గోదావరి జిల్లాల్లో కృష్ణంరాజు అనుబంధం
రెండుసార్లు ఎంపీగా గెలుపు, ఒకసారి ఓటమి
వాజ్‌పేయి మంత్రివర్గంలో కేంద్రమంత్రి
*కాకినాడ,నర్సాపురంలో గెలిచారు*
*రాజమహేంద్రవరం లో ఓడారు*
*గోదావరి జిల్లాల్లో కృష్ణంరాజు రాజకీయ ప్రస్థానం*
ప్రముఖ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు రాజకీయాల్లోనూ ప్రముఖ పాత్ర పోషించారు. గోదావరి జిల్లాల రాజకీయాలలో తగిన గుర్తింపు దక్కించుకున్నారు. 1991 లోనే కాంగ్రెసు పార్టీలో చేరి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం భారతీయ జనతా పార్టీ ద్వారా 1998లో #కాకినాడ నుంచి ఎలాంటి పొత్తులు లేకుండా పోటీ చేసి గెలుపొందారు. #తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్రగడ పద్మనాభం, కాంగ్రెస్ అభ్యర్థి మల్లిపూడి పళ్ళంరాజుపై విజయ ఢంకా మోగించారు. కాని 11 నెలలకే బిజెపి ప్రభుత్వం పడిపోవడంతో మళ్లీ 1999లో పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి.ఆ ఎన్నికల్లో తెలుగుదేశం, బిజెపి పార్టీల పొత్తులో భాగంగా నరసాపురం నుంచి బిజెపి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరి బాపిరాజు పై విజయం సాధించారు.వాజ్‌పేయి కేబినెట్ లో కేంద్ర మంత్రి పదవి చేపట్టారు.
అనంతరం 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. రాజమండ్రి నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ హావాలో త్రిముఖ పోటీ జరిగినప్పటికీ కృష్ణంరాజుకు ప్రజలు బాగానే ఆదరించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్ 3,57,449(35.12 శాతం) ఓట్లు సాధించి రెండవ సారి గెలుపొందారు. టిడిపి అభ్యర్థి మురళీ మోహన్ 3,55,302(34.91 శాతం) ఓట్లు సాధించారు.ప్రజారాజ్యం నుంచి పోటీ చేసిన కృషంరాజు 2,53,437(24.90 శాతం) ఒట్లు వచ్చాయి. ఆ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా పోటీ చెసిన సోము వీర్రాజు కేవలం 7,123 ఓట్లకే పరిమితమయ్యారు.
కృష్ణంరాజు రాజకీయ ప్రస్తావన అంతా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో సాగడంతో ఈ ప్రాంత వాసులకు ఆయన సుపరిచితులు.కేవలం రాజకీయంగానే గాక త్రిశూలం, బొబ్బిలి బ్రహ్మన్న వంటి ఎన్నో విజయవంతమైన సినిమాలు ఈ ప్రాంతంలో షూటింగ్ జరపడం ద్వారా కూడా ఆయనను ప్రత్యక్షంగా కలిసిన అభిమానులు ఎందరో ఉన్నారు. వారంతా కృష్ణంరాజు మృతితో తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.ఆయనతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటున్నారు.
కొండ్రెడ్డి శ్రీనివాస్