home page

శివసేన చిహ్నం పై నిర్ణయం వద్దు : ఈసికి సుప్రీం ఆదేశం

విల్లు-బాణంపై వివాదంపై విచారణ

 | 
Arrow and barrow

శిందే, ఠాక్రే వర్గం పిటిషన్లు రాజ్యాంగ 

ధర్మాసనానికి బదిలీ

దిల్లీ: శివసేన పార్టీలో చీలిక నేపథ్యంలో మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గం, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది.

ఈ పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గురువారం విచారణ చేపడుతుందని చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పటిదాకా శివసేన పార్టీ గుర్తు 'విల్లు - బాణం'పై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ''ఈ పిటిషన్లపై ఆగస్టు 25న రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరపనుంది. ఎన్నికల గుర్తుకు సంబంధించిన అంశాలపై ధర్మాసనం నిర్ణయం తీసుకుంటుంది'' అని సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ తెలిపారు.

మహారాష్ట్రలో ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి దారితీసిన రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయింపులు, విలీనం, చీలిక, అనర్హతలకు సంబంధించిన అంశాలపై ఠాక్రే, శిందే వర్గాలు ఈ పిటిషన్లు దాఖలు చేశాయి. వీటిపై సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ పెండింగ్‌లో ఉండగానే.. అసలైన శివసేన పార్టీ తమదేనని చెబుతూ శిందే వర్గం ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. పార్టీ నియంత్రణ, ఎన్నికల గుర్తు 'విల్లు-బాణం' తమకే కేటాయించాలని కోరింది. అయితే, దీన్ని ఠాక్రే వర్గం వ్యతిరేకించింది. సుప్రీంకోర్టులో విచారణ పూర్తికానుందన.. శిందే వినతిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేసింది.

ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల కీలక నిర్ణయం తీసుకొంది. దీంతో విల్లంబుల గుర్తు తమదేనని రుజువు చేసే పత్రాలను సమర్పించాలని శిందే, ఉద్ధవ్‌ వర్గాలకు ఈసీ సూచించింది. శివసేన శాసనసభా పక్షంతో పాటు పార్టీ సంస్థాగత విభాగ సభ్యుల మద్దతు లేఖలను కూడా ఇవ్వాలని రెండు వర్గాలను కోరింది. దీంతో ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారం ఇంకా తేలలేదు గనుక.. శిందే వర్గం పెట్టుకున్న అర్జీపై ఈసీ చర్యలు తీసుకోకుండా నివారించాలని పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై గతంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ప్రస్తుతానికి శిందే వర్గం చేసిన వినతిపై ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఈసీకి స్పష్టం చేసింది. తాజాగా ఈ పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన నేపథ్యంలో మరోసారి ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.