home page

యాదాద్రి రహదారి నిర్మాణంలో నాణ్యతా మరిచారా?

ప్రభుత్వం ఇచ్చిన పనులంటే అంత అలుసా?

 | 
kcr campaign in varanasi

యాదాద్రి రహదార్ల నిర్మాణం లో అంత నిర్లక్ష్యమా? పర్యవేక్షకుల పాపమా ?నాణ్యత లోపమా?
- వడ్డేపల్లి మల్లేశము

       ప్రభుత్వ రంగం, ప్రభుత్వ పనులు, ప్రభుత్వ నిధులు అన్నా అందరికీ అలుసేనా?
 అనేక సందర్భాలలో ఈ మాట అవుననే అనిపిస్తున్నది. కొందరు మరింత అడుగు ముందుకు వేసి ప్రభుత్వ రంగంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు, యంత్రాంగం, ఉద్యోగులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో నాణ్యత లోపంతో ప్రజల సొమ్మే కదా! అని చులకనగా చూస్తూ పనిచేస్తున్నారని నిర్మాణాలు అందుకే తొందరగా విధ్వంసం అవుతున్నాయని ఆరోపణ చేసే వారు కూడా లేకపోలేదు. ఏది ఏమైనా పరిశీలించిన సందర్భంలో ప్రభుత్వ రంగానికి సంబంధించిన పనుల విషయంలో నాణ్యతా లోపం, పర్యవేక్షణ నిర్లక్ష్యం స్పష్టంగా కొట్టొచ్చినట్లు కనపడుతుంది అనడానికి అనేక ఉదాహరణలను ప్రభుత్వ రంగంలోని నిర్మాణాలలో చూడవచ్చు.
     అలాంటి తప్పుడు విధానాలకు పాల్పడినటు వంటి ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, మంత్రులు ,అధికారులు, కాంట్రాక్టర్లు ఎవరైతేనేమీ వారి పైన వెంటనే తగు చర్యలు తీసుకున్నట్లయితే ఈ దుస్థితి ఇలాగే కొనసాగేది  కాదు. పైగా నాణ్యత లోపంతో పనిచేస్తే మించిన శిక్షలు పడతాయనే   భయంతో జాగ్రత్తగా చేసే అవకాశం ఉంటుంది. చట్టాలను అమలు చేసే అధికారులు ,పోలీసు వ్యవస్థ, పాలకులు, ప్రభుత్వ పక్షం ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడిచి నేరస్తులను కాపాడుతున్న కారణంగా ప్రజాధనం వృధా కావడంతోపాటు నేరస్తులకు తగిన శిక్ష పడటం లేదు అని గ్రహించాలి. 
      యాదాద్రిలో అకాల వర్షాలకు జరిగిన విధ్వంసం సంగతి ఏమిటి:-
   ***************************** ****   ఈ వారంలో అకాల వర్షాలు కురిసిన సందర్భంగా యాదాద్రిలో ఇటీవల జరిగిన నిర్మాణాలు, రహదారులు ,వంతెనలు కుప్పకూలిపోయిన విషయాన్ని గమనిస్తే పాలకులు ఎవరి ప్రయోజనం కోసం పని చేస్తున్నారో ఎవరికీ మద్దతు ఇస్తున్నారో తెలిసిపోతుంది. సుమారు నెల రోజుల క్రితం ప్రారంభమైన టువంటి యాదాద్రి దేవాలయం తదితర నిర్మాణాలు రాకపోకలు కొనసాగుతున్న సందర్భంగా కురిసిన ఒకేరోజు అర్ధగంట అకాల వర్షానికి మొత్తము నిర్మాణాలు కుప్పకూలి పోవడం రహదారులు వంతెనలు కొట్టుకుపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని భక్తులు ఆగ్రహంతో విమర్శించడం చర్చనీయాంశమైంది.
     