home page

ఎన్టీఆర్ పేరు తొలగింపు అంటే అవమానించినట్టే

ఇది కోట్ల మందిని అవమానించినట్లే!

 | 
Sharmila

ఎన్టీఆర్ పేరు తొలగిస్తే అది ఆయనను అవమానించినట్లు కాదా? అని ప్రశ్నించారు వైఎస్సార్ టీపి నేత వై.ఎస్. షర్మిల. 

''ఒక సంస్థకు ఒక ప్రభుత్వం ఒక పెద్ద మనిషి పేరు పెట్టాక దాన్ని కాదని మరొక ప్రభుత్వం ఆ పేరు తొలగిస్తే ఆయనను అవమానించినట్లే అవుతుంది. అంతేకాదు.. ఆయనను అభిమానించే (ఎన్టీఆర్‌) కోట్ల మంది ప్రజలను అవమానించినట్లే'' అని ఏపీలోని ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయంపై ఆ రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఉద్దేశించి వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ (వైతెపా) అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల వ్యాఖ్యానించారు. ఇలా సంస్థల పేర్లను తొలగించడం సరైన చర్య కాదన్నారు. శుక్రవారం వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట మండలం మొరంగపల్లి సమీపంలో పాదయాత్రలో ఒక మీడియా ఛానెల్‌తో ఆమె మాట్లాడారు. 'మా నాన్న నన్ను ప్రేమించినంతగా ఎవరినీ ప్రేమించలేదు. ఆయనను నేను ఆరాధించినట్లు ఎవరూ ఆరాధించలేరు. సంస్థల పేర్ల మార్పిడి విషయానికొస్తే... ఆ సంస్థకు ఈ రోజు వైఎస్సార్‌ పేరు పెట్టారు. రేపు వచ్చే ప్రభుత్వం ఆ పేరు తొలగించి మరొక పేరు పెడితే వైఎస్సార్‌కు అవమానం కలిగినట్లు కాదా. అసలు ఒకరి ఖ్యాతిని తీసుకుని వైఎస్సార్‌కు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకున్న పేరు చరిత్రలో మరెవరికీ లేదు. ఆయన చనిపోతే ఆ బాధ తట్టుకోలేక 700 మంది గుండెలు ఆగిపోయాయి' అని పేర్కొన్నారు.

గల్లీకో బారు.. ఇదేనా తీరు!

రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ గల్లీకో బారు ఏర్పాటు చేసి మద్యానికి నిలయంగా మార్చారని షర్మిల విమర్శించారు. మోమిన్‌పేట పాత బస్టాండ్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన సభలో ఆమె మాట్లాడారు. ''పంచాయతీలకు నిధులు లేవని ప్రజాప్రతినిధులు అడిగితే.. ఓ మంత్రి మద్యం సీసాలు అమ్ముకొని నిధులు సమాకూర్చుకోవాలని అనడం ఎంతవరకు సమంజసం? ఆధారాలతో మాట్లాడుతుంటే ఎమ్మెల్యేలు నాపై సభాపతికి ఫిర్యాదు చేశారు. తప్పకుండా చర్యలు తీసుకుంటామని స్పీకర్‌ ప్రకటన విడుదల చేశారు. ప్రివిలేజ్‌ కమిటీ ముందుకు రావాల్సి వస్తుందంటున్నారు. నేను ఎక్కడికైనా వస్తా.. ప్రశ్నిస్తా.'' అని షర్మిల అన్నారు.