home page

ప్రత్యేక కోర్టుకు చేరని కాకాణి కేసు డాక్యుమెంట్లు

కోర్టు లో చోరీ కేసులో మరో ట్విస్ట్

 | 

ఇంతకీ కోర్టులో చోరీ కేసు ఏమౌతుందో

నేతలపై కేసులు, డాక్యుమెంట్లు పంపాలంటూ విజయవాడలోని ఎంపీ,ఎమ్మెల్యే కోర్టు ఆదేశం

ఆ తర్వాత కొద్దిరోజులకే నెల్లూరుకోర్టులో చోరీ

ఇప్పటికీ విజయవాడకు చేరని డాక్యుమెంట్లు

మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై నమోదైన ఫోర్జరీ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్ల చోరీ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్‌ వెలుగులోకి వస్తోంది.

తాజాగా మరో విషయం బయటకు వచ్చింది. నెల్లూరులో నాలుగో ఏడీఎం కోర్టులో డాక్యుమెంట్ల చోరీ జరగడానికి వారం క్రితం ఎంపీ, ఎమ్మెల్యేలపై నమోదైన కేసులను విచారించే విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానం... నెల్లూరు కోర్టుకు ఓ ఉత్తర్వు పంపింది. విచారణలో ఉన్న ప్రజాప్రతినిధుల కేసులను తన వద్దకు బదిలీ చేయాలని, ఆ కేసులకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లను ఇక్కడ అందజేయాలనేది ఆ ఉత్తర్వు సారాంశం. విజయవాడలోని న్యాయస్థానాల సముదాయంలో 2018 మార్చి ఏడో తేదీన ఈ కోర్టును ఏర్పాటు చేశారు. అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధులపై నమోదైన కేసులను ఇక్కడే విచారిస్తున్నారు. క్రిమినల్‌, ఫోర్జరీ కేసుల విచారణ ఈ కోర్టులోనే సాగుతోంది. వివిధ జిల్లాల్లోని న్యాయస్థానాల్లో విచారణ స్థాయిలో ఉన్న కేసులను ఈ క్రమంలో ఈ కోర్టుకు బదిలీ చేశారు. కొన్ని జిల్లాల్లోని కేసులను ఇంకా బదిలీ చేయలేదు.

ఇందులో నెల్లూరు జిల్లా ఒకటి. ఈ నేపథ్యంలోనే నెల్లూరు కోర్టుకు ఆదేశాలు వెళ్లాయి. ఈ కేసులను బదిలీ చేసి, డాక్యుమెంట్లను విజయవాడ ప్రత్యేక న్యాయస్థానంలో అప్పగించడానికి నెల్లూరు కోర్టులోని సిబ్బంది రంగం సిద్ధం చేశారు. ఈ కోర్టులో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై దాదాపు 11 వరకు కేసులు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మొత్తం కేసులను ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ మొదలవుతుండగానే నెల్లూరు కోర్టులో కాకాణి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు ఈ నెల 13వ తేదీన చోరీకి గురయ్యాయి. ఈ ఘటనలో మంత్రి కాకాణి వాదనలు ఒకలా ఉంటే, ఆ జిల్లా ఎస్పీ వెల్లడించిన వివరాలు మరోలా ఉన్నాయి. కుక్కలు మొరగడంతో దొంగలు కోర్టు హాలులోకి పారిపోయారని, అక్కడ పాత వస్తువులను దొంగిలించడానికి ప్రయత్నించారని పోలీసులు చెబుతున్న విషయాలే ఇప్పటికీ అంతుబట్టకుండా ఉన్నాయి. ఈ వివరణ అనేక సందేహాలను రేపుతున్న తరుణంలోనే తాజా ఉదంతం బయటకొచ్చింది. అయితే...చోరీస్థలంలో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లను విజయవాడలోని ప్రత్యేక న్యాయస్థానానికి అందజేశామని నెల్లూరు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు విజయవాడకు ఎలాంటి డాక్యుమెంట్లు అందలేదని న్యాయవాద వర్గాలు చెబుతుండటం గమనార్హం.