home page

మంత్రి గా బాధ్యత స్వీకరించిన కాకాణి

తొలి ఫైలు పై సంతకం

 | 
Kalani

రైతులను ముంచిన   గిట్టుబాటు ధర

అమరావతి సచివాలయంలో నూతన వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రూ.1,395 కోట్లతో 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇర్రిగేషన్ అవకాశం కల్పించే ఫైలుపై మొదటి సంతకం చేశారు. అంతేకాకుండా 3500 ట్రాక్టర్లను వైఎస్ఆర్ యంత్ర పథకం కింద ఇచ్చే ఫైలుపై రెండో సంతకం చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 43 వేల కోట్లను వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించామని తెలిపారు. సీఎం జగన్ రైతుపక్షపాతి అని పేర్కొన్నారు.

రూ. 20 వేల కోట్లకు పైగా రైతు భరోసా కింద ఇప్పటివరకు నగదు బదిలీ చేసినట్లు మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. గన్నవరం స్టేట్ సీడ్స్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయించామని.. ఆర్బీకేల ద్వారా రైతుల అవసరాలు తీర్చేలా పీఏసీ ఖాతాలకు అనుసంధానం చేశామని తెలిపారు. రైతుల నగదు లావాదేవీలు కూడా ఆర్బీకేలలో జరిగేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టం చేశారు.

మరోవైపు సచివాలయంలో గిరిజన శాఖ మంత్రిగా రాజన్నదొర బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గిరిజన సహకార సంస్థకు సంబంధించి కారుణ్య నియామకాల ఫైలుపై తొలి సంతకం చేసినట్లు ఆయన వెల్లడించారు. దేశీయ కోళ్లు పెంపకానికి సంబంధించిన ఫైలుపైనా సంతకం చేసినట్లు వివరించారు. ఒక గిరిజనుడికి సీఎం జగన్ డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని కొనియాడారు. గిరిజన శాఖా పరంగా ప్రమోషన్లకు సంబంధించి నిర్ణయం తీసుకున్నామని.. గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలపై సీఎం ఆలోచిస్తున్నారని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కొండలు ఎక్కడానికి రోడ్లు వేయాల్సిన అవసరం ఉందన్నారు. మానవ హక్కుల సంఘం తన నియోజకవర్గంలో ఒక గర్భిణీ రోడ్డుపై ప్రసవమైన విషయాన్ని సీరియస్‌గా తీసుకుందన్నారు. ఈ మేరకు కొండ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి సీఎం జగన్ అనుమతులిచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 లక్షల మంది గిరిజనులు ఉన్నారని.. 50 మండలాలలో గిరిజన జనాభా విస్తరించిందని మంత్రి రాజన్న దొర పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర నిధులను రప్పించేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు.