home page

మరో జలాశయ కోసం ఆందోళన

ఈనెలాఖరులో  సిద్ధేశ్వర కోసం ఉద్యమం 

 | 
సిద్ధేశ్వర

సిద్ధేశ్వరం కోసం సాగునీటి సాధన సమితి ఆందోళన

టీడీపీ హయాంలో మహోద్యమంగా 'ప్రజా శంకుస్థాపన'

తెర వెనుక సహకరించిన వైసీపీ నాయకులు

అధికారంలోకి రాగేనే అలుగు నిర్మిస్తామని జగన్‌ హామీ

సీమ ఉద్యమకారుల్లోనూ కొరవడిన నాటి స్ఫూర్తి

ఈ నెల 31న సిద్ధేశ్వరం జలదీక్షకు సిద్ధం

రాయలసీమ పోరాట చరిత్రలో సిద్ధేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపనది ప్రత్యేక స్థానం.

రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకత్వంలో 2016 మే 31న ఈ మహోద్యమం నిర్వహించారు. వేలాదిగా రైతులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. రాయలసీమ కరువు కాటకాలు పోవాలంటే కృష్ణా నదీజలాలే ఆధారం. 'శ్రీశైలం జలాశయం నుంచి కిందికి ప్రవహించి సముద్రం పాలవుతున్న నీటికి నిలకడ నేర్పి... పంట పొలాలకు అందించాలంటే... సిద్ధేశ్వరం అలుగు నిర్మించాల్సిందే' అనే నినాదంతో రైతులందరూ ఒక్కటయ్యారు. అప్పటి ప్రతిపక్ష వైసీపీ నాయకులు తెర వెనుక నుంచి మద్దతు ఇచ్చారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తమ పార్టీ అధికారంలోకి వస్తే అలుగు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తవుతున్నా... సిద్ధేశ్వరం అలుగు అతీగతి లేదు. సీమలో కరువు పరిస్థితులూ మారలేదు. రైతుల ఆత్మహత్యలూ ఆగలేదు.

మీడియా సమాచారం:-

శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 21,500 క్యూసెక్కుల కృష్ణా జలాలను తరలించి చెన్నైకు తాగునీరు, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తాగు, సాగునీరు అందించేందుకు 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ తెలుగగంగ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. చెన్నై తాగునీటికి 15 టీఎంసీలు, ఎస్‌ఆర్‌బీసీ కాలువకు 19.5 టీఎంసీలు నికర జలాలు కేటాయించారు. 2004లో అధికారం చేపట్టిన వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ను 44 వేల క్యూసెక్కులకు విస్తరించారు. 38 టీఎంసీలు కృష్ణా వరద జలాలు 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాలకు తాగునీరు ఇవ్వాలని గాలేరు-నగరి సుజల స్రవంతి (జీఎన్‌ఎస్‌ఎస్‌) ప్రాజెక్టును చేపట్టారు. రెండు దశల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టు నేటికీ అసంపూర్తిగానే ఉంది. సీమ ప్రాజెక్టులకు పోతిరెడ్డిపాడు ద్వారా నీరు అందించాలంటే శ్రీశైలం జలాశయంలో 854 అడుగులపైనే వరద నీరు నిలువ ఉండాలి. దీనికి ఒక్క ఇంచీ తగ్గినా చుక్క నీరు తీసుకోవడానికి వీలు కాదు. అందువల్లే తరచూ తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, జీఎన్‌ఎస్‌ఎస్‌, కేసీ కాలువల కింద పంటలకు కీలక దశలో నీరు అందడం లేదు. పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి సిద్ధేశ్వరం అలుగు నిర్మించడం ఒక్కటే శాశ్వత పరిష్కారంగా ముందుకు వచ్చింది. కానీ ఆరేళ్లు కావస్తున్నా పాలకుల్లో అలుగు నిర్మించాలనే చిత్తశుద్ధి కనిపించడం లేదు.

నాటి స్ఫూర్తి ఏదీ?

సిద్ధేశ్వరం అలుగు సాధన కోసం రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనరు బొజ్జ ధశరథరామిరెడ్డి నేతృత్వంలో ఉద్యమం జరిగినప్పుడు రాయలసీమ విద్యావంతుల వేదిక సహా అనేక ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, విద్యార్థి, మహిళా సంఘాలు అందులో భాగమయ్యాయి. పల్లెపల్లెకు వెళ్లి జన చైతన్య సదస్సులు నిర్వహించారు. సంగమేశ్వరం వద్ద ప్రజా శంకుస్థాపన చేశారు. తెర వెనుకు వైసీపీ ముఖ్య నాయకులు, జిల్లా, మండల స్థాయి నాయకులు సహకరించారనే చర్చ ఆనాడు జరిగింది. కానీ ఆరేళ్లు కావస్తున్నా ప్రాజెక్టు నిర్మాణం ఊసే లేదు. కనీసం సర్వేకు కూడా నోచుకోలేదు. సిద్ధేశ్వరం డిమాండ్‌ కనుమరుగు కాకుండా సీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్‌ బొజ్జ దశరథరామిరెడ్డి సహా ఐదారుగురు నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు. ఆనాడు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఎందరో నాయకులు మౌనంగా ఉన్నారు. ఆనాటి పోరాట స్ఫూర్తి ఏమైందని రైతులు ప్రశ్నిస్తున్నారు.

శ్రీశైలం భద్రతకు కూడా..

