home page

నయా హైదరాబాద్ 'అన్న' వరమే!

నలువైపులా విస్తరణ :        ట్యాంక్ బండ్ కు కొత్త పేరు 

 | 
Ntr

1982 తర్వాతే తెలుగుకు వెలుగులు 

హైదరాబాద్ ఆధునికత వైపు 1983లోనే తొలి అడుగులు1982 మార్చి 28న సినీనటుడు ఎన్టీఆర్ తొలిసారి తెలుగులో రాజకీయాల్లోకీ వస్తున్నానని ప్రకటన చేసిన రోజు. 400 ఏళ్ళ చరిత్ర వున్న భాగ్య నగరం 40 ఏళ్ళకాలంలో Ntr పూర్తి గా మారిపోయింది. సరిగ్గా 40 ఏళ్ల కిందట హైదరాబాద్‌ ఎలా ఉండేదో తెలుసా?

హైదరాబాద్ మొదలు ప్రారంభం దిల్ సుఖ్ నగర్.చివరి భాగం సనత్ నగర్. కూకట్ పల్లి కొత్త ప్రాంతం.

సనత్‌ నగర్‌ దాటితే అంతా ఖాళీ! హుస్సేన్‌ సాగర్‌... ఒక పెద్ద చెరువు మాత్రమే! 400 ఏళ్ల కిందట ఏర్పడిన మహా నగరంలో జనాభా పెరుగుతూ వచ్చింది కానీ, రూపు రేఖలు మాత్రం పెద్దగా మారలేదు. నిజాంల హయాం ముగిసింది. ప్రజాస్వామ్యపాలనలో ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ... 'అలా నడిపిద్దాం' అన్నట్లుగానే నడిపించారు. అలాంటి సమయంలో... 'అన్న' అడుగు పెట్టాడు. 'ఆధునిక హైదరాబాద్‌' నిర్మాణం దిశగా అడుగులు వేశాడు. ఆయనే... ఎన్టీఆర్‌.

హైదరాబాద్‌... సుమారు నాలుగు శతాబ్దాల చరిత్ర! ఆరు దశాబ్దాలపాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ఘనత! కానీ... 1980కి ముందు దేశంలోని ఇతర చారిత్రక నగరాల తరహాలోనే స్తబ్ధుగా ఉండేది. తరచూ మత కలహాలు, కర్ఫ్యూలు, అల్లర్లతో అల్లకల్లోలంగా మారేది. పెద్ద పండగలు వచ్చాయంటే... టెన్షన్‌ టెన్షన్‌! కర్ఫ్యూలు జన జీవనంలో ఒక భాగం! ఉద్యోగ రీత్యా తప్పనిసరై అక్కడ స్థిరపడే వారు, వ్యాపారాల మీద వచ్చే అతికొద్ది మందితప్ప... మిగిలిన తెలుగు వారికి, మరీ ముఖ్యంగా కోస్తా, సీమ జిల్లాల వారికి 'దూరంగా' ఉండేది. ఈ పరిస్థితి మొత్తాన్ని మార్చేసి... భాగ్యనగరానికి ఆధునిక సొబగులు అద్దిన తొలి పాలకుడు... ఎన్టీఆర్‌. ఏ నగరాభివృద్ధికైనా శాంతిభద్రతల పరిరక్షణ ముఖ్యమని ఆయన భావించారు. ముఖ్యమంత్రికాగానే... మతకలహాలు, అల్లర్ల విషయంలో కఠిన వైఖరి తీసుకున్నారు. నగరంలో సమర్థులైన పోలీసు అధికారులను నియమించారు. గొడవలకు కారకులైన వారిని ఉక్కుపాదంతో అణచి వేశారు. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హైదరాబాద్‌లో మత ఘర్షణలకు తావులేకుండా పోయింది. శాంతి భద్రతలు మెరుగుపడటం తో వ్యాపారాలు విస్తరించాయి. ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడ జీవనం సాగించేందుకు రావడం మొదలైంది.

జనాభాకు అనుగుణంగా...

మెల్లమెల్లగా హైదరాబాద్‌ జనాభా పెరగడం మొదలైంది. పరిశ్రమలు కూడా పెరిగి ఉపాధి అవకాశాలు పెరిగాయి. పెరుగుతున్న జనాభా, ట్రాఫిక్‌కు అనుగుణంగా హైదరాబాద్‌లో రోడ్లను విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. అంతకుముందున్న పాలకులెవరూ రోడ్ల విస్తరణకు సాహసించలేదు. కూకట్‌పల్లి నుంచి అబిడ్స్‌ వరకు ఉన్న రహదారిని ఎన్టీఆర్‌ విస్తరించారు. ఇంకా అనేక ప్రధాన రహదారులను వెడల్పు చేశారు. ఎన్టీఆర్‌ హయాంలో వెడల్పు చేసిన పాత ముంబై రహదారి సుమారు నలభై ఏళ్లపాటు ట్రాఫిక్‌ను సునాయాసంగా భరించింది.

పర్యాటక వైభోగం...

హుస్సేన్‌ సాగర్‌ నిజాంల కాలం నుంచీ ఉంది. కానీ... ఆ చెరువు కట్ట పర్యాటకులను ఆకర్షించే 'ట్యాంక్‌బండ్‌'గా మారింది ఎన్టీఆర్‌ హయాంలోనే. అప్పటిదాకా నిజంకాలం నాటి నిర్మాణాలే ప్రధానాకర్షణ! అంతకుమించి పర్యాటకపరంగా చెప్పుకోదగ్గ ప్రదేశాలే లేవు. ఎన్టీఆర్‌ తన కళా దృష్టితో హైదరాబాద్‌ నగరానికి పర్యాటక సొబగులు అద్దారు. అనేక ఇక్కట్లు, కష్టాలకోర్చి... హుస్సేన్‌ సాగర్‌ నడిబొడ్డున భారీ బుద్ధ విగ్రహం ఏర్పాటు చేయించారు. 'బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు' పేరుతో హుస్సేన్‌ సాగర్‌ చుట్టు పక్కల ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. ట్యాంక్‌ బండ్‌ను వెడల్పు చేసి తెలుగు ప్రముఖుల విగ్రహాలను నెలకొల్పారు.

విస్తరించిన నగరం

ఉర్దూ ప్రభావం బాగా ఎక్కువగా ఉండే హైదరాబాద్‌ నగరంలో ఎన్టీ రామారావు వచ్చిన తర్వాతే... తెలుగు భాష విస్తరించడం మొదలైంది. ముంబై ప్రధాన రహదారిలో సనత్‌ నగర్‌తో హైదరాబాద్‌ నగర పరిధి ముగిసినట్లే! ఆ తర్వాత చిన్న పల్లెలు తప్ప నగర వాతావరణం కనిపించేది కాదు. ఎన్టీఆర్‌ వచ్చిన తర్వాతే కూకట్‌పల్లి అభివృద్ధి ప్రారంభమైంది. అఫ్జల్‌గంజ్‌ వద్ద భారీ బస్టాండ్‌ కాంప్లెక్స్‌ను నిర్మించి... సిటీ బస్సుల సేవలను బాగా పెంచారు. దీంతో శివారు ప్రాంతాలకు నగర విస్తరణ సాఫీగా జరిగింది.