home page

జయలక్ష్మి సొసైటీ రికార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసు

పరారీలో  సొసైటీ చైర్మన్, డైరెక్టర్లు,గాలింపునకు బృందాలు

 | 
Computers

సిఐడి దర్యాప్తునకు ఎస్పీ సిఫార్సు 

డిపాజిట్‌దార్లకు రూ.520 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన కేసులో పురోగతి

కాకినాడ లో డిపాజిట్‌దార్లకు సుమారు రూ.520 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన  జయలక్ష్మి ఎంఏఎం కో-ఆపరేటివ్‌ సొసైటీ లిమిటెడ్‌ (బ్యాంకు) వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

చైర్మన్ డైరెక్టర్లు పరారీలో ఉండడంతో వారి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు దర్యాప్తులో భాగంగా రికార్డు లను, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు.

శుక్రవారం ప్రధాన కార్యాలయంలోని కంప్యూటర్‌ సీపీయూలు, హార్డ్‌డిస్కులు, రికార్డులను కాకినాడ డీఎస్పీ భీమారావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం శుక్రవారం స్వాధీనం చేసుకుంది. వాటిని డీఎస్పీ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. 1999లో ప్రారంభమైన ఈ సొసైటీలో సుమారు 19,911 మంది సభ్యులు, 15వేల మంది డిపాజిట్‌దారులు ఉన్నట్లు సమాచారం. ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.

సీఐడీ దర్యాప్తునకు ఎస్పీ సిఫారసు

జయలక్ష్మి సొసైటీ వ్యవహారంపై జిల్లా ఎస్పీ రవీంద్రనాధ్‌బాబు సీఐడీ విచారణకు సిపార్సు చేశారు. కాకినాడ గ్రామీణ, నగర ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలకు బాధితులు వినతిపత్రాలు అందజేశారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇప్పటికే సొసైటీ ఛైర్మన్‌ ఆర్‌ఎస్‌ఆర్‌ ఆంజనేయులు, ఆయన భార్య, ఉపాధ్యక్షురాలు ఆర్‌బీ విశాలాక్షి, కోశాధికారి వెంకటేశ్వరరావు, ఇతర డైరెక్టర్లపై కేసు నమోదు చేశారు. వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. విదేశాలకు పారిపోకుండా విమానాశ్రయాల్లోనూ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.