శ్రీశైలం ప్రాజెక్టు దిగువన ప్లంజ్‌పూల్‌ (స్పిల్‌వే గేట్ల నుంచి వరద జలాలు కింద పడి మళ్లీ ఎగిరి పడే ప్రాంతం)లో ఏర్పడిన భారీ గుంతతో డ్యాం భద్రతకు ముప్పు తప్పదని నిపుణులు అంటున్నారు. 2020లో కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్‌ ఏబీ పాండ్యా చైర్మన్‌గా కమిటీ ఏర్పాటైంది. 2021లో సీడబ్ల్యూసీ శ్రీశైలం వరద ప్రవాహంపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. పాండ్యా కమిటీ సూచించిన అదనపు స్పిల్‌వేకి బదులుగా సిద్ధేశ్వరం అలుగు నిర్మిస్తే.. వరద ఒత్తిడి తగ్గి డ్యాంకు భద్రత ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జగన్‌ హామీ ఓట్ల కోసమేనా..?

'2019లో మన ప్రభుత్వం వస్తుంది. సిద్ధేశ్వరం అలుగు నిర్మిస్తాం' అని 2017 ఆగస్టులో జరిగిన నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్‌ హామీ ఇచ్చారు. దీన్ని సీమ సాగునీటి సాధన సమితి నాయకులు చాలాసార్లు గుర్తుచేశారు. ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ జగన్‌ హామీ ఇచ్చారని అంటున్నారు. మూడేళ్లు కావస్తున్నా సిద్ధేశ్వరంపై జగన్‌ ప్రభుత్వానికి చిత్తశుద్ధి కనిపించడం లేదని సీమ ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసమే ఈ ప్రాజెక్టు హామీ ఇచ్చారా..? అని నిలదీస్తున్నారు.

సిద్ధేశ్వరం ఎందుకంటే...

కృష్ణా నదిపై సిద్ధేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని 1951లో ప్లానింగ్‌ కమిషన్‌ తీర్మానించింది. ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంలో భాగంగా రాయలసీమకు కృష్ణా నది జలాల వినియోగంలో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని శ్రీబాగ్‌ ఒప్పందం కూడా ఉంది. ఆరోజుల్లో సిద్ధేశ్వరం ప్రాజెక్టును నిర్మించి ఉంటే రాయలసీమకు కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా దక్కి ఉండేది. అనేక రాజకీయ కారణాల వల్ల, ప్రాంతీయ బలాబలాల ప్రభావం వల్ల ఆరోజు సిద్ధేశ్వరం ప్రాజెక్టు వెనక్కి వెళ్లి కోస్తా ప్రాంతానికి నీరు అందించే లక్ష్యంతో నాగార్జునసాగర్‌ను నిర్మించారనే విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాత శ్రీశైలం జలాశయం 841 అడుగుల సిల్‌ లెవల్‌లో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నిర్మించారు. తెలుగుగంగతో ముడిపడిన ఇతర సీమ ప్రాజెక్టులకు ఇక్కడి నుంచి నీరు అందించే ఏర్పాటు చేశారు. జలాశయంలో 854 అడుగుల నీటి మట్టం ఉండకుండా జీవో 69 ఆటంకంగా తయారైంది. ఈ సమస్యకు పరిష్కారంగా సీమ కరువు తీరాలంటే 45-50 టీఎంసీల నీటిని జలాశయంలో నిలిపేందుకు సిద్ధేశ్వరం అలుగు నిర్మించాలని 2003 జూలై 13న సీమ సాగునీటి నిపుణులు, ఆనాటి ఇరిగేషన్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు ఎం.సుబ్బరాయుడు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. 2011 ఆగస్టు 19న చీఫ్‌ ఇంజనీర్ల కమిటీ సిద్ధేశ్వరం అలుగు కోసం ప్రభుత్వానికి రికమెండ్‌ చేసింది. ప్రభుత్వ చీఫ్‌ సెక్రెటరీ దీనిని తోసిపుచ్చినట్లు సమాచారం. తాజాగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని కల్వకుర్తి, ఏపీలో నంద్యాలను కలుపుతూ దాదపు రూ.800 కోట్లతో జాతీయ రహదారి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా సిద్ధేశ్వరం అలుగు ప్రతిపాదిత ప్రదేశంలో కృష్ణా నదిపై వంతెన నిర్మించనున్నారు. బ్యారేజ్‌ కమ్‌ బిడ్జి నిర్మిస్తే రెండు ప్రయోజనాలు నెరువేరుతాయని... నిర్మాణ ఖర్చు కూడా తగ్గుతుందని సుబ్బరాయుడు పేర్కొంటున్నారు.

సీమ రైతుల స్వప్నం

రాయలసీమకు చట్టబద్ధంగా 19 లక్షల ఎకరాలకు సాగునీరు అందాలి. 8 లక్షల ఎకరాలకు కూడా అందడం లేదు. శ్రీశైలం డ్యాం నుంచి సీమకు హక్కుగా ఉన్న నీరు కూడా అందడం లేదు. సీమ సాగునీటి ప్రయోజనాల కోసం సిద్ధేశ్వరం అలుగు ఎంతో కీలకం. దీనిని నిర్మిస్తే డ్యాం భద్రత, జలాశయంలో చేరే పూడికను నిరోధిస్తుంది. మే 31న సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం ప్రాంతంలోనే జలదీక్ష చేపట్టబోతున్నాం. సీఎం జగన్‌ సిద్ధేశ్వరం అలుగు నిర్మాణంపై చిత్తశుద్ధిని చాటుకోవాలి.

- బొజ్జ దశరథరామిరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి కన్వీనర్‌, నంద్యాల