home page

ఇలాగైతే ఎలాగన్నయ్యా!

జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే మనోవేదన

 | 
jagan
ప్రియమైన జగన్నయ్యకు!!
***
ఇలాగైతే ఎలాగన్నయ్యా!!
**
ప్రియమైన జగన్ అన్నయ్యకు నమస్కారాలు.. మీ పుణ్యాన ఎమ్మెల్యే అయినందుకు సర్వదా కృతజ్ఞతలు. చాన్నాళ్ల తరువాత ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టినారు చాలా సంతోషం. ఈ సందర్భంగా మాకు మాకు ఏటా రూ. రెండు కోట్లు ఇవ్వాలని నిర్ణయించినందుకు సంతోషం. కానీ అన్నీయ్యా ఈ రెండుకోట్లూ వచ్చినందుకు సంతోషించాలో ఏమి చేసుకోవాలో తెలియక బాధపడలో తెలీడం లేదన్నయ్యా.. వేడివేడి పెనం మీద నీటి చుక్కలు చిలకరిస్తే సుయ్ మంటూ ఎలా అవిరైపోతాయో, ఖాళీగా ఉన్న బుల్డోజర్ ట్యాంకర్లో చెంచాతో డీజిల్ పోస్తే ఎలా ఉంటుందో, పదికోట్ల అప్పులున్నవాడికి పదిరూపాయలు సాయం చేస్తే ఎలా ఉంటుందో మా పరిస్థితి కూడా అలాగే ఉంది అన్నియ్యా.. ఈ మూడేళ్ళలో మేం మా నియోజకవర్గాల్లో ఎక్కడా తట్టెడు మట్టి పోసిన పుణ్యాన పోలేదు..కాలువలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, రిపేర్లు. ఇవేమీ చెయ్యలేదు అన్నయ్యా.. ఇక మా కార్యకర్తలు.. ముఖ్యంగా మనకోసం ఇన్నాళ్లూ అప్పులు సప్పులు చేసి ఆస్తులు అమ్ముకుని పనిచేసిన వారంతా మనం ఏదో చేస్తామని ఆశతో ఉన్నారు. మీరేమో ఇవ్వకఇవ్వక రెండుకోట్లు ఇస్తున్నారు. ఇవి ఎక్కడ ఖర్చుపెట్టలో ఎవరికి ఎలా సర్దుబాటు చెయ్యాలో తెలీడం లేదన్నయ్యా. మా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మొత్తం దాదాపు 100 పంచాయతీలు ఉన్నాయి. వాటిలో వేటికీ రోడ్లు లేవు.. మేం ఏ సర్పంచుకు కూడా ఇంతవరకూ రూపాయి వర్క్స్ ఇవ్వలేకపోయాం. వాళ్ళు ఎందుకు సర్పంచులు అయ్యారో, ఎందుకు ఎంపీటీసీలు అయ్యారో వాళ్ళకే తెలీదు.. వాళ్ళు మమ్మల్ని సూటిగా చూస్తుంటే తట్టుకోలేకపోతున్నాం అన్నయ్యా.. రోడ్లు ఘోరంగా ఉండడంతో మా కార్లు పాడైపోతాయన్న భయంతో.. ఇంకా జనం మమ్మల్ని ఎక్కడ ప్రశ్నిస్తారోనన్న భయంతో మేము ఊళ్లలోకి వెళ్లడమే మానేశామ్ అన్నయ్యా.. మరిప్పుడు మీరిచ్చిన రెండుకోట్లు ఏ ఊరికి ఎంత ఇవ్వాలో, కీలకమైన నాయకులకు ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కావడం లేదన్నా.. పోనీ పూర్తిగా ఇవ్వడం మనేసారూ కాదు.. డబ్బుల్లేవని చెప్పి తప్పించుకునేవాళ్ళం.. ఇలా పిల్లాడి మూతికి బెల్లం పానకం రాసినట్లు రాస్తే అది నోట్లోకి పోక, నాలుక్కి అందక పిల్లాడు ఎలా అవస్థ పడతాడో మాది కూడా సేమ్ పరిస్థితి అన్నయ్యా.. కాబట్టి మా పరిస్థితి అర్థం చేసుకుని మాకు మరికొన్ని నిధులు ఇస్తారని కోరుతున్నాం.. నిధులు ఇవ్వకుండా మేం పనిమంతులు అవునో కాదో డిసైడ్ చేసి టిక్కెట్లు ఇస్తామని చెప్పడం కూడా బాధాకరమే అన్నయ్య.. మేత వేయకుండా ఆవు పాలు ఇస్తుందా అన్నీయ్యా..నూకలు వేయకుండా కోడి గుడ్డు పెడుతుందా అన్నీయ్యా... నిధులన్నీ నేరుగా జనం ఖాతాల్లోకి బదిలీ చేసేసి, మాకు పనుల్లేకుండా చేసేసి , చివరకు మేం సరిగా పని చేయలేదంటే ఎలాగన్నియ్యా.. మా బాధను అర్థం చేసుకుంటారని భవిస్తూ..
సదా
మీ విధేయుడు
ఉత్తరాంధ్ర ఎమ్మెల్యే