home page

సామాన్యుడి వైపు దశాబ్ది కాలం

పదేళ్ళు పాలనకు చేరువలో    ఆమ్ ఆద్మీ పార్టీ

 | 
Kejriwal

మొన్న ఢిల్లీ, నిన్న పంజాబ్, రేపటి లక్ష్యం...?

సామాన్యుడి వైపు- 'స్వరాజ్యం' సిద్ధాంతంగా, సామాన్యుడి వైపు నిలుచునే దిశగా 'ఆమ్ ఆద్మీ పార్టీ' స్థాపన జరిగింది.
పార్టీ స్థాపించి ఈ నవంబర్
26 కు దశాబ్దం పూర్తికానుంది.
ఈ దశాబ్దకాలంలో పార్టీ దశ బాగానే తిరిగింది.
దేశ రాజధానిలో వరుసగా రెండుసార్లు అధికారాన్ని చేజిక్కించుకుంది.విస్తరణలో భాగంగా పంజాబ్ లో కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని కైవసం చేసుకొని రాజకీయ యవనికలో సంచలనం సృష్టిస్తోంది.
సమాంతర వాతావరణాన్ని సృష్టించే దిశగా వేగంగా కదులుతోంది.విభిన్న రాష్ట్రాల్లో అధికారాన్ని సొంతం చేసుకుంటూ,
జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలని గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
అన్నీ కలిసివస్తే దేశాన్ని పాలించాలని చూస్తోంది.
అత్యంత చరిత్ర కలిగిన జాతీయ పార్టీ కాంగ్రెస్ కంటే ఎన్నో రెట్లు చురుకుగా
ఆమ్ ఆద్మీ ముందుకు వెళ్తోంది. పార్టీ స్థాపకుడు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా దిల్లీలో  ఇప్పటికే తనదైన ముద్ర వేసుకున్నారు.ఇటీవలే పంజాబ్ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన భగవంత్ మాన్ కూడా ప్రజాప్రయోజనమైన కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ సంచలనవార్తలకు కేంద్రంగా నిలుస్తున్నారు.తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం కూడా సంచలనం సృష్టిస్తోంది. పంజాబ్ జైళ్లల్లో
వీఐపీ గదులను
రద్దు చేస్తున్నట్లు శనివారం నాడు ప్రకటించారు. రాష్ట్రంలోని జైళ్లల్లో
ఇప్పటివరకూ సుమారు 710 ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.జైళ్లల్లో ఫోన్ల రాకపోకలను పూర్తిగా బంద్ చేస్తున్నామని వెల్లడించారు.
జైళ్లను సంస్కరణ గృహాలుగా మారుస్తామని చెబుతున్నారు.
మొత్తంగా వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడి, అడుగడుగునా సామాన్యుడే ప్రధానుడుగా నిలవాలని పంజాబ్ ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారు.
ఆ రాష్ట్రంలోని 184 మంది ప్రముఖులకు భద్రతను ఉపసంహరిస్తున్నట్లు పోయిన నెలలో ప్రకటించారు.
భద్రత తొలగించినవారిలో మాజీ మంత్రులు,
ఎమ్మెల్యేలు,ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉన్నారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగించే గ్యాంగ్ స్టర్లను ఏరిపారేసే దిశగా సంబధిత వర్గాలకు ప్రభుత్వం
పూర్తి స్వేచ్ఛనిచ్చింది.ఈ దిశగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను కూడా ఏర్పాటుచేశారు.
ఎవరైనా లంచం అడిగితే వీడియో తీసి నేరుగా
నాకే పంపండి అంటూ అవినీతి వ్యతిరేక హెల్ప్ లైన్ ను కూడా భగవంత్ మాన్ మార్చిలోనే ప్రారంభించారు.పేద ప్రజలు, సామాన్యులు రేషన్ కోసం దుకాణాల ముందు బారులు తీరాల్సిన అవసరం లేదని, అర్హులైన లబ్దిదారుల
ఇంటి వద్దకే సరుకులు పంపే ఏర్పాటు చేస్తున్నామని
ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా ప్రశంసలను అందుకుంది.
రెక్కాడితే కానీ డొక్కాడని పేదవారు పనులు మానేసి రేషన్ దుకాణాల ముందు వరుసకట్టే కష్టాలకు ముగింపు లభించినట్లే.
దీనితో వృద్ధులు,మహిళలు, అనారోగ్యంతో బాధపడేవారికి కూడా వెసులుబాటు లభించినట్లే.
దిల్లీలో కూడా ఇదే విధానాన్ని అమలుచేయాలని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంకల్పం చేసుకున్నప్పటికీ అనేక హస్తాలు అడ్డుపడ్డాయి.  అమలుకాకుండా
కేంద్ర ప్రభుత్వం అడ్డుపడిందని కేజ్రీవాల్ బహిరంగంగానే విమర్శించారు.
'ఇంటికే నేరుగా రేషన్' పథకం దేశంలోని మిగిలిన
ఏ రాష్ట్రాల్లోనూ ఇంతవరకూ లేదు.పంజాబ్ ప్రేరణతో ఇకనుంచి మిగిలిన
రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలులోకి తెచ్చే అవకాశం ఉంది.భగవంత్ మాన్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళల్లోనే దూకుడు పెంచారు.ప్రభుత్వ రంగంలో ఖాళీ ఉన్న 25 వేల ఉద్యోగాలను వెనువెంటనే
భర్తీ చేయాలని కీలకమైన ఆదేశాలిచ్చారు.
ఆరోగ్య,విద్యారంగాలపైన కూడా దృష్టి సారించారు.
ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు పెంచకుండా నిషేధం విధించారు.పుస్తకాలు, యూనిఫార్మ్ ను ఎక్కడైనా కొనుక్కొనే స్వేచ్ఛనిస్తూ,
తమ దగ్గరే కొనాలని
వత్తిడి తెచ్చే విద్యా సంస్థలపై కఠినచర్యలు తీసుకుంటామని ప్రకటించారు.పేదలకు, మధ్యతరగతివారికి ఆర్ధికంగా ఊరటనిచ్చే ఈ విధానంపై పంజాబ్ లో సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుడికి భారం కాకుండా విద్య అందే విధంగా,
విద్యా రంగంలో
సరికొత్త విధానాల రూపకల్పన దిశగా కసరత్తులు చేస్తున్నారు.రాష్ట్రంలోని
ప్రతి ఇంటికీ నెలకు
300 యూనిట్ల వరకూ
ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు చేసిన ప్రకటనకు కూడా సామాన్య ప్రజ నుంచి
విశేష స్పందన లభించింది.
దిల్లీ లో 200 యూనిట్లకు
ఈ సదుపాయాన్ని అందిస్తుండగా,పంజాబ్ లో 300 యూనిట్ల వరకూ వెసులుబాటు కల్పించడం గమనార్హం.మంత్రి పదవుల కోసం ఆరాటపడకండని,
అస్తమానం రాజధానిలో కాకుండా నియోజకవర్గాలలోనే ఎక్కువకాలం ఉంటూ
ప్రజల వైపు నిలవండని
తన ప్రారంభ ఉపన్యాసంలోనే భగవంత్ తమ ఎమ్మెల్యేలందరికీ
దిశానిర్దేశం చేశారు.
పంజాబ్ లోని మొత్తం
117 అసెంబ్లీ స్థానాలలో
92 స్థానాలను కొల్లగొట్టిన
ఆమ్ ఆద్మీ పాలనలోనూ మంచి ఊపులో ఉంది.
మార్చి 16 వ తేదీన పంజాబ్ ముఖ్యమంత్రిగా
భగవంత్ మాన్ అధికారం చేపట్టారు.
ఇప్పటికి కచ్చితంగా
రెండు నెలల పదవీ కాలం పూర్తయింది.
ఇంత తక్కువకాలంలోనే తనదైన విలక్షణ ముద్ర వేసుకున్నారు.కమెడియన్ గా, హాస్య చతురుడుగా ఎందరికో వినోదాన్ని పంచిన
భగవంత్ మాన్ పాలిటిక్స్, పాలనను సీరియస్ గా తీసుకొని,నాయకుడిగా ప్రజలకు భరోసాను కల్పిస్తూ, ప్రతి(పక్ష)నాయకులకు వణుకుపుట్టిస్తున్నారు.
ఒకప్పుడు ఆయన వివాదాలకు కేంద్రబిందువుగా ఉండేవాడు. నేడు సామాన్య ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకుంటూ సంచలనాలు సృష్టిస్తున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ రచించుకున్న విధానాలను అమలు చేయడంలో వ్యవస్థాపకుడు కేజ్రీవాల్ కంటే
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కే వెసులుబాటు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.
దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు అంత స్వేచ్ఛ లభించడం లేదని అర్ధం చేసుకోవాలి. దేశరాజధానిలో కేంద్ర ప్రభుత్వం పెత్తనమే ఎక్కువ ఉంటుందనే విమర్శలు మొదటి నుంచీ ఉన్నాయి.ముఖ్యంగా లా అండ్ అర్డర్ కేంద్ర హోమ్ శాఖ చేతుల్లోనే ఉంటుంది.
లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు గతంలో కంటే ఎక్కువ అధికారాలను కల్పించారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆందోళన చేస్తూనే ఉన్నారు.గతంలో
కాంగ్రెస్ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్,బిజెపి ముఖ్యమంత్రి సుష్మా స్వరాజ్ ఉన్నప్పుడు ఉన్న స్వేచ్ఛాస్వతంత్రాలు ఇప్పటి ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు లేవని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
దేశంలోని రాజకీయాల స్వరూప స్వభావాలను సమూలంగా మార్చేస్తామని, పరిపాలనలో గొప్ప సంస్కరణలను తీసుకువస్తామని, సామాన్యుడిని రాజుగా నిలబెడతామని చెప్పి, రాజకీయాల్లోకి వచ్చిన హక్కుల ఉద్యమకారుడు, మాజీ ఐ ఆర్ ఎస్ అధికారి కేజ్రీవాల్ తను స్థాపించిన లక్ష్యాలను నెరవెరిస్తే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది?
కాలగమనంలో ఆయన కూడా షరా మామూలు
రాజకీయవేత్తగా మారకుండా ఉంటారని ఆశిద్దాం. సామాన్యుడి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో... చూద్దాం.-మాశర్మ🙏