home page

శ్రీ చైతన్య విద్యా సంస్థ అధిపతి బి ఎస్ రావు కన్నుమూత

వివిధ రాష్ట్రాల్లో విస్తరించిన  విద్యా సంస్థ 

 | 
 B s rao
శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ బీఎస్‌ రావు మంగళ వారం కన్నుమూశారు.. శ్రీచైతన్య విద్యాసంస్థలు అంటే.. కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది..అయితే, దీని వెనుక.. ఆ సంస్థను స్థాపించిన బీఎస్‌రావు కృషి ఎంతో ఉంది.. అనారోగ్యంతో ఆయన హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన ప్రమాదవశాత్తు బాత్‌రూమ్‌లో జారిపడ్డారు.. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.. అయితే, అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఇక, ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలించి.. అక్కడే ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు కుటుంబ సభ్యులు.. ఇక, శ్రీచైతన్య విద్యా సంస్థలు ఎలా ప్రారంభం అయ్యాయి.. అసలు ఎందుకు ఆయనకు ఈ ఆలోచన వచ్చింది.. దాని వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి? అనే విషయాల్లోకి వెళ్తే..
డాక్టర్ బీఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణరావు.. ఆయన 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను ప్రారంభించారు.. అనతికాలంలోనే ఆ సంస్థలను అగ్రగామిగా తీర్చిదిద్దారు.. శ్రీచైతన్యకు పోటీగా మరికొన్ని సంస్థలు వచ్చినా.. దాని ప్రత్యేకత మాత్రం ఏ మాత్రం తగ్గలేదనే చెప్పాలి.. ఏ పరీక్షలైనా.. ర్యాంకులు శ్రీచైతన్యకు రావాల్సిందే అనేలా తయారు చేయడంలో బీఆఎస్‌ రావు కృషి మరువలేదని.. మొదట విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడ్నించి అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్ కు కేరాఫ్ అడ్రెస్ గా శ్రీచైతన్యను ఉన్నతస్థానానికి చేర్చారు. క్రమంగా 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లు స్థాపించారు..
అయితే, 1986లో యూకే మరియు ఇరాన్‌లో 16 ఏళ్ల పాటు మెడిసిన్ ప్రాక్టీస్ చేశారు బీఎస్‌ రావు.. ఆయన సతీమణి డాక్టర్ ఝాన్సీ లక్ష్మీ బాయి కూడా ఆయనతో పాటే మెడిసిన్‌ ప్రాక్టీస్‌ చేశారు.. ఆ తర్వాత రాష్ట్రానికి తిరిగి వచ్చారు.. విజయవాడలో మొదటి శ్రీ చైతన్య పాఠశాలను ప్రారంభించారు.. ఓ సందర్భంలో అసలు ఎందుకు మీరు విద్యా సంస్థను ప్రారంభించారు అని ప్రశ్నిస్తే.. శ్రీచైతన్య విద్యాసంస్థల ప్రారంభం అనేది చిరకాల వాంఛగా తెలిపారు. అవగాహన లేకపోవడం, వనరుల కొరత కారణంగా ఏపీలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకు.. ముఖ్యంగా ఆడపిల్లలకు వృత్తిపరమైన విద్య చాలా పరిమితమని మేం గమనించాం. అందుకే, మొట్టమొదటి శ్రీ చైతన్య బాలికల జూనియర్ కళాశాలను స్థాపించడం ద్వారా ఈ లోపాన్ని పరిష్కరించడానికి చొరవ తీసుకున్నాం అన్నారు.. ప్రతిభావంతులైన విద్యార్థులను అగ్రశ్రేణి ఉన్నత విద్యా సంస్థలలో ప్రవేశం పొందేలా మరియు వారి కెరీర్‌లో విజయం సాధించేలా చేయడం మా లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనికోసం ఇంటర్మీడియట్ స్థాయి విద్యకు సరికొత్త విధానం అవసరమని గ్రహించి బోధనా వ్యవస్థలు మార్పులు తీసుకువచ్చాం అన్నారు.
శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ యొక్క పరిణామం క్రమంగా పెరుగుతూ వెళ్లింది.. 1991లో హైదరాబాద్‌లో బాలుర జూనియర్ కళాశాలను స్థాపించారు బీఎస్‌ రావు.. అక్కడితో ఆగకుండా అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర పట్టణాలలో అనేక జూనియర్ కళాశాలలను తెరిచారు.. ఇలా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 321 జూనియర్ కళాశాలలు, 322 K-10 శ్రీ చైతన్య టెక్నో పాఠశాలలు నెలకొల్పారు.. అంతటితో ఆగకుండా.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో 107 CBSE- అనుబంధ చైతన్య పాఠశాలలను స్థాపించారు.. వీరు ప్రవేశపెట్టిన ప్రణాళికా బద్ధమైన విధానం విద్యా వ్యవస్థ ముఖచిత్రాన్నే మార్చివేసింది. బోధనలోనూ, సిబ్బంది నిర్వహణలోనూ మరింత మెరుగైన విధానాన్ని ప్రవేశ పెట్టడంతో వారు విజయం సాధించారు.
డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు.. శ్రీ చైతన్య జూనియర్ కాలేజీని కేవలం 56మంది విద్యార్థులతో విజయవాడలో 1986లో ప్రారంభించారు. తొమ్మిదేళ్ల వరకు ఈ విద్యాసంస్థ ఎలాంటి విస్తరణకు నోచుకోలేదు. విద్యార్థులు మాత్రం వెయ్యిమందికి పెరిగారు. అయితే, 1995 నుంచే ఈ విద్యాసంస్థ విస్తరించటం ప్రారంభించారు.. ఒకేఒక బ్రాంచ్‌తో ఆరంభమైన ఈ విద్యావ్యవస్థ దేశవ్యాప్తంగా విస్తరించింది. అయితే, బీఎస్‌ రావు దంపతులు భారత్‌కు తిరిగి వచ్చిన తర్వాత కుమార్తెలు (సీమ, సుష్మ) ఉన్నత చదువుల కోసం బాలికల కాలేజీని వెతికారట.. సరైన కాలేజీ ఒక్కటి కూడా కనిపించకపోవడంతో.. ఈ విద్యాసంస్థల స్థాపన వైపు అడుగులు వేసిందని కూడా చెబుతుంటారు.. ఇక, శ్రీ చైతన్య విద్యాసంస్థలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ సరిహద్దులు దాటి విస్తరించటం 2004 నుంచి ఆరంభమైంది. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటకలో బ్రాంచ్‌లు ఏర్పాటు చేశారు.. 2006 నుంచి ఐఐటీ-జేఈఈ, ఏఐఈఈఈ, పీఎంటీ కోచింగ్ సెంటర్లను హిమాచల్‌ప్రదేశ్, చండీగఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో ఏర్పాటుచేశారు. శ్రీచైతన్య నుంచి ప్రతీ ఏడాది వేలాది మంది ప్రతిభావంతులైన విద్యార్థులు బయటకు వస్తున్నారు. దాని వెనుక బీఎస్‌ రావు కృషి మరువలేనిది.