home page

ఉక్కు కర్మాగారం కరుగుతున్నా కనిపించని జగన్ మార్క్

 | 
Jagan

ఉక్కు కర్మాగారం విక్రయానికి కేంద్రం చర్యలు

విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తున్నది.

తాజాగా ప్లాంట్‌ ఆస్తుల మదింపు సంస్థ కొరకు బిడ్లను ఆహ్వానించింది. కంపెనీని అమ్మేస్తాం లేదా మూసివేస్తామని కేంద్రం పదేపదే చెబుతున్నది. పార్లమెంట్‌ సాక్షిగా పెద్దఎత్తున స్టీల్ ప్లాంట్‌, దాని నిర్వాసితులు, కార్మికులపైన దుష్ప్రచారానికి ఒడిగట్టింది. కేంద్ర ప్రభుత్వ తెంపరితనంపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన ఆందోళన కలిగిస్తున్నది. 32 మంది ప్రాణత్యాగాలతో తెలుగుజాతి సాధించుకున్న మన స్టీల్‌ప్లాంట్‌ను రక్షించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా, లేదా? అనే చర్చ ప్రజల్లో బలంగా నడుస్తున్నది. కేంద్రంలోని బిజెపి సర్కార్‌తో రాష్ట్ర ముఖ్యమంత్రి మిలాఖత్‌ అయ్యారా? అనే అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి. దేశ రాజధానిలో ముఖ్యమంత్రి తాజా పర్యటన ఈ అనుమానాలను మరింత బలపరిచేదిగా ఉన్నది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్ద విశాఖస్టీల్‌ గురించి ముఖ్యమంత్రి ఎందుకు ప్రస్తావించడం లేదు?

ఈ నెల 5న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన హామీలతో పాటు ఇతర సమస్యలను ప్రధానితో చర్చించటంతో పాటు ఒక మెమోరాండం సమర్పించారు. ఆ చర్చల్లో గానీ, మెమోరాండంలో గానీ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకంపై కనీస ప్రస్తావన కూడా ముఖ్యమంత్రి చేయకపోవడం శోచనీయం. రాష్ట్రంలో ఈ అంశం ప్రధాన సమస్యగా ఉంది. తెలుగుజాతి యావత్తు విశాఖ ఉక్కును రక్షించుకోవాలనే దృఢ సంకల్పంతో ఉంది. అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమాత్రం దీనికి ప్రాధాన్యమివ్వడంలేదు. భోగాపురం ఎయిర్‌పోర్టు నేటికీ అతీగతీ లేదు. కానీ సైట్‌ క్లియరెన్స్‌ అప్రూవల్‌ అయిపోయిందనీ, ఎయిర్‌పోర్ట్‌కి తాజాగా క్లియరెన్స్‌ ఇవ్వమని కోరారు. 16చోట్ల బీచ్‌శాండ్‌ మినరల్స్‌ ప్రాంతాలను కేటాయించాలని అడిగారు. అంతేగాక రాష్ట్రానికి అదనపు రుణం మంజూరు చేయమని ప్రాధేయపడ్డారు. ఇవన్నీ చూస్తుంటే విశాఖస్టీల్‌ప్లాంట్‌ అమ్మకంపై ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఒక అవగాహనకు వచ్చినట్లు అనిపిస్తున్నది. ఈ అనుమానానికి ముఖ్యమంత్రే సమాధానం చెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత జనవరి 3న ప్రధానిని కలిసినప్పుడు కూడా విశాఖ ఉక్కును అమ్మే చర్యలు ఉపసంహరించాలని డిమాండ్‌ చేయలేదు. సరికదా ఆనాడు సమర్పించిన మెమోరాండంలో సైతం ఆ అంశాన్ని పేర్కొనలేదు. ముఖ్యమంత్రి ఉద్దేశపూర్వకంగానే తన ఢిల్లీ పర్యటనల సందర్భంగా విశాఖ స్టీల్‌ అమ్మకాన్ని ప్రస్తావనకు తేవడం లేదనే భావన ప్రజల్లో వ్యక్తమవుతున్నది.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ మూడేళ్ల క్రితం వేలంలో బొగ్గు గనులను కొనుగోలు చేసింది. ఫలితంగా జార్ఖండ్‌లో 'రబోధి' బొగ్గుగనులను కేంద్రం కేటాయించింది. 188 మిలియన్‌ టన్నుల బొగ్గు రిజర్వు సామర్థ్యమున్న గనులవి. ప్రైవేట్‌సంస్థలతో పోటీపడి విశాఖ స్టీల్‌ వాటిని దక్కించుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రద్దుచేసింది! ఆగమేఘాలమీద వాటిని వేలానికి కూడా పెట్టింది. ఇంత దారుణం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. కనీసం ఈ చర్యను ఖండించనూ లేదు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ప్రధానమంత్రికి లేఖ కూడా రాయలేదు. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంతగా లొంగిపోవాలి? మన స్టీల్‌ప్లాంట్‌ని రక్షించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా?

