home page

ఒక్క ఛాన్స్ తో సర్వనాశనం

మాజీముఖ్యమంత్రి చంద్రబాబు

 | 
Cbn

అధికారంలోకి వచ్చాక గుద్దులు

కరెంటు వస్తుందో రాదో.. బిల్లు మాత్రం బాదుడే బాదుడు

8 లక్షల కోట్లు అప్పులు చేశారు.. మరో 3 లక్షల కోట్లు తేనున్నారు

2019లో నిత్యావసరాల ఖర్చు ఎంత.. ఇప్పుడెంతో ఆలోచించండి

నేను చెప్పేది వాస్తవం కాకుంటే టీడీపీకి ఓటు వేయొద్దు

చెత్తపై పన్నువేసిన చెత్త సీఎం.. ప్రజల ముందు దోషిగా నిలబెడతా

నాడు-నేడు పనుల బిల్లులు ఆపి.. పేపర్‌ లీకేజీ చేసుకుంటున్నారు

సిక్కోలు 'బాదుడే బాదుడు'లో నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత

దళ్లవలస బహిరంగ సభలో సీఎంపై చంద్రబాబు ఫైర్‌

శ్రీకాకుళం, మే 4 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఒక్క చాన్సు ఇస్తే.. సీఎం జగన్‌ రాష్ట్రాన్ని అప్పుల పాల్జేశారని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు. జగన్‌ను కరోనా కంటే ప్రమాదకారిగా అభివర్ణించారు. ఆయన పాలనలో రాష్ట్ర ఆదాయం పెరగలేదు.. ప్రజల ఆదాయం పెరగలేదు.. ఖర్చులు మాత్రం పెరిగిపోయాయన్నారు. నాడు పాదయాత్రలో ప్రజలకు ముద్దులు పెట్టి.. అధికారంలోకి వచ్చాక గుద్దులే గుద్దుతున్నారని ఎద్దేవాచేశారు. వైసీపీ సర్కారుపై 'బాదుడే బాదుడు' పేరిట టీడీపీ నిర్వహిస్తున్న నిరసనలో భాగంగా బుధవారం రాత్రి శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మందలం దళ్లవలసలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. అక్కడి ప్రజలతో మమేకమై.. ప్రతి ఇంటికీ వెళ్లి.. ప్రస్తుత నిత్యావసర ధరలు ఎలా ఉన్నాయి.. 2019లో టీడీపీ హయాంలో ఎలా ఉన్నాయో ప్రశ్నించి వారి నుంచే సమాధానాలు రాబట్టారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే..

దాడులు.. కేసులు..

ఏం తమ్ముళ్లూ.. బాగున్నారా..? అందరూ హుషారుగా ఉన్నారా? కష్టాల్లో ఉన్నారా..? సంతోషంగా ఉన్నవారు మాత్రం చేతులు పైకెత్తిచెప్పండి. 2019 ఎన్నికల్లో అందరూ ఒకటే ఆలోచించారు. అప్పట్లో వైఎ్‌సను చూశాం.. ఇప్పుడు జగన్‌కు కూడా ఒక అవకాశం ఇచ్చి చూద్దామని మాయలో పడ్డారు. జగన్మోహన్‌రెడ్డి కల్లు తాగిన కోతిలా ప్రవర్తిస్తున్నారు. టీడీపీ నాయకులపైన దాడులు.. పార్టీ కార్యాలయంపైనా దాడులు.. నన్ను భయపెట్టేందుకు నాపైనే కేసులు. అసెంబ్లీలో నన్నే కాకుండా నా కుటుంబాన్ని అవమానిస్తున్నారు. అసెంబ్లీ కాదు అది.. కౌరవ సభ. భయపడను. అప్పుడే చెప్పాను.. ధర్మాన్ని పరిరక్షించి మళ్లీ అధికారంలోకి వస్తాం. ప్రజల ముందు దోషిగా నిలబెడతా. వైసీపీకి శాశ్వత రాజకీయ సన్యాసం చేయిస్తా.

మూడేళ్లలో ఏడు సార్లు..

నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. పామాయిల్‌ నుంచి పెట్రోల్‌, గ్యాస్‌, కరెంటు చార్జీలు.. ఇలా అన్ని ధరలూ బాదుడే బాదుడు. కరెంటు ఎప్పుడొస్తుందో తెలియదు గానీ బిల్లు మాత్రం బాదుడే బాదుడు. మూడేళ్లలో ఏడు సార్లు కరెంటు చార్జీలు పెంచారు. టీడీపీ హయాంలో ఆర్థిక కష్టాలున్నా రాష్ట్రంలో కరెంట్‌ కోతలు లేకుండా ఇచ్చాం. భవిష్యత్‌లో విద్యుత్‌ చార్జీలు పెంచబోమని స్పష్టంగా చెప్పాం. పవన విద్యుత్‌, సోలార్‌ వల్ల రూ.2.50 చొప్పున యూనిట్‌ లభ్యమయ్యేది. అవన్నీ ఆగిపోయి.. ఇప్పుడు విద్యుత్‌ బిల్లు చూసి వినియోగదారుడి గుండె ఆగినంత పనవుతోంది.

మోదీయే చెప్పారు..

