home page

త్వరలో భూముల ఆటో ముటేషన్

22ఏ తొలగింపునకు లక్ష విన్నపాలు పెండింగ్ 

 | 
Lands

రాష్ట్రంలో భూముల రీసర్వే జరుగుతోందని రెవెన్యూ ప్రత్యేక చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్ చెప్పారు. మంగళవారం నాడు విలేకరులతో మాట్లాడుతూ ఆయన ప్రతీ 30ఏళ్లకు ఒకమారు రీసర్వే చేయాల్సి ఉందన్నారు. బ్రిటీషర్లు చేసిన తర్వాత మళ్లీ దాన్ని చేపట్టలేదన్నారు. గట్టు తగాదాలు వస్తాయనే ఇప్పటివరకు దాన్ని ముట్టుకోలేదన్నారు. రికార్డులన్ని అప్ డేట్ చేయాల్సి ఉందని సాయి ప్రసాద్ తెలిపారు. సర్వే అంటే కేవలం కొలతలు వేసే పని ఒక్కటే కాదన్నారు. సర్వే అండ్ బౌండరీ యాక్ట్ లో వివిధ అంశాలు ఉన్నాయని వివరించారు. ల్యాండ్ రికార్డులు స్వచ్చంగా రూపొందుతాయని తెలిపారు. విలేజ్ మ్యాప్ అయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంటుందన్నారు.

డ్రోన్ ద్వారా చేసే మ్యాప్ కు పాత సర్వే నెంబర్లతో సరిపోల్చి చూసి రికార్డులను తయారు చేయాల్సి ఉందన్నారు. ముందుగా స్కెచ్ రూపొందించి రైతులకు ఇస్తామని, రైతు చెప్పే వివరాలు ప్రకారం ప్రతీ కేసులోనూ తనిఖీ చేసిన తర్వాత ముసాయిదా రూపొందించిన నోటీసులు జారీ చేస్తామన్నారు. అభ్యంతరాలు పరిశీలించి మొబైల్ మేజిస్ట్రేట్ వద్ద కూడా పరిష్కరించాలని భావిస్తున్నట్టు తెలిపారు. కోర్టులో ఉన్న వివాదాలు మినహా మిగతా అంశాలు పరిష్కరించి రీసర్వే పూర్తి చేస్తామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ చెప్పారు.(Land Mutations)

‘ ఏడాదికి 10 లక్షల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. రెవెన్యూ రికార్డులు తరచూ మారిపోతుంటాయి. 2 కోట్ల అడంగల్ లెక్కలు ఉన్నాయి. సర్వే పూర్తి అయ్యాక రోజువారీ మ్యుటేషన్లు జరుగుతాయి. తహసీల్దార్లతో సంబంధం లేకుండా ఆటో మ్యుటేషన్ తెస్తున్నాము. రెండు నెలల్లోనే ఈ ఆటో మ్యుటేషన్ ప్రక్రియ అందుబాటులోకి వస్తుంది. రిజిస్ట్రేషన్ చేస్తే చాలు సహజంగానే ఆటో మ్యుటేషన్ జరిగిపోతుంది. ఇక తనిఖీలు ఏమీ ఉండవు. చాలా అంశాల వల్ల రిజిస్ట్రేషన్ వద్ద తిరస్కరిస్తున్న పరిస్థితి ఉండేది. ఇక పాత పద్దతి మార్చేస్తున్నాం. ఇక నుంచి మ్యుటేషన్లు తిరస్కరించాలంటే ఆ ఫైల్ ని ఆర్డీవోకు పంపాల్సిందే. ఒక సర్వే నంబర్ లో ఒక భాగం విక్రయించాలని అంటే ఇక సబ్ డివిజన్ చేయాల్సిందే.

కర్ణాటకలో ఇప్పటికే దీన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఏపీలోనూ దీన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. చుక్క భూముల విషయంలో 2017 నాటికి పేరు 1బి, లేదా అడంగల్ లో ఉంటే ఇక ఏ పత్రం అవసరం లేకుండా భూ యాజమానిగా నిర్థారిస్తాం. 50వేల పైచిలుకు దరఖాస్తులు పరిష్కరించాం. రాష్ట్రంలో 11వేల మంది సర్వేయర్లు ఉన్నారు. అడంగల్ కోసం రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన బాధాకరం. సర్వే నంబర్ సబ్ డివిజన్ కాకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.(Land Mutations)

రిజిస్ట్రేషన్ విభాగం, రెవెన్యూ డేటా బేస్ ల సమన్వయం ద్వారా వివాదాలు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడుతున్నాం. రెండు నెలల్లో సాఫ్ట్ వేర్ అందుబాటులోకి వస్తుంది. ఆటో మ్యుటేషన్ చేయడంతో పాటు పాస్ పుస్తకం కూడా అప్పటికప్పుడు జారీ చేస్తాం. 22 ఏ భూముల వివాదాలపై కూడా త్వరలోనే పరిష్కారం చూపిస్తాం. లక్ష దరఖాస్తులు వచ్చాయి’ అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ తెలిపారు.