home page

నిన్నటి వరకు అతి విశ్వాసం... నేడు అంతే భయం.. భయం

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పరువు దక్కిస్తుందా అన్న సందేహం 

 | 
Bye bye jagan
నిన్నటి వరకూ అతి విశ్వాసం…. ఇప్పుడు భయం భయం
వై నాట్ 175 అంటూ నిన్నమొన్నటి వరకూ ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించిన అధికార వైసీపీలో ఒక్క సారిగా భవిష్యత్తుపై భయం నెలకొన్నది. మూడు ప‌ట్ట‌భద్రుల సీట్ల‌ను టిడిపి గెల‌వ‌డంతో రాష్ట్ర రాజ‌కీయం ఒక్క‌సారిగా మారిపోయింది. ఈ గెలుపును వైసీపీ ఏ మాత్రం అంచనా వేయలేదు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని బలంగా నమ్మిన వైసీపీ ఈ స్థానాలన్నీ తామే గెలుస్తామని లెక్కవేసుకున్నది. తెలుగుదేశం బలహీనపడిందని తప్పుడు అంచనా వేసుకోవడంతో బాటు ఓటర్లను నమోదు చేయడం నుంచి పోలింగ్ ఏర్పాట్ల వరకూ పకడ్బందిగా ఏర్పాట్లు చేసుకున్నందున గెలుపు తమను దాటి పోదని అతి విశ్వాసంతో అధికార పార్టీ ఉండిపోయింది. అందరూ తమకే ఓటు వేస్తారని, తెలుగుదేశం గురించి ఆలోచించరని కూడా తప్పుడు లెక్కలు వేసుకున్నది. ఇది ఆ పార్టీలో 151 స్థానాలు గెలుచుకున్న నాటి నుంచి ఉన్న వాతావరణం. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నదని ఎవరు చెప్పినా కూడా వారిని చంద్రబాబు ఏజెంటు అని, మీడియా అయితే అది ఎల్లో మీడియా అని ముద్ర వేశారు తప్ప దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే పోలీసు కేసులతో వేధించారు తప్ప ఆ తప్పులు సరి చేసుకోలేదు. నిన్నటికి నిన్న విశాఖలో అమరావతిని రాజధానిగానే ఉంచడం అంటూ ఎవరో వాల్ పోస్టర్లు వేస్తే దాన్ని ప్రజాభిప్రాయంగా తీసుకోకుండా అది ఎవరు చేశారో తెలుసుకుని ఆ గొంతును నొక్కేసేందుకే పాలకులు ప్రయత్నించారు. ఇలా ఒక్కటి కాదు. విమర్శను ఏ మాత్రం సహించలేని అలవాటును వైసీపీ నేతలు కొనసాగించారు. సోషల్ మీడియాలో ప్రత్యర్థులను ఎద్దేవ చేస్తూ అదే నిజమని ప్రజలు నమ్ముతున్నారనే భ్రమలోనే వైసీపీ కొనసాగింది. ప‌ట్టభద్రుల ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి చెంద‌డంతో ఆ పార్టీ ఇప్పుడు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డింది. ఓటమిని హుందాగా ఒప్పుకోకుండా డిక్లరేషన్ ఫామ్ ఇచ్చేందుకు కూడా నిరాకరించేలా అధికారులపై వత్తిడి తీసుకురావడంతో వైసీపీ పై మరింత వ్యతిరేకత పెరిగింది. ప్రతిపక్ష పార్టీ గెలిస్తే దాన్ని చిన్నదిగా చూపించడంతో బాటు తమ కింద పని చేసే అధికారులనే తప్పు పట్టడం, నిందించడం చూస్తుంటే వైసీసీ ఏ మానసిక స్థితిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఓట్లను అధికారులే తారుమారు చేసారు అనే ఆరోపణలు కూడా అధికార పార్టీ చేస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారు. ‘‘మా ఓటర్లు వీళ్లు కాదు… వేరే వారు ఉన్నారు’’ అంటూ వైసీపీ పెద్దలు వ్యాఖ్యానించడం కూడా హాస్యాస్పదంగా ఉంది. అధికార వైకాపా పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో ఎంత అసంతృప్తి ఉందో పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఈ ఎమ్మెల్సీ ఎన్నిక చాటింది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు మ‌రో ఏడాది స‌మ‌యం ఉన్న ప‌రిస్థితుల్లో జ‌రిగిన ఈ ఎన్నిక‌లు వైకాపాకు ఝ‌ల‌క్ ఇస్తే, ప్ర‌తిప‌క్ష టిడిపిలో జోష్ నింపింది. అసెంబ్లీ ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా అధికారం త‌మ‌దేన‌న్న భావ‌న నిన్నటి వరకూ వైసీపీలో ఉండగా ఇప్పుడు ఆ పార్టీలో అనుమానం వ్య‌క్తం అవుతోంది. ఎన్నో ఎదురుదెబ్బలతో తెలుగుదేశం పార్టీ నాయకులు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేని స్థితి నుంచి ఆ పార్టీ ఇప్పుడు బయటపడింది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తల బలం ఎప్పుడూ ఏ మాత్రం తగ్గలేదు కానీ ద్వితీయ శ్రేణి నాయకులు అక్రమ కేసులకు భయపడి బయటకు రావడం మానేశారు. ఇప్పుడు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులలో ఆ భయం పోయింది. క్రమం తప్పకుండా పోరాటం సాగిస్తున్నారు. ఇది టీడీపీలో మరింత ఉత్సాహం నింపుతున్నది. టీడీపి వైపు తటస్థులు కూడా వెళ్లిపోతున్నారు. వైసీపీ అరాచకపాలనపై తటస్థుల్లో తీవ్ర అసంతృప్తి పెల్లుబుకుతున్నది. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలతో టీడీపీలో సమరోత్సాహం తొంగిచూస్తుండగా వైసీపీలో భయం బయటకు వచ్చింది. ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక కూడా వైసీపీకి కంటిపై కునుకులేకుండా చేస్తున్నది. టిడిపి గ‌త ఎన్నిక‌ల్లో 23 అసెంబ్లీ సీట్ల‌ను గెలిచింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు 23 స్థానాలు ఉన్న పార్టీకి ఒక స్థానం దక్కుతుంది. అయితే గెలిచిన 23 మందిలో నలుగురిని వైసీపీ అక్కున చేర్చుకున్నది. అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తమ ఎమ్మెల్యేలను చేర్చుకున్నదని, ఇది అన్యాయమని ఆక్రోశించిన వైసీపీ తాను అధికారంలోకి రాగానే అదే పని చేసింది. ఇప్పుడు 19 స్థానాలు మాత్రమే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్ధిని నిలబెట్టింది. అనధికారికంగా పార్టీ ఫియించిన నలుగురులో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మళ్లీ తెలుగుదేశం లోకి వచ్చేందుకు రాయబారాలు నడుపుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ లో ఇద్దరు తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్కన చూస్తే టీడీపీ సునాయాసంగా తమ ఎమ్మెల్సీ అభ్యర్ధిని గెలిపించుకోగలుగుతుంది. అన్ని సీట్లూ తనకు కావాలని పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి జగన్, టీడీపీ వ్యూహాన్ని, వాస్తవ పరిస్థితిని గమనించకుండా ఏడుగురు అభ్యర్ధులను నిలబెట్టారు. ఈ ఎన్నిక‌ల్లో త‌మ ఏడ‌వ అభ్య‌ర్థిని జ‌గ‌న్ గెలిపించుకోలేక‌పోతే ఆయ‌న‌కు దెబ్బ‌మీద దెబ్బ ప‌డిన‌ట్లే. జగన్ వైఖరిపై తిరుగుబాటు చేసిన ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డిలు టిడిపికి మ‌ద్ద‌తు ఇచ్చే ప‌రిస్థితి ఉంది. వీరిద్దరితో బాటు మరో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరేందుకు ఇప్పటికే మంతనాలు జరిపారని అంటున్నారు. ఈ మొత్తం మంది… అంటే టీడీపీ నుంచి వైసీపీకి వెళ్లిన నలుగురిలో ఇద్దరు, తిరుగుబాటు చేసిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు, టీడీపీలో చేరేందుకు సిద్ధపడ్డ నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు… మొత్తం 8 మందిలో నలుగురు ఓటేస్తే చాలు టీడీపీ అభ్యర్ధి గెలుస్తారు. ఇప్పుడు జగన్ కు నిద్రపట్టకుండా చేస్తున్నది ఇదే. వైసీపీ ఏడో అభ్యర్ధి ఓడిపోతే….. అది వైసీపీకి మరో పెద్ద దెబ్బ అవుతుంది…

Jagan