విజయనగరం జిల్లా సారిపల్లి వద్ద విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కి 67 హెక్టార్లలో రివర్‌ శాండ్‌మైన్‌ ఉంది. స్టీల్‌ప్లాంట్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌లో రన్నర్‌గా అత్యంత కీలకంగా అక్కడి ఇసుకను ఉపయోగిస్తారు. బొగ్గు గనులను కేంద్రం ఏకపక్షంగా రద్దు చేసినట్లే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏకపక్షంగా రివర్‌శాండ్‌ మైన్‌ను రద్దుచేసింది. ఈ మేరకు స్టీల్‌ యాజమాన్యానికి నోటీసు పంపించారు. ఇసుక రీచ్‌ రద్దు చేస్తే స్టీల్‌ ఉత్పత్తులకు ఆటంకం కలగదా? ఈ ప్రాథమిక విషయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదా? తెలిసీ ఎందుకు ఆగమేఘాల మీద రద్దుచేయాల్సి వచ్చింది? దీని వెనుక ఎవరి ప్రయోజనాలున్నాయి? ఇప్పటికే అధికారపార్టీ నాయకులు అక్రమంగా జొరబడి ఇసుకను తరలించుకుపోతున్నారు. ఇప్పుడు ఏకంగా వారి ప్రయోజనాలకోసం స్టీల్‌ప్లాంట్‌కి అన్యాయం చేయడానికి సమకట్టారు. ఇది ముఖ్యమంత్రికి తగనిపని.

ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో గంగవరం పోర్టు నేర్పాటు చేశారు. ఈ పోర్టుకి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భూములు రెండువేల ఎకరాలు ఇచ్చారు. అందుకు పరిహారంగా రాష్ట్ర ప్రభుత్వానికి పోర్టులో 10.4శాతం వాటా లభించింది. ఈ పోర్టు కార్గో హ్యాండ్లింగ్‌లో అధికభాగం విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు చెందిన ఎగుమతులు, దిగుమతులే. మోదీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయి తన వాటాను కేవలం రూ.645 కోట్లకు అదానీకి అమ్మేశారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఇవ్వమని స్టీల్ ప్లాంట్ కోరినా ముఖ్యమంత్రి అంగీకరించలేదు. వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా ప్లాంట్‌కు చెందిన రెండువేల ఎకరాల వల్లే 10.4శాతం వాటా వచ్చింది. అందువల్ల ఈ వాటాపై స్టీల్‌ప్లాంట్‌కే అధికారం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం లొంగుబాటు చర్యవల్ల విశాఖ స్టీల్‌ప్లాంట్‌కి తీవ్రనష్టం వాటిల్లుతున్నది.

కేంద్ర ప్రభుత్వం రెండేళ్ళ క్రితమే దొడ్డిదారిన స్టీల్‌ప్లాంట్‌ భూములను పోస్కోకి కట్టబెట్టడానికి కుట్ర చేసింది. ఐదు మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో హైగ్రేడ్‌ ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ప్లాంట్‌ పేర తెరమీదకి తీసుకొచ్చారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌తో బలవంతంగా పోస్కోతో కేంద్ర ప్రభుత్వం రహస్యంగా నాన్‌ బైండింగ్‌ ఒప్పందాన్ని చేయించింది. మూడువేల ఎకరాల ప్లాంట్‌ భూములను పోస్కోకి కట్టబెట్టడానికి మార్కింగ్‌ కూడా చేశారు. పోస్కో ప్రతినిధి బృందం దొంగచాటున ప్లాంట్‌ పరిశీలనకు కూడా వచ్చారు. ఈ అక్రమ చర్యలను స్టీల్‌ కార్మికులు తీవ్రంగా ప్రతిఘటించారు. పోస్కో ఒప్పందాన్ని అడ్డుకోవాలని గుర్తింపు యూనియన్‌ విన్నవించింది. అయినా ముఖ్యమంత్రి పోస్కో ఒప్పందాన్ని వ్యతిరేకించలేదు. ఆ రోజే రాష్ట్ర ప్రభుత్వం నికరంగా, నిజాయితీగా పోస్కోని వ్యతిరేకించినట్లయితే ఈ రోజు మోదీ ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ అమ్మకాన్ని అంత తేలిగ్గా ముందుకుతెచ్చే సాహసం చేసి ఉండేది కాదు.

