మళ్ళీ తటస్థుల కాన్సెప్ట్ తో బాబు
ఇదే ఆఖరి పోరాటం, 2024 దాటితే 'నో'
తెరమీదకు తటస్థుల కాన్సెప్ట్!!
**
వచ్చే ఎన్నికల్లో వారికి ప్రాధాన్యం.
పార్టీ సీనియర్లతో చంద్రబాబు సమాలోచన
***
పాతికేళ్ల కిందట గ్రాండ్ సక్సెస్ అయిన కాన్సెప్ట్ను మళ్లీ చందబాబు బయటికి తీశారా ? ఆనాడు తిరుగులేని విజయాన్ని అందించిన తురుపు ముక్కను మళ్లీ ప్రయోగిస్తారా? ఆ అస్త్రం ఇప్పుడు కూడా అంత ప్రభావవంతంగా పని చేస్తుందా? ఏమో చూడాలి. కోతులు పోట్లాట ముదిరిపోయి చివరకు రొట్టిముక్క పిల్లి నోట్లోకి చేరిన కథ తెలిసిందే కదా... అలాగే టిక్కెట్ల కోసం నాయకుల మధ్య పోటీ ముదిరినప్పుడో, ఉన్న వాళ్లలో ఎవరూ సమర్థులు కానప్పుడు కొత్తవారిని ప్రజలకు పరిచయం చేయాలనుకున్నపుడో తెరమీదకు వచ్చేది.. కొత్త అభ్యర్థి... అవును ఈ కొత్త అభ్యర్థి అంటే ఫ్రెష్ అన్నమాట.... ఇంకా రాజకీయ వాసనలు పూర్తిగా అబ్బని వాళ్లు, అవినీతి మకిలి ఇంకా సోకనివాళ్లు... ఇంకా చెప్పాలంటే తెల్లకాగితంలాంటి వాళ్లను రాజకీయాల్లోకి తీసుకువచ్చి సరికొత్త వ్యవస్థను సృష్టించడం.. ఇది 1999లో బ్రహ్మాండమైన విజయాన్ని అందించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 294 సీట్లలో తెలుగుదేశం 269 స్థానాల్లో పోటీ చేసి 180 సీట్లు దక్కించుకోగా మిత్రపక్షంగా ఉన్న బిజేపీ 24 చోట్ల పోటీ చేసి 12 సీట్లు గెలిచింది. వైఎస్సార్ సారథ్యంలోని జాతీయ కాంగ్రెస్ పార్టీ కేవలం 91 స్థానాలకు పరిమితమైన ఈ ఎన్నికలను అప్పట్లో సోషల్ ఇంజినీరింగ్ అని విశ్లేషకులు అభివర్ణించారు.
జాగర్లమూడి లక్ష్మీపద్మావతి(పర్చూరు) శనక్కాయల అరుణ (గుంటూరు-2)విజయరావ కారావు, మాజీ సీబీఐ డైరెక్టర్ ( ఖైరతాబాద్) వంటి చోట్ల గెలిచినవాళ్లంతా న్యూట్రల్స్ .అంటే అంతవరకూ రాజకీయాలతో ప్రత్యక్ష సంబంధాలు లేని వాళ్లే. వీరందరినీ అప్పట్లో చంద్రబాబు కొత్తగా రాజకీయాల్లోకి తీసుకొచ్చి మొదటిసారి గెలవగానే ప్రధానమైన శాఖలకు మంత్రులుగా చేశారు.
అయితే చంద్రబాబు రాజకీయ పాండిత్యానికి, సమాజాన్ని, స మాజపు మూడ్ ను తనవైపు తిప్పుకునే విషయంలో ఈ ఎత్తు అప్పట్లో గొప్ప విజయాన్ని అందించింది. అయితే ఇప్పుడు మళ్లీ అలాగే ఎలాంటి రాజకీయ అనుభవమూ లేకున్నా రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వారిని తీసుకొచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే ఆలోచనల్లో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య పార్టీ నాయకులతో అమరావతిలో నమావేశమైన టీడీపీ అధినేత ఈ ఆలోచనను నాయకుల ముందు బయటి పెట్టినట్లు తెలుస్తోంది. పాత నాయకులు, ఇప్పటికే ఓటమి పాలైన వాళ్లు, ప్రజల్లో ఇమేజీ కోల్పోయిన వాళ్ళు, వర్గ రాజకీయాలకు పాల్పడేవాళ్లు, అవినీతి ఆరోపణలు ఉన్నవాళ్లు.. ఇలా రకరకాలుగా మరకపడిన వారి స్థానంలో కొత్తవారిని, ఫ్రెషర్స్ గా ప్రజల్లోకి తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన పార్టీ పెద్దల్లో వచ్చింది. ఒకవేళ ఈ కొత్త ఆలోచనగానీ అమల్లోకి వస్తే డాక్టర్లు, రియల్టర్లు, విదేశాల్లో పని చేస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఇంకా వేర్వేరు ప్రొఫె షనల్స్ కూడా రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉంది. చూడాలి 1999 ఎన్నికల్లో జరిగే అద్భుతాలు ఈసారి జరుగుతాయా? అదే కాన్సెప్ట్ ఇప్పుడు కూడా వర్కవుట్ అవుతుందా.. చూడాలి...