పధకాలకు పేర్లు తప్ప సాధించిందేమిటి?
ఎంపీ రఘు విమర్శ
Updated: Mar 30, 2023, 18:01 IST
| పేర్ల మార్పు తప్ప రాష్ట్రంలో సాధించిందేమిటి?
ఎమ్మెల్యేలను జగన్మోహన్ రెడ్డి అవమానిస్తే... ఢిల్లీ పెద్దలు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఆయన్ని అవమానించారు
ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ అట్టర్ ఫ్లాప్... తెలుగు ప్రజలకు అవమానం
వైఎస్ వివేకా హత్య కేసులో 30 రోజుల్లో సునీతకు న్యాయం జరిగే ఛాన్స్
సొమ్ము విద్యుత్ ఉద్యోగుల ది... సోకు జగన్మోహన్ రెడ్డి ది
ప్రజల సొమ్ముతో సర్కులేషన్ పెంచుకుంటామంటే ప్రశ్నించే వ్యక్తులు ఉంటారు
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
ఒక వ్యవస్థ బాగుపడాలన్నా సర్వనాశనం కావాలన్నా... పాలకుల పైనే ఆధారపడి ఉంటుంది. పాలకులు మంచివారైతే ఉత్తరప్రదేశ్ తరహాలో వ్యవస్థ బాగుపడుతుంది. అదే పాలకులు సరైన వారు కాకపోతే ఆంధ్ర ప్రదేశ్ మాదిరిగా రాష్ట్రం దరిద్రంగా మారుతుందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు అన్నారు. మహారాష్ట్ర కంటే ఉత్తర ప్రదేశ్ అధిక ఆదాయాన్ని సమకూర్చుకోవడం , అప్పులు కేవలం లక్ష కోట్ల లోపే ఉండడం, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పాలనా దక్షత కు నిదర్శనం అయితే , రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించడంలో జగన్మోహన్ రెడ్డి పాలనా దక్షత కనిపిస్తోందని ఆయన అపహాస్యం చేశారు. రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో సాధించింది ఏముంది?, ఉద్యోగులకు జీతాలు లేవు. ఏ ఒక్కరూ సుఖశాంతులతో లేరు. బిల్డింగులకు రంగులు వేయడం, పార్కులు, బస్టాండ్లు, ప్రభుత్వ ఆసుపత్రులకు పేర్లు మార్చడం తప్ప సాధించింది ఏముందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పటివరకు సరైన లెక్కలు లేవు. వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఎదురు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో రావణ రాజ్యం
శ్రీరామనవమి సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన ట్విట్ చూస్తే నవ్వు వచ్చింది. సుపరిపాలన అంటే రామరాజ్యం అని తానేదో శ్రీరాముని అడుగుజాడల్లో నడుస్తున్నట్లుగా ట్విట్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. రాష్ట్రంలో రావణ రాజ్యం నడుస్తోంది. రావణాసురుడు పుష్పక విమానం వేసుకొని తిరిగినట్టుగా, ప్రజా సంపదను కోటానుకోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ, ముఖ్యమంత్రి
ఢిల్లీకి ప్రత్యేక విమానాలలో తిరుగుతున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అపాయింట్మెంట్ కోసం రాత్రి 11 గంటల వరకు వేచి చూసిన జగన్మోహన్ రెడ్డి, ఇక చేసేదేమీ లేక తిరుగు ప్రయాణానికి విమాన ఎక్కే సమయంలో, హోం మంత్రి అమిత్ షా నుంచి పిలుపు వచ్చింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రులు ఎవరైనా ప్రధానమంత్రిని, లేదంటే సంబంధిత శాఖల మంత్రులను కలుస్తారు. అంతేకానీ అర్ధరాత్రి కావొస్తున్న సమయంలో కేసుల మాఫీ కోసం అయితేనే హోం శాఖామంత్రిని కలుస్తారు. హోం శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి ముఖచిత్రం, దోషిలా మారిపోయిందని చూసినవారు చెబుతున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం పెండింగ్ బిల్లుల కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీకి వచ్చినట్లు చెబుతున్నప్పటికీ, ఇప్పటికే ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది. పార్లమెంట్లో టిడిపి సభ్యుడు కనక మేడల రవీంద్ర కుమార్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయిరెడ్డి తో పాటు పలువురు అడిగిన ప్రశ్నలకు ప్రత్యేక హోదా అన్నది ముగిసిపోయిన అధ్యాయం. ఇప్పటికే ప్యాకేజీ ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. ప్రత్యేక హోదా, పెండింగ్ లో ఉన్న విభజన సమస్యల కోసమే ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ అనే రోత, చెత్త డైలాగ్ లు చెప్పడం ఇకనైనా మానివేయండి, ప్రజలు అసహ్యించుకుంటున్నారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.. కేసుల మాఫీ కోసం వచ్చే వ్యక్తులకు ఇచ్చే ప్రాధాన్యత, వారికిచ్చే అపాయింట్మెంట్ సమయాన్ని బట్టి స్పష్టం అవుతుంది.. ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఊసే లేదు. ఆర్థిక మంత్రి కూడా అపాయింట్మెంట్ ఇచ్చేందుకు సుముఖంగా లేరు . తలకు మించిన అప్పులను చేసి, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా, బటన్ నొక్కాను అంటే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాత్రం అప్పులు ఎలా ఇస్తారు?. లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి, బటన్ నొక్కిన డబ్బులు పోను మిగిలిన సొమ్ము ఏమైంది అంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద సమాధానమే లేదు. ఈ విషయం నిర్మలా సీతారామన్ కు తెలియదని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు భావించడం విడ్డూరంగా ఉంది. నిర్మలా సీతారామన్ కూడా తెలుగింటి ఆడపడుచు. ఆమెకు అన్ని విషయాలు తెలుసు. సహచర శాసన సభ్యులకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, ముఖ్యమంత్రి ఏ విధంగా అవమానిస్తున్నారో, అంతకు రెండింతలు కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఆయనకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా అవమానించారు. శ్రీరామనవమి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఏడాది ఒంటిమిట్టలో జరిగే సీతారాముల కల్యాణానికి హాజరై ,రాష్ట్ర ప్రభుత్వపక్షాన
పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణోత్సవ వేడుకలలో పాల్గొనేవారు. శ్రీరామ నవమి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం , ఒంటిమిట్ట లో జరిగే సీతారాముల కళ్యాణం వేడుకలో పాల్గొనకుండా, ఢిల్లీలో నిర్మలా సీతారామన్ చుట్టు అప్పుల కోసం ప్రదక్షణలు చేయడం రాష్ట్ర ప్రజల కర్మ. తన కేసుల స్టేటస్ గురించి తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి, ఢిల్లీ రావాలనుకుంటే ప్రజలపై భారం మోపే ప్రత్యేక విమానంలో కాకుండా, తన సొంత ఖర్చులతో వచ్చి వెళ్లాలి. రాష్ట్రాన్ని రామరాజ్యం చేయకపోయినా పర్వాలేదు కానీ, రావణ రాజ్యం గా మాత్రం మార్చవద్దు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన రాష్ట్ర ప్రజలకు అవమానకరమని రఘురామ కృష్ణంరాజు అన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు వల్ల మంచే జరిగింది
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటూ జైల్లో ఉన్న శివశంకర్ రెడ్డి సతీమణి తులసమ్మ వేసిన పిటిషన్ పై వాదనలు పూర్తయిన తర్వాత ధర్మాసనం ఇచ్చిన తీర్పు వల్ల మంచే జరుగుతుందని రఘురామకృష్ణం రాజు ఆశాభావం వ్యక్తం చేశారు. కేసు విచారణ అధికారుల బృందం నుంచి ప్రస్తుత విచారణ అధికారి రాంసింగ్ తొలగించి, నూతన బృందం జాబితాను సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీనితో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆనందించినట్లుగా ఉన్నారు. అంతకుముందు తెలంగాణ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. న్యాయవ్యవస్థ ఎందుకిలా ప్రవర్తిస్తుందన్నా భయాందోళనలు అందరిలోనూ వ్యక్తం అయ్యాయి. అయితే ధర్మాసనం ఇచ్చిన తీర్పు వల్ల మంచే జరిగింది. 30 రోజుల్లోనే ఈ కేసు విచారణను పూర్తిచేయాలని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ కేసులో రాజకీయ నేతల మంత్రాంగం, యంత్రాంగం ఉందని పేర్కొన్న సిబిఐ , ఇప్పటివరకు సాధించింది ఏమిటని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసు విచారణలో భాగంగా తండ్రి, కొడుకులిద్దరిని అరెస్టు చేయబోతున్నట్లు సిబిఐ కోర్టుకు తెలియజేసింది. ఈ కేసులో వాదనలను వినిపించడానికి ఒకరి వెంట మరొకరు అగ్రగామి న్యాయవాదులు హాజరు కావడంపై న్యాయమూర్తి ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేసు విచారణలో ఆలస్యం చేసేదంతా వీరే అయినప్పటికీ, కేసు విచారణ ఆలస్యం అవుతోందని