ప్రధానమంత్రితో తాజా సమావేశానికి రెండు రోజుల ముందు స్టీల్‌ ప్లాంట్‌ బృందాన్ని ముఖ్యమంత్రి అమరావతికి పిలిపించుకున్నారు. రహస్యంగా చర్చించాల్సిన అవసరం ఏమిటి? రహస్యంగా మీ మధ్య జరిగిన చర్చలు ఏమిటి? వాటి వివరాలను నేటికీ ఎందుకు బహిరంగపరచలేదు? స్టీల్‌ప్లాంట్‌ అమ్మితే నష్టమేమిటి? కార్మికులకు ఎలాంటి ప్యాకేజీ ఇవ్వాలి? ఇత్యాది విషయాలతో పాటు 7 వేల ఎకరాల మిగులు భూముల గురించి చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి మొదటి నుంచీ స్టీల్ ప్లాంట్‌ భూములు అమ్మేయాలనే పాట పాడుతున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ అంశాన్ని తెరమీదకు తీసుకొస్తున్నట్లు అనిపిస్తున్నది. ఎందుకంటే ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున కార్పొరేట్లకు అప్పగించే విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. అందువల్ల స్టీల్‌ భూముల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా వ్యూహం పన్నిందా అనేదానికి ఈ రహస్య భేటీ తావిస్తున్నది.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. గ్రేటర్‌ విశాఖ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. తీర్మానాలు చేసి ఊరుకుంటే సరిపోతుందా? అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం స్ఫూర్తిని ప్రభుత్వం ఆచరణలో పెట్టాలికదా! వీటిల్లో ఏ ఒక్క చర్యనూ ప్రభుత్వం చేపట్టలేదు. పార్లమెంట్‌లో నాలుగు ప్రశ్నలు అడిగి, నాలుగుసార్లు మాట్లాడితేనే సరిపోతుందా? కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గనప్పుడు ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలి కదా? కార్మిక సంఘాలను ప్రధాన మంత్రి వద్దకు తీసుకెళతామన్నారు కదా. ఏడాది అయినా అతీగతీ లేదు. రాష్ట్రంలో బిజెపి మినహా అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉద్యమాన్ని బలపరుస్తున్నాయి. అఖిలపక్ష సమావేశం వేయమని ముఖ్యమంత్రిని పదే పదే డిమాండ్‌ చేస్తున్నా, పార్లమెంట్‌ ఎదుట నిరసన తెలియజేద్దామన్నా అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించటం లేదు. రాష్ట్ర ప్రభుత్వ లొంగుబాటు వల్లే ప్లాంట్‌ అమ్మకంపై కేంద్రం వేగంగా ముందుకెళుతున్నది. చివరికి స్టీల్‌ప్లాంట్‌కి మద్దతుగా 120 మంది ఎంపీల సంతకాలు సేకరించి కూడా ప్రధానిని కలిసి ఇవ్వకుండా డాక్‌లో పంపించారంటే ప్రభుత్వానికి ఈ సమస్యపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమౌతున్నది.

స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకానికి వ్యతిరేకంగా స్టీల్‌ కార్మికవర్గం ఉధృతంగా ఉద్యమం చేస్తున్న నేపథ్యంలో కార్మిక వర్గాన్ని చీల్చడం కోసం నేడు ఎన్నికల అస్త్రాన్ని ప్రయోగించారు. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రోద్బలంతోటే ప్లాంట్‌ కార్మిక సంఘాలకు ఎన్నికలు వచ్చాయి. ప్లాంట్‌లో కార్మికులెవ్వరికీ ఈ ఎన్నికలు ఇష్టం లేదు. ఉద్యమానికి ఈ ఎన్నికలు నష్టదాయకమవుతాయని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలుసు. అయినా ఎన్నికలను నివారించే ఏ ఒక్క చర్యనూ చేపట్టలేదు. కనీసం అన్ని కార్మిక సంఘాలను సమావేశపరిచే పని కూడా చేయలేదు. పైపెచ్చు ఎన్నికలను ముందుకు తీసుకెళ్ళే చర్యలే చేపట్టింది.

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మకానికి వ్యతిరేకంగా మొత్తం తెలుగుజాతి ఒకేమాట మీద నిలబడింది. రాష్ట్రంలోని అన్ని రాజకీయపార్టీలు స్టీల్‌ప్లాంట్‌కి అండగా నిలబడ్డాయి. స్టీల్‌ ఉద్యమాన్ని మీడియా బలంగా సమర్ధిస్తున్నది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యమానికి నాయకత్వం వహించి ఉధృతం చేయడానికి ముందుకు రావడం లేదు. కనీసం పక్కరాష్ట్రాలను చూసైనా బిజెపి పట్ల తన వైఖరిని మార్చుకోవడానికి ప్రభుత్వం సిద్ధపడటం లేదు. బిజెపి చేస్తున్న ద్రోహానికి వ్యతిరేకంగా తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిప్పులు చెరుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రధానమంత్రిని పల్లెత్తుమాట అనడంలేదు! ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు, విన్నపాలు, విజ్ఞప్తులతోటే కాలం వెళ్లబుచ్చుతున్నారు. దేనికోసం ముఖ్యమంత్రిగారి లొంగుబాటు? ఏ రాజకీయ ప్రయోజనం ఆశించి ఈ మౌనం? ఇప్పటికైనా ఈ లొంగుబాటు వీడాలి. ఉధృత ఉద్యమానికి నడుంబిగించాలి. లేదంటే మీ రాజకీయ స్వార్థప్రయోజనం వల్ల విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వరంగం నుండి చేజారే ప్రమాదం ముంచుకొస్తోంది.

డా. బి.గంగారావు

గౌరవ అధ్యక్షులు

స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయిస్‌ గుర్తింపు యూనియన్‌, సిఐటియు