home page

విధ్వంసమే నేటి రాజకీయం!

రచన: టి.లక్ష్మీ నారాయణ 

 | 
Jcb

1. జిల్లా పేరుపై రచ్చ - కులాల మధ్య చిచ్చు - ప్రజల మధ్య రాజకీయ విద్వేషం - విధ్వంసం - ఇదే నేటి రాజకీయం! రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారు! 

2. సామాజిక మార్పు - అభివృద్ధి కోసం జీవితాలను అంకితం చేసిన, ప్రాణాలను అర్పించిన మహనీయులు పేరు, ప్రఖ్యాతల కోసం ఆ పని చేయలేదు. అందుకే వారు చరిత్ర పుటలకెక్కారు. తరాలు మారినా ఆదర్శప్రాయులుగా కీర్తించబడుతున్నారు. ఆ మహనీయుల పేర్లను సంకుచిత రాజకీయాల ఊబిలోకి లాగి, లబ్ధి పొందుదామని ఎవరు ప్రయత్నించినా, వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. 

3. సమాజాన్ని భ్రష్టు పట్టించే దుష్టశక్తులు పెట్రేగి పోతున్నాయి. కులం, మతం, ప్రాంతం, ఆచారాలు, సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, వేషధారణ, అన్నింటినీ ఆయుధాలుగా మలచుకొని సమాజ విచ్ఛిత్తికి ఆ దుష్టశక్తులు ఎప్పుడు, ఎక్కడ, ఏ రూపంలో విరుచుకు పడతాయో ఊహించడమే దుర్లభంగా పరిస్థితులు దిగజారిపోయాయి.

4. మహనీయులను సహితం కులం, మతం, ప్రాంతీయ కోణాల్లో చూడడం, అభిమానించడం లేదా ద్వేషించడం కుసంస్కారానికి ప్రబల నిదర్శనం. 

5. మహనీయులు ఆవిష్కరించిన, ప్రవచించిన, ప్రతిపాదించిన భావజాలంపై మేధోమథనం, చర్చ, సంఘర్షణ జరిగితే, ఆచరిస్తే సమాజ అభివృద్ధికి దోహదపడుతుంది. ఆ ప్రక్రియలో ప్రజలను భాగస్వాములను చేసి, చైతన్యవంతులను చేయడం అవసరం. అలాంటి చర్యలు ఆహ్వానించ తగిన పరిణామంగా భావించి, హర్షించవచ్చు. కానీ, మహనీయుల పేర్లను వివాదాస్పదం చేసే దుర్బుద్ధితో ప్రభుత్వాలుకానీ, రాజకీయ పార్టీలు కానీ, సంస్థలుకానీ, వ్యక్తులుకానీ ప్రవర్తిస్తే అంతకంటే నీచమైన చర్య మరొకటి ఉండదు.

6. ప్రభుత్వ పథకాలకు, ప్రభుత్వ భవనాలకు, ప్రభుత్వ కాలనీలకు, ప్రాజెక్టులకు, ఆనకట్టలకు, జలాశయాలకు, వీధులకు, జిల్లాలకు, రేపోమాపో మండలాలకు వ్యక్తుల పేర్లు పెట్టడం, విగ్రహాలు నెలకొల్పడం లాంటి దోరణి రోజు రోజుకు ప్రబలుతున్నది. ఈ దోరణి ఆంధ్రప్రదేశ్ లో వెర్రితలలు వేస్తున్నది. ఇది అత్యంత జుగుప్సాకరంగా పరిణమించింది. 

7. సమాజ గమనంలో లెక్కకు మించి, వ్యక్తులు సామాజికాభివృద్ధిలో వారి వంతు పాత్ర పోషించి, అమరులవుతుంటారు. అలాంటి వారు సమాజంపై చెరగని ముద్రవేసి చరిత్ర పుటలకెక్కుతారు. అలాంటి మహనీయుల జీవిత చరిత్రలను భావితరాలకు బోధించి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి. 

