లోకేష్ ను కలిసిన ఆనం కుమార్తె కైవల్యా రెడ్డి , అల్లుడు రితీష్ రెడ్డి
కైవల్యా రెడ్డి రాజకీయ ఆరంగేట్రం అదిరింది
ఆత్మకూరు లేదా నెల్లూరు నుంచి పోటీీ?
గత కొంత కాలంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని వస్తున్న ఊహాగానాలను నిజం చేశారు… మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి కుమార్తె… ఆనం కైవల్యా రెడ్డి. తన భర్త, బద్వేలు నియోజకవర్గ టిడిపి నేత కొనిరెడ్డి రితేష్ రెడ్డితో కలిసి శనివారం ఉదయం టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలుకు వచ్చిన లోకేష్ ఓ అతిధి గృహంలో బసచేసి ఉన్నారు. ఇదే క్రమంలో భర్తతో కలిసి కైవల్యా రెడ్డి లోకేష్ ను కలిసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్న తన అభిలాషను తెలియజేశారు. మెట్టినిల్లు అయిన తన భర్త కుటుంబానికి బద్వేలులో పోటీ చేసే అవకాశం లేనందున తన పుట్టినిల్లు అయిన నెల్లూరు జిల్లాలో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఆత్మకూరు లేదా నెల్లూరు సిటీ నుండి పోటీ చేసే అవకాశం ఇవ్వాలన్నారు. భర్త రితేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అయిన అత్త విజయమ్మ ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో కొనసాగుతుండగా, త్వరలోనే కైవల్యా రెడ్డి కూడా అధికారికంగా టిడిపి తీర్ధం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.
ఆనం కుటుంబానికి సంబంధం లేదా ?
నెల్లూరుజిల్లాలో సుదీర్ఘ రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం కైవల్యారెడ్డి… మాజీ మంత్రి, ప్రస్తుత వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి కుమార్తె. తండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా, కుమార్తె టిడిపి ప్రధాన కార్యదర్శి లోకేష్ ను కలవడం చర్చనీయాంశంగా మారింది. తండ్రి ప్రోద్భలంతోనే లోకేష్ ను కలిశారా అని చాలా మంది చర్చించుకుంటున్నారు. అయితే ఈ భేటీలో తండ్రికి సంబంధం లేదని తెలుస్తోంది. కడప జిల్లా బద్వేలులో తెలుగుదేశం పార్టీకి ఎన్నో ఏళ్ల నుండి మద్దతుదారులుగా ఉన్న భర్త రితేష్ రెడ్డితో కలిసి ఆమె లోకేష్ ను కలిశారు. రితేష్ రెడ్డి తాత బిజివేముల వీరారెడ్డి బద్వేల్ నియోజకవర్గంలో సీనియర్ టిడిపి నేత. 6 సార్లు బద్వేలు ఎమ్మెల్యేగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన మరణానంతరం 2001లో జరిగిన ఉప ఎన్నికల్లో టిడిపి వీరారెడ్డి కుమార్తె విజయమ్మకు అవకాశం ఇవ్వడంతో ఆమె పోటీ చేసి విజయం సాధించారు. విజయమ్మ కుమారుడే రితేష్ రెడ్డి. ఆయన కూడా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో బద్వేలు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు కావడంతో అప్పటి నుండి వీరి కుటుంబానికి అక్కడ పోటీ చేసే అవకాశం లేకుండా పోయింది. భర్త కుటుంబం తరపున కైవల్యా రెడ్డి లోకేష్ ను కలవడం పెద్ద విషయమేమీ కాదు. అయితే ఆమె వైసీపి ఎమ్మెల్యే ఆనం రామ నారాయణరెడ్డి కుమార్తె కావడంతో చర్చనీయాంశంగా మారింది.
బద్వేలు నియోజకవర్గం వీరారెడ్డి కుటుంబానికి కంచుకోట. వీరారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఒకేసారి ఎన్టీఆర్ మంత్రి వర్గం లో కలిసి పనిచేశారు. చంద్రబాబు మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేస్తున్న సమయంలోనే వీరారెడ్డి మృతి చెందారు. అప్పుడు జరిగిన ఉపఎన్నికల్లో వీరారెడ్డి కుమార్తె విజయమ్మ విజయం సాధించింది. అయితే 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు విజయమ్మకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారు కానీ ఇవ్వలేదు. దాంతో ఆకుటుంబంలో అసంతృప్తి ఉంది.