సుమారు రెండు వేల కోట్ల వ్యయంతో దేవాలయ పనుల పునర్నిర్మాణం చేసినప్పటికీ దాదాపుగా మొదటి నుండి పనులన్నీ ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో కొనసాగుతున్నట్లు గా కథనాలు వెలువడుతున్నాయ. రోడ్లు రహదారులు తదితర నిర్మాణాలు అన్నీ కూడా ముఖ్యమంత్రి పర్యవేక్షణలో వారి సూచన మేరకు కొనసాగినట్లు గా టీవీ కథనాల ద్వారా తెలుస్తున్నది .అయినప్పటికీ అకాల వర్షం ఒకేరోజు అర్ధగంట కురిసిన దానికి ఇంత దారుణమా? సకాల వర్షాకాలం ముందే ఉన్నది .చిన్న వర్షానికి నిర్మాణాలు కొట్టుకొనిపోయి గళ్ళు పడి ప్రజా జీవితం చిన్నా భిన్నమైనది అంటే మనం ఏ నాగరికతలో జీవిస్తున్నాము? ఎంత అవినీతి కూపంలో కూరుకు పోయినామో అర్థం చేసుకోవాలి.
   లోపం ఎవరిది? పాపం ఎవరిది:?-
*******
  ప్రభుత్వ నిధుల కు బాధ్యత వహించవలసిన ప్రభుత్వం సంబంధిత అధికారగణం మంత్రులు శాసనసభ్యులు దేవాలయ నిర్మాణానికి సంబంధించి ప్రచార కార్యక్రమంలో ముందున్నప్పటికీ జరిగిన నిర్మాణ పనుల్లో నాణ్యత లోపం కనిపించడానికి ఎవరు బాధ్యులు? ఎవరిని శిక్షించాలి? వెంటనే ప్రభుత్వం నిర్ణయించవలసిన అవసరం ఉన్నది.
 గతంలో నిర్మాణ పనులు జరుగుతున్న సందర్భంలో రాతి గోడ పై ముఖ్యమంత్రి కెసిఆర్ గారి బొమ్మను చిత్రీకరించి ఆ తర్వాత విమర్శలు రావడంతో దానిని తొలగించారు. కొంతకాలం చిన్నజీయర్స్వామి పర్యవేక్షణలో వారి సూచన మేరకు నిర్మాణ పనులు జరిగినప్పటికీ ఆ తర్వాత ఏర్పడిన వైరుధ్యం కారణంగా వారి ప్రమేయం లేకుండానే దేవాలయం పున ప్రారంభం జరిగినది.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గొప్పగా అందుబాటులోకి వచ్చినప్పటికీ ధ్వంసమైన రోడ్ల దుస్థితికి బాధ్యులు ఎవరో ఇప్పటికీ ప్రకటించకపోవడం పట్ల పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు ప్రజలు మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, నాణ్యతా లోపం, అధికారుల అలసత్వం, అవినీతి కారణంగా నే ఈ దౌర్భాగ్యపు దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది.
     ప్రతిపక్షాలకు కనిపించడం లేదా?:-
***********
    తమ తమ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నం అయినటువంటి బిజెపి కాంగ్రెస్ ఇతర వామపక్షాలు ప్రతిపక్షాలన్నీ కూడా అంతో ఇంతో దేవాలయ పునర్నిర్మాణ కార్యక్రమాలలో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న వారే. ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇచ్చిన వారే .అయితే ప్రస్తుతం ఒకే రోజు అరగంట కురిసిన అకాల వర్షానికి మాత్రమే కోట్ల రూపాయలనిర్మాణ పనులు విచ్ఛిన్నం అయినప్పుడు దీని వెనుక ఉన్న అవినీతి బాగోతం ఏమిటి ?అనే విషయం పైన ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదు: వెంటనే జరిగినటువంటి లోపాన్ని గుర్తించి అవినీతి, నాణ్యతా లోపం ఎవరి జోక్యము వల్లనో తెలుసుకోవడానికి వెంటనే ప్రభుత్వం పైన డిమాండ్ చేయాలని ప్రతిపక్షాలపై ప్రజలు ఒత్తిడి చేస్తున్నారు.