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌, విద్యుత్‌ చార్జీలు ఎక్కువని ప్రధాని మోదీయే చెప్పారు. అయినా జగన్‌రెడ్డి ధరలు తగ్గించడంలేదు. ఆనాడు లోటులో ఉన్నా సరే పెట్రోల్‌, డీజిల్‌పై రూ.5 చొప్పున తగ్గించాం. జగన్‌రెడ్డి చివరకు చెత్తపై కూడా పన్నువేసి చెత్త సీఎంగా పేరుగాంచారు. భారతి సిమెంట్‌ రేటు పెంచేందుకు సిండికేట్‌ అయి.. జగన్‌ కంపెనీలకు లాభాల కోసం ధరలు పెంచేశారు. రాష్ట్రంలో 40 లక్షల భవన నిర్మాణ కార్మికులకు అండలేకుండా చేశారు. ఇచ్చింది గోరంత అయితే.. ప్రచారం కొండంతగా అవినీతి పత్రికలో ప్రచురిస్తున్నారు. జే బ్రాండ్ల మద్యం ఇతర రాష్ట్రాల్లో లేదు. టీడీపీ హయాంలో అందుబాటులో ఉన్న మెక్‌డోవెల్‌, కింగ్‌ఫిషర్‌ వైన్‌ వంటివి ఇప్పుడు లభ్యం కావడంలేదు. బూమ్‌బూమ్‌, స్పెషల్‌ స్టేటస్‌ వంటి జే బ్రాండ్‌ మద్యం లభిస్తున్నాయి. అంతా నాసిరకమే. అవీ నాటుసారాయితో సమానమే. మందుబాబుల మెడలు పడిపోతున్నాయి. ఇప్పుడు మద్యం కోసం రోజుకు రూ.200 పైనే ఖర్చుచేస్తున్నారు. అప్పుడు మద్యపాన నిషేధం చేస్తామని చెప్పిన జగన్‌రెడ్డి.. ఇప్పుడేమో మద్యం తాగవచ్చని చెబుతున్నాడు. మగవారు తాగి అలిసిపోతే మహిళలు కూడా తాగాలని చెబుతాడేమో! నేను సీఎంగా ఉన్నప్పుడు గురజాలలో ఓ వ్యక్తి ఓ మహిళను హత్యాచారం చేశాడు. అప్పటికప్పుడు 20 బృందాలను నియమించాను. వాటికి భయపడి నిందితుడు ఏకంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తప్పుచేయాలనుకునేవారు భయపడేలా చేశాం. ఇప్పుడు నెల రోజుల వ్యవధిలో 31 సంఘటనలు జరిగాయి. హోం మంత్రి మాట్లాడుతూ.. తాగిన మైకంలో అత్యాచారాలు చేస్తున్నారని అంటున్నారు. అలాంటి హోంమంత్రి ఉంటే ఎంత... లేకుంటే ఎంత?

లక్షల కోట్ల అప్పుతో అభివృద్ధి చేశారా?

జగన్‌ రూ.8 లక్షల కోట్లు అప్పుతెచ్చారు. సంపద సృష్టించలేదు. టీడీపీ ప్రభుత్వంలో ఆదాయంలో 53 శాతం సంక్షేమానికి ఖర్చుచేశాం. వైసీపీ ప్రభుత్వం 43 శాతం వెచ్చిస్తోంది. మరో 3 లక్షల కోట్లు అప్పుతెస్తారు. ఆపై వడ్డీగా 1.5 లక్షల కోట్లు చెల్లిస్తారు. ఇదీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఎక్కడైనా రోడ్లు బాగుచేశారా? కనీసం వీధిలైట్లు వేశారా? కొత్త ప్రాజెక్టు తెచ్చారా? నాడు-నేడు పనుల్లో బిల్లుల చెల్లింపులు వదిలేసి పేపర్‌ లీకేజీ చేసుకుంటున్నారు. ఇందుకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యన్నారాయణ రాజీనామా చేస్తారా.. సీఎం రాజీనామా చేస్తారా? వారం రోజుల్లో సీపీఎస్‌ రద్దుచేస్తామన్నారు. మూడేళ్లుగా ఉద్యోగులను కూడా మోసం చేశారు. జగన్‌ రెడ్డి వస్తాడు.. పోతాడు. రైతుల పొలాలకు విద్యుత్‌ ఇచ్చినందుకు మీటర్లు పెట్టి వారి మెడకు ఉరితాళ్లు బిగిస్తే ఎలా? అందరం ధైర్యంగా పోరాడదాం. మీ కోసం నేనున్నాను. రాష్ట్రం కోసం ధైర్యంగా ముందుకురావాలి. అక్రమ కేసులు పెట్టిన పోలీసులపైనా ట్రైబ్యునల్‌ వేసి తప్పుచేసినవారిని శిక్షిద్దాం.

దళ్లవలసలో సహపంక్తి భోజనం

దళ్లవలసలో నిర్వహించిన బాదుడేబాదుడు కార్యక్రమంలో చంద్రబాబు ఉత్సాహంగా పాల్గొన్నారు. విశాఖ నుంచి ఆయన సాయంత్రం 5.07 గంటలకు శ్రీకాకుళం చేరుకున్నారు. దివంగత నేత ఎర్రన్నాయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ప్రతి గ్రామంలో చంద్రబాబుకు మహిళలు నీరాజనం పట్టారు. బాదుడే బాదుడు కార్యక్రమం అనంతరం వేదిక పక్కనే భారీసంఖ్యలో మహిళలతో కలిసి చంద్రబాబు సహపంక్తి భోజనం చేశారు.

కరోనా కంటే భయంకరమైన వ్యక్తి జగన్‌. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక రూ.8 లక్షల కోట్లు అప్పుతెచ్చారు. మరో 3 లక్షల కోట్లు తెస్తారు. ఆపైన వడ్డీగా 1.5 లక్షల కోట్లు చెల్లిస్తారు. ఇదీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.

మద్యంపై రూ.25 వేల కోట్లు అప్పుతెచ్చాడు. మరో రూ.50 వేల కోట్లు తెస్తాడు. ఆపై బలవంతంగా ప్రజలను తాగిస్తాడు. ఇదీ ఈ పెద్దమనిషి తీరు.

చంద్రబాబు