న్యాయస్థానాన్ని ఆశ్రయించడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు. ఇంత చేసినప్పటికీ తులసమ్మకు నిరాశే ఎదురయింది. ఆమె భర్తకు బెయిల్ లభించలేదు. ఆరు నెలల తర్వాత కేసు ట్రయల్ ప్రారంభం కాకపోతే, అప్పుడు కోర్టును ఆశ్రయించాలని మాత్రమే న్యాయమూర్తి సూచించారు. అప్పుడు కూడా కేసు మెరిట్స్ బట్టి బెయిల్ పిటిషన్ విచారించడం జరుగుతుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే ముష్కరుడు, మరొక ముష్కరుడితో కలిసి తనని అపహరించి చిత్రహింసలకు గురి చేసిన తేదీ, మరుసటి రోజు న్యాయమూర్తి పదవీ విరమణ చేయనున్నారు. ఈలోగానే కేసు విచారణ పూర్తి కావాలని ఆయన కోరుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది . ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా తెలంగాణ హైకోర్టుకు, సుప్రీంకోర్టులకు సిబిఐ అధికారులు
కేసు నివేదికలను అందజేయడం జరిగింది. కేసు విచారణ అధికారిగారిగా ఎవరు ఉన్నా, సిబిఐ ఇప్పటికే చెప్పినట్లుగా ఆ ఇద్దరి అరెస్టులు తప్పవు. సుప్రీం కోర్ట్ ఆదేశించినట్లుగా 30 రోజులలోపు చార్జిషీట్ దాఖలు చేసి మరికొంత సమయం కావాలని అడిగితే, ఇస్తారా ఇవ్వరా అన్నది చూడాలి. ఒక దశలో అందరిలాగే తాను కూడా సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పుపై అపోహ పడ్డాను. కోర్టులోనే తండ్రి కొడుకులు ఇద్దరినీ అరెస్ట్ చేస్తానని చెప్పిన సిబిఐ ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదన్న సందేహం సాధారణ ప్రజలకు వచ్చినట్లుగానే, సుప్రీంకోర్టు ధర్మాసనం కు కూడా వచ్చి ఉండి ఉంటుంది. అందుకే ఈ కేసు విచారణ అధికారిని మార్చాలని ఆదేశించి ఉంటే ఉండవచ్చు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ, సిబిఐ అధికారి రాంసింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాతే వేగవంతం అయ్యింది. రామ్ సింగ్ విధులను అడ్డుకునేందుకు ఆయనపై క్రిమినల్ కేసు దాఖలు చేసి, ఆ కేసు విచారణను హైకోర్టులో రాకుండా చేయాల్సిన ప్రయత్నాలన్నీ కొంతమంది పెద్దలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో ఇరువురి పేర్లను ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. వైఎస్ వివేక హత్యకు ముందు తర్వాత నిందితులు వారి ఇంటికే వెళ్లినట్లుగా గూగుల్ టేక్ అవుట్ ఆధారాలతో నివేదికను హైకోర్టు, సుప్రీంకోర్టుకు సిబిఐ సమర్పించింది. వైఎస్ వివేక హత్యకు గురి పెట్టింది వారిద్దరేనని తేల్చిన సీబీఐ, వారి వెనుక ఎవరైనా ఉన్నారా అన్నది ఇప్పుడు తేలాల్సి ఉంది. 30 రోజుల వ్యవధిలో కేసును తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన తర్వాత, మళ్ళీ హైకోర్టుకు వెళ్లి వెర్రి మర్రి వేషాలు వేస్తామంటే, సుప్రీంకోర్టు తీర్పు ప్రతిబంధకంగా మారనుంది. వైఎస్ వివేకా హత్య కేసు విచారణను చౌరాసియా అనే అధికారి పర్యవేక్షణలోనే రామ్ సింగ్ చేపట్టారు. అటువంటప్పుడు చౌరాసియా కు తెలియకుండా రామ్ సింగ్ ఏమి చేసే అవకాశం లేదు. ఈ కేసు విచారణకు చౌరాసియా నే నేతృత్వం వహించారని తెలియక కొంతమంది ఇప్పుడు చంకలు గుద్దుకున్నారని, తెలిశాక నెత్తి నోరు కొట్టుకుంటారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఈ కేసులో వచ్చే నెల ఆరవ తేదీ తర్వాత ఏమైనా జరగవచ్చు. న్యాయ వ్యవస్థను అవమానిస్తూ, కేంద్రాన్ని తూలనాడుతూ తమ పార్టీ వారు ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. పెద్ద లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో, చిన్న చిన్న అవరోధాలు తప్పక పోవచ్చు. అయినా ఈ కేసు విచారణ ఇప్పటికే 98% పూర్తి అయిపోయింది. 15 రోజుల వ్యవధిలోని విచారణ ముగిస్తామని ఇప్పటికే సిబిఐ కోర్టుకు తెలియజేసింది. అయినా న్యాయమూర్తి ఉదార స్వభావంతో 30 రోజులపాటు అవకాశాన్ని ఇచ్చారు. దీనితో రాష్ట్రంలో రాముడినని చెప్పుకునే వ్యక్తికి శృంగభంగం తప్పకపోవచ్చని అన్నారు. వైఎస్ వివేక హత్య కేసులో న్యాయం జరగాలని అవిశ్రాంత పోరాటం చేస్తున్న డాక్టర్ సునీత కు మరో 30 రోజులలో ఫలితం దక్కనుందని ఆయన అన్నారు.
