్తేజపరిచేలా సాగింది.

March fast

'తెల్లవారి గుండెల్లో నిదురించినవాడా... నిదురించిన మన పౌరుషాగ్ని రగిలించిన వాడా...' - అంటూ సాగిన యువకులు, విద్యార్థుల నినాదాలతో విశాఖ తీరం హోరెత్తింది. సిపిఎం ఎర్ర జెండాలను, జాతీయ జెండాలను చేబూని మార్చ్‌లో యువత ఉత్తేజపూరితంగా ముందుకు సాగింది. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.నర్సింగరావు, కె.లోకనాథం, విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు, 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు ఈ మార్చ్‌కు అగ్రభాగాన సారథ్యం వహించారు. ఆర్‌కె బీచ్‌ నుంచి ప్రారంభమైన మార్చ్‌ వుడా పార్కు వరకూ సాగింది. బ్రిటిషోడి ముష్కర మూకలకు ఎదురెల్లిన సందర్భంలో చుట్టుముట్టిన తుపాకులకు వెన్నుచూపక గుండెలు చూపిన తెగువ.... తూటాలు గుండెలో దిగుతున్నా ప్రజల కోసం ముందుకేగిన విప్లవ జ్వాల అల్లూరి... అంటూ వి.శ్రీనివాసరావు చేసిన ప్రసంగం బీచ్‌లోనిే ప్రజలను ఆకట్టుకుంది.

  • అల్లూరి స్ఫూర్తితో పోరాటాలు : వి.శ్రీనివాసరావు

యూత్‌ మార్చ్‌ని జెండా ఊపి వి.శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మన్యం ప్రాంతంలోని ప్రతి గిరిజనుడినీ సమీకరించి సాయుధ పోరాటం చేసిన యోధుడు అల్లూరి అని కొనియాడారు. దేశమంతటా తిరిగి అనేక పోరాట పద్ధతులను చూశాక ఈ మార్గం సరికాదని భావించి బ్రిటిష్‌వారిని తన్ని తరిమేసేలా పోరాటం సాగించిన ఘనుడని అన్నారు. నేటి తరానికి ఆయన ఆదర్శమని పేర్కొన్నారు. అల్లూరి స్ఫూర్తితో పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. '26 ఏళ్ల వయసులోనే దేశాన్ని ఉర్రూతలూగించి మన్యం పోరాటానికి నాయకత్వం వహించిన విప్లవకారుడికి మరణం లేదు' అని విఎస్‌ఆర్‌ చేసిన ప్రసంగానికి చప్పట్లు మార్మోగాయి. ప్రస్తుతం దేశ ప్రకృతి వనరులను విదేశీ కంపెనీలు దోచుకుపోతున్నాయని అన్నారు. నేడు విదేశీయులు వారికి వారుగా వచ్చి దోచుకోవడం లేదని, మన పాలకులు ఎర్రతివాచీ పరిచి వారితో కుమ్మక్కై మన సంపదలను, ప్రభుత్వ రంగాన్ని వారికి అప్పగిస్తున్నారని తెలిపారు. అల్లూరి ఏ పోరాటంలో పాల్గని దేశం కోసం అసువులు బాశారో, దాంతో ఎలాంటి సంబంధమూలేని పాలకులు కేంద్రంలో బిజెపి రూపంలో అధికారంలో ఉన్నారని అన్నారు. అది మనదేశ పౌరుల దురదృష్టమని పేర్కొన్నారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను విదేశీయులకు కారుచౌకగా కట్టబెట్టేందుకు మోడీ చూస్తున్నారని, ఇదేం దేశభక్తి అని ప్రశ్నించారు. మన గడ్డ మీద దేశద్రోహులను అనుమతించొద్దని, బిజెపిని తన్ని తరిమేయాలని పిలుపునిచ్చారు. తొలుత ఉదయం సీతమ్మధారలోని అల్లూరి విగ్రహం వద్ద వి.శ్రీనివాసరావు, సిహెచ్‌.నర్సింగరావు, కె.లోకనాథం, జగ్గునాయుడు తదితరులు నివాళ్లర్పించారు.