home page

27 మందికి జగన్ వార్నింగ్

జనంలో ఉంటేనే టిక్కెట్లు  

 | 
jagan

ఎన్నికలకు ఆరునెలల ముందు టిక్కెట్లు ఖరారు  

 సీఎం జగన్  వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు తన లక్ష్యమని తేల్చి చెప్పారు.ఏ ఒక్క నియోజకవర్గం వదులుకోవటానికి సిద్దంగా లేనన్నారు. క్షేత్ర స్థాయిల్ అనేక మార్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని పార్టీ నేతలతో పంచుకున్నారు. ఎక్కడా ఎటువంటి మొహమాటం లేకుండా గెలుపే ప్రామాణికమని స్పష్టం చేసారు. ఎవరికీ మినహాయింపు లేదన్నారు.


సీఎం జగన్ దిశా నిర్దేశం

రాజకీయాలను ఏదో హాబీగా చూడవద్దని..బాధ్యతగా చేసుకోవాలని హెచ్చరించారు. రాజకీయ నేత ప్రజల్లో ఎంతగా ఉంటే అంతలా గుర్తింపు - భవిష్యత్ ఉంటుందని సూచించారు. ఇందులో మంత్రులకు మినహాయింపు ఇవ్వలేదు. గడప గడపకు వర్క్ షాపులో సీఎం జగన్ తన లక్ష్యం ఏంటీ.. ఏం కోరుకుంటున్నాననే అంశం పైన తన విజన్ ను పార్టీ నేతల ముందుంచారు. ప్రతీ నియోజకవర్గం నుంచి సమాచారం తీసుకున్నానని.. ఏ ఎమ్మెల్యే ఏ స్థాయిలో ప్రజలతో మమేకం అయ్యారో తన వద్ద పూర్తి సమాచారం ఉందన్నారు. రాష్ట్రంలో 87 శాతం మందికి ప్రభుత్వ పథకాల లబ్ది అందుతుందని, అయినా ఎమ్మెల్యేల పని తీరు ఎన్నికల్లో కీలకమని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతీ ఎమ్మెల్యే నెలకు 16 రోజుల పాటుగా ఖచ్చితంగా గడప గడపకు వెళ్లాల్సిందేనని సీఎం నిర్దేశించారు.

జాబితాలో మంత్రులు - సీనియర్లు

తాను ఇప్పటికే పలు మార్లు చెప్పానని.. అయినా కొందరు మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తాను ఏ ఒక్కరినీ వదులుకోవటానికి సిద్దంగా లేనని, తిరిగి అందరూ ఎమ్మెల్యేలుగా గెలవాలనే తాను కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ప్రతీ సచివాలయం పరిధిలో ప్రతీ ఇంటికి వెళ్లాలని..నెలలో ఆరు సచివాలయలు కవర్ చేయాలని సీఎం నిర్దేశించారు. 27 మంది పార్టీలో ప్రస్తుతం మంత్రులు - ఎమ్మెల్యేలుగా ఉన్నవారిలో పని తీరులో వెనుకబడి ఉన్నారని సీఎం స్పష్టం చేసారు. వారంతా వచ్చే సమావేశం సమయానికి పని తీరు మెరుగుపర్చుకోవాలని నిర్దేశించారు. పార్టీ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఆ 27 మందిలో ప్రస్తుతం మంత్రులుగా ఉన్న రోజా, తానేటి వనిత, కారుమూరు నాగేశ్వరరావు, బుగ్గన, ఉన్నారు.

మాజీ మంత్రులు సైతం లిస్టులో

అనారోగ్యం కారణంగా పినిపే విశ్వరూప్ గడప గపడకు హాజరు కాలేదని తెలుస్తోంది. సీనియర్ నేతలు మాజీ మంత్రులు కొడాలి నాని, బాలినేని శ్రీనివాస రెడ్డి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, కోరుమట్ల శ్రీవివాసులు, శిల్పా చక్రపాణి రెడ్డి, గ్రంధి శ్రీనివాస్ వంటి ముఖ్య నేతలు ఉన్నట్లు సమాచారం. వీరిలో తాను ఎవరినీ వదులుకోవటానికి సిద్దంగా లేనని సీఎం చెప్పుకొచ్చారు. ఈ సమయంలో కష్టపడిన వారికే ఫలితం ఉంటుందంటూ సీఎం తేల్చి చెప్పారు. తిరిగి నవంబర్ లో ఇదే విధంగా మరోసారి వర్క్ షాప్ ఉంటుందని, అప్పట్లోగా పని తీరు మార్చుకోవాలని సీఎం గట్టిగానే చెప్పారు. పని తీరు బాగోలేకుంటే ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్ధులను మార్చుతానని ముఖ్యమంత్రి ఖరాఖండిగా తేల్చి చెప్పారు. దీంతో..ఇప్పుడు ఈ జాబితాలో ఉన్న వారిలో కొత్త టెన్షన్ మొదలైంది.