home page

చిత్తూరునాడి చంద్రబాబుకి దొరికిందా?

మదనపల్లి జనం దేనికి సంకేతం 

 | 
Babu chittor
మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుకు మొదటి నుంచి స్వంత జిల్లాలో ఇక్కట్లు తప్పడం లేదు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, అదే సమయంలో పార్టీ అధినేతగా ఉన్నా ఆయనకు స్వంత జిల్లా అయిన చిత్తూరు జిల్లా కొరుకుడు పడడం లేదు. ముఖ్యమంత్రిగా అన్నాళ్లు పనిచేసినా స్వంత జిల్లాలో ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఏ ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు సాధించలేకపోయారు. అంతే కాదు స్వంత నియోజకవర్గంలోనూ పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేని అశక్తత ఆయనది. అప్పుడెప్పుడో తాను తొలిసారి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చంద్రగిరి నుంచి ఆయన గెలుపొందారు. తరువాత ఆయన తమ్ముడు అక్కడ నుంచి ఒకసారి గెలిచారు. ఆ తరువాత టిడిపి అక్కడ నుంచి గెలుపొందలేదు. చంద్రబాబు ప్రత్యర్థులు ఆయనను హేళన చేయడానికి దీన్ని బాగా వాడుకుంటుంటారు. స్వంత నియోజకవర్గంలో గెలవలేడని, స్వంత జిల్లాలో పార్టీని గెలిపించలేని ఆయన పార్టీని ఎలా అధికారంలోకి తెస్తారని వారు అంటుంటారు. ఇది ఒక రకంగా నిజమే. చంద్రబాబుపై అభిమానం ఉన్నవారు కూడా దీన్ని అంగీకరిస్తారు. ఎందుకోగాని మొదటి నుంచి చిత్తూరు జిల్లా ఆయనకు కొరకరాని కొయ్యే. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నా అధికారం లేనప్పుడు మాత్రం ఇక్కడ పార్టీ పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుంది. 1995లో చంద్రబాబు టిడిపి పగ్గాలు అందుకున్న దగ్గర నుంచి చిత్తూరు జిల్లాలో ఆయన గొప్పగా చెప్పుకునే పరిస్థితి కనిపించలేదు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపికి కేవలం ఆరు స్థానాలు మాత్రమే ఈ జిల్లాలో వచ్చాయి. చంద్రబాబు ఆధ్వర్యంలో టిడిపి రాష్ట్రంలో ఘనవిజయం సాధించినా చంద్రబాబు స్వంత జిల్లాలో మాత్రం నామ మాత్రమైన ఫలితాలు వచ్చాయి. ఆ తరువాత 2004 ఎన్నికల్లోనూ మరోసారి ఫలితాలు బాబును వెక్కిరించాయి. ఈసారి 5స్థానాలు మాత్రమే దక్కాయి. 2009లోనూ అదే పరిస్థితి. అయితే రాష్ట్ర విభజన తరువాత అయినా స్వంత జిల్లాలో పరిస్థితి మారుతుందా అంటే లేదనే 2014 ఎన్నికలు చాటి చెప్పాయి. ఈ ఎన్నికల్లోనూ గత ఫలితాలే ఎదురయ్యాయి. ఇక 2019 ఎన్నికల గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఎన్నికల్లో కేవలం చంద్రబాబు ఒక్కరే గెలుపొందారు. దీంతో స్వంత జిల్లాలో బాబు ఎంతటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారో అర్థం అవుతోంది. 
వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లాలో టిడిపి మరింత దారుణంగా పతనమైంది. చంద్రబాబు నియోజకవర్గమైన ‘కుప్పం’లోమున్సిపాల్టీని కూడా టిడిపి గెలుచుకోలేకపోయింది. ఇక పంచాయితీ, జెడ్‌పిటీసీ, ఎంపిటీసీ ఎన్నికల గురించి ప్రస్తావించుకోవడం అనవసరం. అటువంటి జిల్లాలో ఎన్నికలకు మరో ఏడాదిన్నరకు పైగా సమయం ఉన్న పరిస్థితుల్లో టిడిపి అనూహ్యంగా పుంజుకుంటోంది. దీనికి ఉదాహరణగా నిన్న మదనపల్లెలో జరిగిన టిడిపి మహానాడును చెప్పుకోవచ్చు. ఎటువంటి అంచనాలు లేకుండా జరిగిన ఈ మహానాడు జిల్లా టిడిపికి ఆక్సిజన్‌ను అందించింది. నిన్న జరిగిన మినీమహానాడుకు వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు స్వచ్ఛంధంగా హాజరయ్యారు. ఎడతెరిపిలేకుండా వర్షం పడుతున్నా లెక్కజేయకుండా ప్రజలు, టిడిపి కార్యకర్తలు చంద్రబాబు ప్రసంగాన్ని వినడానికి, తాము పడుతున్న బాధలను చెప్పుకోవడానికి సభాస్థలివద్ద కిక్కిరిసిపోయారు. చంద్రబాబు ప్రసంగానికి అడుగడుగునా హర్షధ్వానాలు చేస్తూ వారు ఆయనను అనుసరించారు. గత మూడేళ్ల వైకాపా పాలనతో విసిగిపోయిన ప్రజలు చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చూడడానికి ఎంత తపిస్తున్నారో నిన్నటి సభ చూస్తే తెలిసిపోతోంది. గతంలో జిల్లాలో సరైన రికార్డు లేని చంద్రబాబుకు ఈసారి ప్రజలు సరికొత్త రికార్డులను అందిస్తారని ఆ సభకు హాజరైన నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద బలహీనంగా ఉన్న చిత్తూరు జిల్లాలో టిడిపి మళ్లీ జవసత్వాలను కూడాగట్టుకుంటోందని, నిన్నటి సభతో తేలిపోయింది. మరి అందివచ్చిన అవకాశాన్ని బలహీనంగా ఉన్న టిడిపి నాయకులు అందుకుంటారో లేదో వేచి చూడాలి.