8. నేటి సమాజంలో నేరస్తులు పెరిగిపోతున్నారు. అసాంఘిక శక్తులు బలపడుతున్నాయి. సమాజంపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అలాంటి చరిత్రహీనుల సంఖ్య పెరిగిపోతున్నది. అలాంటి వారిని కూడా కీర్తించే సమాజంలో జీవిస్తున్నాం.

9. చరిత్ర పుటలకెక్కిన మహానుభావులందరికీ శిలాఫలకాలుండవు, కాంస్యవిగ్రహాలుండవు. అంత మాత్రాన వారు సమాజానికి చేసిన సేవలను సమాజం గుర్తుపెట్టుకోలేదని భావించకూడదు. కొందరు మహనీయులు భౌతికంగా లేకపోయినప్పటికీ సమకాలీన ప్రపంచాన్ని ప్రభావితం చేస్తూ చరిత్రతో పాటు నడుస్తూనే ఉంటారు. ఆ కోవకు చెందిన జాతి రత్నాలు, తెలుగు జాతి ముద్దుబిడ్డలు సమాజానికి చేసిన సేవలను భావితరాలకు పాఠ్యాంశాలుగా బోధించాలి. 

10. జాతిపిత మహాత్మాగాంధీ, డా.బాబాసాహెబ్ అంబేడ్కర్, అలాంటి జాతి రత్నాల విగ్రహాల సరసన చరిత్రహీనుల విగ్రహాలు దర్శనం ఇస్తుంటాయి. ఆ దృశ్యాలు కంటపడినప్పుడు జుగుప్స కలుగుతుంది. మహనీయుల విగ్రహాలను కొన్ని దుష్టశక్తులు ధ్వంసం చేసిన వార్తలు విన్నప్పుడు, చదివినప్పుడు సిగ్గుతో తలదించుకోవాల్సిన దుస్థితికి నెట్టివేయబడుతుంటాం. 

11. నేడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 26 జిల్లాలలో 18 జిల్లాలకు జిల్లా కేంద్రం లేదా ప్రాంతం లేదా నదుల పేర్లు పెట్టారు. వాటి పట్ల ఎలాంటి వివాదం లేదు. 8 జిల్లాలకు వ్యక్తుల పేర్లు పెట్టారు. వారిలో భారత స్వాతంత్య్రం కోసం తెల్లదొరలకు వ్యతిరేకంగా వీరోచితంగా పోరాడి ప్రాణ త్యాగం చేసిన అమరజీవి అల్లూరి సీతారామరాజు, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు, పద కవితా పితామహులు తాళ్ళపాక అన్నమాచార్యులు, ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు, మాజీ ముఖ్యమంత్రులు యన్.టి. రామారావు, డా.వై ఎస్.రాజశేఖరరెడ్డి, తను తాను దైవాంశ సంభూతుడుగా భావించుకొన్న పుట్టపర్తి సత్యసాయిబాబా ఉన్నారు. తాజాగా కోనసీమ జిల్లాకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరు పెట్టారు. ఇక్కడితో ఆగిపోలేదని సీనియర్ మంత్రివర్యులు బొత్సా సత్యనారాయణ వ్యాఖ్యానించారు. అంటే, ఇంకా ఏఏ జిల్లాకు ఎవరి పేరు పెడతారో తెలియదు. కొన్ని  సామాజిక తరగతుల ప్రజల నుండి కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభుత్వం వాటిని పరిగణలోకి తీసుకుంటుందో! లేదో! భవిష్యత్తులో తేలుతుంది.

12. జిల్లాలకు రాజకీయ నాయకుల పేర్లు, ఆ మాట కొస్తే వ్యక్తుల పేర్లు పెట్టడంలో ఔచిత్యం ఏమైనా ఉన్నదా! అన్న ఆలోచన నా బుర్రను తొలిచేస్తున్నది. నా వరకు వ్యక్తుల పేర్లు జిల్లాలకు పెట్టడం అసంబద్ధమైనది.

టి.లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు