home page

జగన్ సర్కారు మాయ :జిపిఎఫ్ ఖాతాలో నగదు మాయం?

నోరు మెదపని ఆర్ధిక శాఖ అధికారులు

 | 
Ap map

హైకోర్టులో విచారణ: రెండు వారాలు వాయిదా 

:ఉద్యోగుల ఖాతాల్లో నగదు ఏమైంది?.. ఇంకా స్పష్టత ఇవ్వని ఆర్థికశాఖ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి నుంచి ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే.దీనిపై ఉద్యోగ సంఘాల నేతలు ఆర్థిక శాఖ అధికారులను కలిసినా స్పష్టత రాకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. ఇవాళ ఉదయం సచివాలయంలో ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి రావత్‌, సత్యనారాయణను ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నేతలు కలిసి సమస్యను వివరించారు. జీపీఎఫ్‌ ఖాతా నుంచి ఉద్యోగుల అనుమతి లేకుండా నగదు విత్‌డ్రా ఎలా జరిగిందని ప్రశ్నించారు.ఎలా జరిగిందో తమకు కూడా తెలియడం లేదని, విచారణ జరిపి స్పష్టత ఇస్తామని ఆర్థికశాఖ అధికారులు చెప్పినట్టు సమాచారం. పొరపాటు ఎక్కడ జరిగిందో విచారిస్తామని, క్రింది స్థాయి అధికారులు నుంచి నివేదిక తెప్పించుకుని సమస్యను పరిష్కరిస్తామని ఆర్థికశాఖ అధికారులు హామీ ఇచ్చారని జేఏసీ నేతలు వెల్లడించారు. సాయంత్రంలోగా అన్ని విషయాలపై స్పష్టత ఇస్తామని చెప్పారని తెలిపారు. జీపీఎఫ్‌ ఖాతాల్లో నగదు వేయడం, తీయడంపై సీఎఫ్‌ఎంఎస్‌లో సాంకేతికలోపం కూడా కారణం కావచ్చని ఆర్థిక శాఖ అధికారులు అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతా నుంచి ప్రభుత్వం డబ్బులు తీసుకోలేదని ఆర్థిక శాఖ అధికారులు తెలిపినట్లు ఏపీ ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు వెల్లడించారు.


హైకోర్టు దృష్టికి వెళ్లిన జీపీఎఫ్‌ వివాదం..


మరోవైపు నూతన పీఆర్సీపై గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తనతో పాటు తోటి ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు విత్‌డ్రా చేశారని పిటిషనర్ తరఫు న్యాయవాది హైకోర్టులో రీజాయిండర్ దాఖలు చేశారు. ఉద్యోగుల ఖాతాల నుంచి ఎటువంటి రికవరీ జరపకూడదని గతంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. తాజాగా కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా నగదు విత్‌డ్రా చేశారని.. దీనిని కోర్టు ధిక్కరణ కింద పరిగణించాలని కోరారు. దీనిపై పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.