home page

అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి

మంత్రి అంబటి రాంబాబు హామీ

 | 
Ambati

 నెల్లూరు జిల్లాలో పెండింగ్ లో వున్న ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేసి జిల్లా ప్రజలకు అవసరమైన సాగునీరు, త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తామని  రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో కలసి జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితి, పెండింగ్ లో వున్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పనుల పురోగతిపై అధికారులతో సమావేశమై క్షుణ్ణంగా సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన తరువాత రాష్ట్రంలో నెల్లూరు జిల్లా పెద్ద జిల్లాగా అవతరించిందని, వ్యవసాయ పరంగా చాలా ప్రాముఖ్యత సంతరించుకున్న జిల్లా అని అన్నారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా తొలిసారిగా జిల్లాకు రావడమైందని, దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కాబడిన నెల్లూరు, సంగం బ్యారేజి నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించుకొని, జిల్లా ప్రజలకు అంకితం చేసే మహత్తర కార్యక్రమాన్ని త్వరలో చేపట్టనున్నట్లు మంత్రి రాంబాబు తెలిపారు. సోమశిల ప్రాజెక్ట్ పూర్తి అయినప్పటికినీ, ప్రాజెక్టు పూర్తి ఫలితాలు జిల్లా రైతాంగానికి అందాల్సివుందన్నారు. జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాలు, రాళ్ళపాడు ప్రాజెక్ట్ పరిధిలో ఇరిగేషన్ పనులు పెద్ద ఎత్తున జరుగుచున్నవని, ఈ పనులను త్వరగా పూర్తి చేసేందుకు అన్నీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి రాంబాబు తెలిపారు. జిల్లాలోని అన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టుల పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకొని, జిల్లా సాగు, త్రాగు నీటి అవసరాల నిమిత్తం చేపట్టిన ఇరిగేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తానని మంత్రి రాంబాబు స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రొసెసింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, పెన్నా డెల్టా ఆధునీకరణలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేసిన నెల్లూరు పెన్నా బ్యారేజ్, మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ నిర్మాణ పనులను మరింత వేగంగా పూర్తి చేసి త్వరలోనే రెండు ప్రాజెక్టులను ప్రారంభిస్తామన్నారు. జిల్లాకు సంబందించి సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలో చేపట్టిన అన్నీ ఇరిగేషన్ పనులపై ప్రత్యేక దృష్టి సారించి త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకునేలా జిల్లా ఇంఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకురావడమైనదన్నారు. సోమశిల ఆప్రాన్ మరమ్మత్తు పనులకు ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో 117 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, త్వరలో పనులు మొదలు పెట్టనున్నట్లు మంత్రి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రధానమైన జలవనరులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సోమశిల,కండలేరు, ఇతర సాగునీటి ప్రాజెక్టులు విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన మంత్రి ని కోరారు.

జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ సుధీర్గమైన తీర ప్రాంతం కలిగిన జిల్లాలో వరి సాగుకు ప్రత్యేక స్థానం, గుర్తింపు వుందన్నారు. 150 టి.ఎం.సి.ల గరిష్ట సామర్ధ్యం కలిగి సోమశిల, కండలేరు జలాశయాలు జిల్లాలో వున్నాయన్నారు. ఇటీవల జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశంలో జిల్లాలో 2వ పంటకు సాగునీటిని కేటాయించేందుకు నిర్ణయించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అబివృద్ధి కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేసి రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ముఖ్యమంత్రి… వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు.

జిల్లాలో చేపట్టిన ఇరిగేషన్ కెనాల్స్ విస్తరణ, పూడిక తీత పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అలాగే ఆయా నియోజక వర్గాల్లో చేపట్టాల్సిన ఇరిగేషన్ పనుల మంజూరు తదితర అంశాలను వెంకటగిరి, కందుకూరు, కావలి నియోజక వర్గాల శాసన సభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి, మానుగుంట మహిధర్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు దృష్టికి తీసుకు రాగా, మంత్రి స్పందిస్తూ, జిల్లాలో పెండింగ్లో వున్న ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ పనులను త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.

తొలుత జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాల పరిధిలో చేపట్టిన ఇరిగేషన్ పనుల పురోగతి పై తెలుగు గంగ ప్రాజెక్టు సి.ఈ హరి నారాయణ రెడ్డి, ఇరిగేషన్ ఎస్.ఈ కృష్ణమోహన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అంతకు ముందు జిల్లాలో వున్న సాగునీటి ప్రాజెక్ట్స్ వివరాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను మంత్రి అంబటి రాంబాబు తిలకించారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర రెడ్డి, తిరుపతి పార్లమెంట్ సభ్యులు డా. గురుమూర్తి, శాసన మండలి సభ్యులు బల్లి కళ్యాణ్ చక్రవర్తి, వాకాటి నారాయణ రెడ్డి, నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి, జిల్లా జాయింట్ కలెక్టర్ హరెందిర ప్రసాద్, నెల్లూరు నగర పాలక కమీషనర్ జాహ్నవి, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, సోమశిల స్పెషల్ కలెక్టర్ బాపిరెడ్డి, నెల్లూరు, కావలి ఆర్.డి.ఓ లు కొండయ్య, శీనా నాయక్, వ్యవసాయ శాఖ జె.డి సుధాకర్ రాజు, డి.పి.ఓ ధనలక్షి, డ్వామా పి.డి. తిరుపతయ్య, డి ఆర్.డి.ఎ పి.డి. సాంబశివారెడ్డి, జడ్.పి. సి.ఈ. ఓ వాణి, జిల్లా విద్య శాఖాధికారి రమేష్, పంచాయతీ రాజ్ ఎస్.ఈ సుబ్రమణ్యం, సివిల్ సప్లై డి.ఎం. పద్మ, డి.టి.సి. చందర్, సాంఘిక సంక్షేమ శాఖ డి.డి రమాదేవి, హౌసింగ్ పి.డి నరసింహ, డి.ఎస్.డబ్ల్యూ.ఓ వెంకటయ్య, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎ.డి. హనుమాన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.