home page

రష్యాలో రెండు నగరాలు స్వాధీనం

 | 

ష్యాలో అంతర్గత తిరుగుబాటు తలెత్తింది. దేశంలో సైన్యానికి అండగా ఉంటున్న ప్రైవేట్ పారా మిలిటరీ గ్రూప్ వాగ్నర్.. ఇప్పుడు ప్రభుత్వంపై సాయుధ తిరుగుబాటుకు పిలుపునివ్వడమే కాకుండా రెండు రష్యా నగరాలను సైతం కైవసం చేసుకున్నట్లు ప్రకటించింది.

అంతే కాదు అక్కడి నుంచి రాజధాని మాస్కో వైపు కదులుతోంది. దీంతో అసలే ఉక్రెయిన్ పోరుతో సతమతం అవుతున్న రష్యాకు చుక్కలు కనిపిస్తున్నాయి.

వాగ్నర్ ప్రైవేట్ మిలిటరీ గ్రూప్ రెండు రష్యన్ నగరాలు రోస్టోవ్-ఆన్-డాన్, వొరోనెజ్‌లోని కీలకమైన సైనిక సౌకర్యాలను తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు సంచలన ప్రకటన చేసింది. రష్యా పారామిలటరీ యూనిట్ అయిన వాగ్నర్ గ్రూప్ అధినేత యవ్జెనీ ప్రిగోజిన్ సాయుధ తిరుగుబాటుకు పిలుపునిచ్చినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఆయన మాత్రం రష్యా సైన్యం తమ క్యాంపుపై దాడి చేసి భారీ మొత్తంలో కిరాయి సైనికుల్ని హతమార్చిందని ఆరోపించారు. దీనికి ప్రతీకారం తప్పదన్నారు.

నిన్న అర్థరాత్రి నాటకీయ పరిణామాల యొక్క వాగ్నెర్ ఫైటర్‌లను నియంత్రించి, వారి నాయకుడిని అదుపులోకి తీసుకోమని రష్యా ప్రభుత్వం సైన్యాన్ని ఆదేశించింది. అలాగే వాగ్నర్ గ్రూప్ అధినేత ప్రిగోజిన్ ప్రభుత్వ టీవీలో చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదని ఆరోపిస్తూ రక్షణ శాఖ ప్రసారాలు కూడా నిలిపేసింది. రెండు రష్యన్ నగరాల్లోని సైనిక స్ధావరాలను తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ ప్రకటించిన తర్వాత రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వాగ్నెర్ దళాలకు తిరిగి శాశ్వత మోహరింపు పాయింట్లకు సురక్షితంగా తిరిగి రావాలని విజ్ఞప్తి చేసింది.

మరోవైపు రష్యా రక్షణశాఖ తమను మోసగించిందని వాగ్నర్‌ ఛీఫ్ ప్రిగోజిన్ పేర్కొన్నాడు. ఈ దురాగతానికి ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. తాము ఆయుధాలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నా ప్రభుత్వం దూకుడుగా ముందుకెళ్తోందని ఆయన ఆరోపించారు. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం టెలిగ్రామ్ పోస్ట్‌లో ఆరోపణను ఖండించింది, ఈ సంఘటన గురించి ప్రిగోజిన్ తరపున సోషల్ నెట్‌వర్క్‌లలో వస్తున్న మెసేజ్ లు, వీడియోలను అవాస్తవమని తెలిపింది.