జగనన్న ఆసరాకు అప్పు తెచ్చింది ఎక్కడో తెలిసింది
జగనన్న ఆసరా పథకానికి విద్యుత్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ బాండ్లను కుదవ పెట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3500 కోట్ల రూపాయల అప్పులు తెచ్చారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ఏపీ స్టేట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ బాండ్లకు సెబి సెక్యూరిటీ విజిలెన్స్ ఉంటుంది. అందుకే అప్పు పుట్టగతి అయ్యింది.. ఈ అప్పు తీర్చాలంటే రాష్ట్ర ప్రభుత్వం మరొకచోట అప్పు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి చెప్పేదేమో రామరాజ్యం గురించే అయితే, చేసేదేమో రావణ రాజ్యంలో జరిగే పనులు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నిధులను ఇప్పటికే పలుమార్లు దారి మళ్లించారు. పేరుకేమో జగనన్న ఆసరా అయితే, నిధులు మాత్రం ఉద్యోగులవి. కనీసం విద్యుత్ ఉద్యోగుల ఆసరా అని చెప్పి ఉంటే వారికైనా క్రెడిబిలిటీ దక్కి ఉండేది. సొమ్మేమో విద్యుత్ ఉద్యోగులదైతే, సోకు జగన్మోహన్ రెడ్డి ది అని రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. ఇలా చేయడానికి అసహ్యంగా లేదా?, అయినా రాష్ట్ర ప్రభుత్వం కంచే చేను మేసిన చందంగా వ్యవహరించడం దారుణమని అన్నారు.
న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెడ్ ఆఫీసులపై దాడి చేసే హక్కు పోలీసోడికి లేదు
న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెంట్ ఆఫీసులపై పోలీసోడికి దాడి చేసి, పత్రాలను స్వాధీనం చేసుకునే హక్కు లేదని రఘు రామ కృష్ణంరాజు తెలిపారు. ఉషోదయ పబ్లికేషన్స్, మార్గదర్శి కంపెనీలకు చార్టెడ్ అకౌంటెంట్ గా వ్యవహరిస్తున్న బ్రహ్మయ్య అండ్ కంపెనీ పై ఏపీ సిఐడి పోలీసులు దాడులు చేయడం దారుణం. దళితులపై దాడులు, ఇసుకలో కొట్టేస్తున్న కమిషన్లు, ఆర్థిక వ్యవస్థ అధోగతిని ఈనాడు ప్రశ్నించినందుకే రాష్ట్ర ప్రభుత్వం, ఉద్దేశపూర్వకంగా మార్గదర్శి పై కేసులు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే హైదరాబాద్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో జారీ చేసి ఉద్యోగులకు 200 రూపాయలు కేటాయించి సాక్షి దినపత్రికను కొనుగోలు చేయిస్తోంది. ఈ విషయాన్ని అధికారికంగా చెప్పకపోయినప్పటికీ, అనధికారికంగా సాక్షి దినపత్రికను మాత్రమే కొనుగోలు చేయాలని ఉద్యోగులకు ప్రభుత్వ పెద్దలు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సొమ్ముతో ఏర్పాటు చేసిన సాక్షి దినపత్రిక, సర్కులేషన్ పెంచుకోవడానికి ప్రజాధనాన్ని వినియోగిస్తోంది. ఈ జీవో జారీ చేసిన తర్వాత సాక్షి దినపత్రిక సర్కులేషన్ మూడు నుంచి నాలుగు లక్షలకు పెరిగింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలను చదవవద్దని చెబుతూనే, సాక్షి దినపత్రికను మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పడం విడ్డూరం. రాష్ట్ర ప్రభుత్వ జీవోను సవాలు చేస్తూ, ఉషోదయ పబ్లికేషన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ జీవో పై రాష్ట్ర హైకోర్టు స్టే ఇవ్వకపోవడం తో చేసేది లేక, సుప్రీంకోర్టు తలుపులు తట్టింది. అలాగే ప్రజా కంఠకమైన జీవో నెంబర్ 1 పై కూడా రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించలేదని, ప్రజా హితాన్ని కోరి కేసు దాఖలు చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సుప్రీంకోర్టును ఆశ్రయించాలని రఘురామకృష్ణం రాజు సూచించారు.