home page

మన్నించు మా మహారాజా!

నేడు విజయనగరం మహారాజా 

పివిజి రాజు జయంతి       


 

 | 
Mrs indira gandhi folding her hands before pvgraju

*మన్నించు మారాజా..!*
_______________________
అహో ఆంధ్రభోజా..
విజయరామరాజా..
విజయనగర సామ్రాజ్య
నిర్మాణ తేజో విరాజా..
నీ కీర్తిని ఇలా శిధిలాలలో
కలిపేస్తున్నారయా..!

కోటపై అక్షరాలు లిఖించినావు..
నీ వల్ల ఈ ఊరికే
ఘనకీర్తి తెచ్చినావు..!

కాని..కాని..
నీకిస్తున్న నివాళి..
నీ దానాలతోనే రాక్షస కేళి..
నీ ఘనచరిత్రకు గురుతు
మూడులాంతర్లపై
కొందరి వికృత కవాతు..
నువ్వు కట్టె..వారు కొట్టె..
వేరొకటి తెచ్చె..
ఇదంతా ఈ ఊరికి
మాయని మచ్చే..
ఒక పథకంతో
జరుగుతున్న కుట్ర..
మాన్సాస్ గొడవలు
పులి మీద పుట్ర..
చినికి చినికి గాలివాన
"రాజు"కుంది నిప్పు
చారిత్రక ఎమ్మార్ కళాశాలలోన..
ఎక్కడ మొదలై ఎక్కడికి
చేరునో ఈ రగడ..
అసలు ఎవరి చాంబర్లో
మొదలైందో ఇంత గడబిడ..
మొత్తానికి నీ ఆశయం..
ఆ నీడలో చదువుల
తల్లి స్వాతిశయం..
ఇప్పుడు నిరాశ్రయం..!

మహోన్నతమైన నీ లక్ష్యం
నీ వారసుల నిర్లక్ష్యం..
జరుగుతున్న ఘోరాలకు
మౌనంగా రోదిస్తున్న
కోటే సాక్ష్యం..
చుట్టూ ఎత్తయిన ప్రాకారాలు
లోన వికృతంగా కదులుతున్న కొత్త కొత్త ఆకారాలు..
వారి వికారాలు..!

ఊరికి ఘనకీర్తి తెచ్చిన..
జనమంతా..
జగమంతా మెచ్చిన
ఎమ్మార్ కళాశాల
ప్రైవేట్ పరమంటే
విజయనగరం మానమే
కాదా తాకట్టు..
ఇలాగే వదిలేస్తే ఒకనాటికి
మాన్సాసే అయిపోదా వాకట్టు!
ఆ కళాశాల పూర్వ విద్యార్థులే
పాత్రధారులట..
అమరావతిలో పొంచి ఉన్నారట సూత్రధారులు...
ఆస్తుల కోసం
చదువులకు మంగళం..
అయ్యో..ఘనచరిత్రకే
అమంగళం..
కొట్టుకు చస్తుంటే
నీ వారసులు
ఓ రోజున నీ సామ్రాజ్యమూ..
నీ కీర్తి..కావా సర్వమంగళం..!?

జనాల్లో కనిపిస్తున్న ఆవేశం..
నీ ఖాందాన్ లో
ఆ చలనమే లేకపోతే
పూసపాటి ఘనచరితకే 
జరిగిపోదా ప్రాయోపవేశం..!

రాజులే పోయినా
రాజ్యాలు కూలినా
కాలాలు మారినా
గాడ్పులే వీచినా..
చెదరని కదలని
ఆ కోట వోలె నీవు
మా హృదయాన
నిత్యమై సత్యమై
నిలిచి ఉందువు
విజయరామా
ఇది నిజము సుమా...!
       
మన్నించు మహారాజా
ఈరోజున నీ కీర్తిని మట్టిలో కలుపుతున్న
మా ఏలికలను కాదు..
వారిని ఎన్నుకున్న
మా తప్పిదాలను...
చారిత్రక తప్పిదాలను..!
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
మహనీయుడు పివిజి రాజు
జయంతి సందర్భంగా క్షమార్పణ పూర్వక నివాళితో..
     *సురేష్ కుమార్ ఎలిశెట్టి*
         9948546286