home page

మంత్రి కాకాణిపై అనిల్ కారాలు-మిరియాలు

అనిల్ యాదవ్ బలప్రదర్శన నేడు

 | 
Yadav

మంత్రిగా ప్రమాణం చేసిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఈనెల 17న తొలిసారిగా.. నెల్లూరు జిల్లాకు విచ్చేస్తున్నారు. అయితే, అదేరోజు కార్యకర్తలతో భారీ సమావేశం నిర్వహించేందుకు అనిల్‌ ప్లాన్‌ చేస్తున్నారు. కాకాణికి స్వాగతం పలికే రోజే.. అనిల్‌ కార్యకర్తల సమావేశం పెట్టడం వెనుక వ్యూహం ఏంటనేదానిపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది.

ఈ నేపథ్యంలో నెల్లూరులో రేపు జరగనున్న సభ ఏర్పాట్లను ఇవాళ అనిల్‌ పరిశీలించారు. అక్కడే మాట్లాడుతూ.. ''బల ప్రదర్శన కోసం సమావేశం నిర్వహించడం లేదు. కేవలం సిటీ నియోజకవర్గం కార్యకర్తలు మాత్రమే సభకు హాజరవుతారు. ఇది ఎవరికీ పోటీ సభ కాదు. సభకు అనుమతి కోసం మూడు రోజుల ముందే దరఖాస్తు చేశా. నా సభను కొందరు వివాదంగా మారుస్తున్నారు. నేను జగన్‌కు సైనికుడిగానే ఉంటా. సభను వాయిదా వేసుకోవాలని అధిష్ఠానం సూచించలేదు. ఎవరో కార్యక్రమం పెట్టారని నేను సభ పెట్టలేదు. నేను జగన్ సైనికుడిగానే ఉంటాను'' అని అనిల్‌ వివరించారు.

మూడు రోజుల క్రితం మంత్రి కాకాణికి సహకారం అందిస్తారా? అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఎమ్మెల్యే అనిల్‌ తనదైన శైలిలో స్పందించారు. తన మనసులో మాటను చెప్పకనే చెప్పారు. ''మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి కాకాణి నన్ను ఆహ్వానించలేదు. పిలవకుండా నేను ఎందుకు వెళ్లాలి. నేను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి అన్న చేసిన సహకారం, ఆయన చూపిన ప్రేమ, వాత్సల్యం.. నాకేదైతే సహకారం అందించారో కచ్చితంగా అదే ప్రేమ, అదే వాత్సల్యం, సహకారం రెండింతలు అందిస్తా. ఎవరేమన్నా కాకాణి జిల్లా మంత్రి అని.. నెల్లూరులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి అవసరమని భావిస్తే తప్పకుండా ఆహ్వానిస్తామన్నారు'' అంటూ సెటైరికల్‌గా వ్యాఖ్యానించారు.