        ప్రభుత్వ మౌనంలో ఆంతర్యం ఏమిటి:-
***********
   యాదాద్రి లో జరిగిన రహదారులు వంతెనలు నిర్మాణాలు కొట్టుకుపోయిన సంఘటన పైన ప్రభుత్వ పక్షాన ఇంతవరకు ప్రకటన వెలువడక పోవడం ఆందోళనకరమే. 
 చారిత్రకంగా నిలిచిపోయే స్థాయిలో నిర్మాణము చేపట్టినట్లు గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం చేసిన ఖర్చు జరిగిన పనులు లోపాలు అవినీతి పర్యవేక్షణ తప్పిదాల పైన వెంటనే ప్రకటన చేయవలసి ఉన్నది. అంతేకాదు ఆ లోపానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి వెంటనే దర్యాప్తుకు ఆదేశించాలి. అన్నింటిలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ అని మంత్రి కేటీఆర్ గారితో పాటు ఇతరులు గొప్పలు చెప్పుకునే సందర్భంలో ప్రతిపక్షాలకు చెందిన వారి ప్రాథమిక  కదలికలపై  ఘాటుగా విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న అధికార పక్షం మంత్రులు శాసనసభ్యులు ఈ లోపానికి అవినీతి రూపానికి ఏం సమాధానం చెబుతారో వేచి చూడవలసి ఉన్నది. గత ఎనిమిది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిర్మాణ పనులలో లోపంతో అనేక చోట్ల వాటర్ ట్యాంకులు, కాలువలు, రహదారులు విచ్ఛిన్నమైన సంగతి మనకు తెలిసిందే. అదే వరుసలో యాదాద్రిలో నిర్మాణ పనులు కూడా చేరడం ఆందోళనకరం .యంత్రాంగం పైన అధికారగణం పైన ప్రస్తుత ప్రభుత్వానికి అదుపు లేని కారణంగానే ఈ లోపాలు జరుగుతున్నట్లుగా ప్రజలు గుర్తిస్తున్నారు.  1, 2 సంవత్సరాల లోపలనే   రిజర్వాయర్లు ప్రాజెక్టులు కాలువలు ఎత్తిపోతల పథకాలు నిర్మించామని గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం వాటి నాణ్యత లోపాలపై న దృష్టి పెట్టకపోవడం దయనీయమైన పరిస్థితి. గొప్పలు చెప్పుకోవడం కాదు .చేసిన ప్రతి పని గొప్పగా ఉన్ననాడు మాత్రమే ప్రజలు గుర్తిస్తారు. ప్రతిపక్షాలు ఆధారిస్తాయి. ప్రభుత్వానికి స్థానం ఉంటుంది. కానీ అవినీతి లో, అవినీతి ప్రోత్సాహం లో ఉద్యోగిస్వామ్యం లో దినదినం పెరుగుతున్న అవినీతికి ప్రభుత్వమే బాధ్యత వహించవలసిన టువంటి పరిస్థితులు ఆసన్నమైన ట్లుగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కావున ప్రభుత్వం వెంటనే యాదాద్రి లో జరిగిన రోడ్ల విధ్వంసంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పనుల నాణ్యతపై న విచారణ కమిటీని వేసి దర్యాప్తు చేయిస్తే కానీ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి బయటపడదు. ఇక గొప్పలు చెప్పుకోవడం మాని నాణ్యతపై అవినీతి లేని సమాజం పై దృష్టిపెట్టాలని ప్రభుత్వాన్ని మనసారా కోరుకుందాం.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు ఉపాధ్యాయ ఉద్యమ నేత హుస్నాబాద్ (చౌటపల్లి )జిల్లా సిద్దిపేట తెలంగాణ రాష్ట్రం)