home page

జగన్ పై కేసు వేసిన రఝరామ

 | 
Raghu
11 చార్జీ షీట్లలో నిందితుడైన వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కానీ... కోర్టులో పిల్ వేయడానికి నేను అర్హుడిని కానా?
 నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
 ఆర్థిక నేరాభియోగ కేసులలో 43 వేల కోట్ల రూపాయలు కొట్టేశాడని సిబిఐ 11 చార్జిషీట్లు దాఖలు చేయగా, కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హుడు కానీ, సిబిఐ, సిఐడి కేసు విచారణ జరుగుతోందని చెప్పి న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయడానికి నేను అనర్హుడనని రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామ కృష్ణంరాజు మండిపడ్డారు . గురువారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... వైకాపా ఎంపీ నని చెప్పి నేను తప్పుడు ధృవీకరణ ఇచ్చారని అడ్వకేట్ జనరల్ పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగించింది. నన్ను ఇంకా పార్టీ నుంచి బహిష్కరించలేదన్న విషయాన్ని అడ్వకేట్ జనరల్ గుర్తించాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు. ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కి చెప్పి నన్ను పార్టీ నుంచి బహిష్కరించమని సలహా ఇవ్వాలంటూ ఆయన అడ్వకేట్ జనరల్ కు చెప్పారు . అప్పుడు నేను వైకాపా ఎంపీ ని కాదని, సాధారణ ఎంపీ నని గుర్తించాలని పేర్కొంటూ ధ్రువీకరణ పత్రాన్ని మార్చి, కోర్టుకు సమర్పిస్తానన్నారు . మూడున్నర ఏళ్ల క్రితం షెడ్యూల్ 10 ప్రకారం నాపై వైకాపా నాయకత్వం అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ కు నేను అప్పుడే సమాధానం చెప్పాను. గతంలో సీనియర్ పార్లమెంటేరియన్ శరద్ యాదవ్ ను అనర్హుడి గా ప్రకటించినట్లుగా, నన్ను కూడా అనర్హుడిగా ప్రకటించారని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అనుకుంటున్నారేమోనని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి హోదా లో జగన్మోహన్ రెడ్డి తన పదవిని అడ్డం పెట్టుకుని తన సొంత కంపెనీలకు, అనుయాయులకు ఎలా లబ్ధి చేకూరుస్తున్నారు సవివరంగా వివరిస్తూ 1340 పేజీల తో కూడిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని రాష్ట్ర హైకోర్టులో
దాఖలు చేశాను. ఆ పిటిషన్ కోర్టు నెంబర్ మూడులో గురువారం నాడు విచారణకు చేపట్టారు. పిటిషనర్ గా నా తరపున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ రావు వాదనలు వినిపించగా, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ ముందు తన వాదనలు వినాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేసిన వ్యక్తి గురించి ఒకసారి పరిశీలించాలని కోర్టును అడ్వకేట్ జనరల్ కోరారు. పిటీషన్ లో వైకాపా ఎంపీనని నేను పేర్కొనడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ... మూడున్నర ఏళ్ల క్రితమే ఆయనపై అనర్హత పిటిషన్ దాఖలు చేశామన్నారు. రెస్పాండెంట్ తరపున కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తాను వాదనలను వినిపిస్తున్నానని చెప్పిన అడ్వకేట్ జనరల్, నాపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి తరఫున వాదనలు వినిపించకపోతే నేను వైకాపా సభ్యుడిని కాదని ఫైల్ చేసిన పిటిషన్ కు, అడ్వకేట్ జనరల్ కు సంబంధం ఏమిటంటూ నిడదీశారు. కోర్టులో ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే అడిగే వారు లేరనని అనుకుంటున్నారా? అంటూ ఫైర్ అయ్యారు. ఆర్థిక నేరాభియోగ కేసులలో సిబిఐ 11 ఛార్జ్ షీట్లను దాఖలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో కొనసాగవచ్చు కానీ ఒక ఎంపీగా నేను ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయవద్దని అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేయడానికి పొందుపరిచిన నిబంధనలను అడ్వకేట్ జనరల్ చదివి వినిపించారు. అయితే అందులోని మ్యాటర్, సీరియస్ గ్రీవెన్స్ ను పరిగణలోకి తీసుకోవాలన్న విషయాన్ని ఆయన విస్మరించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని అడ్మిట్ చేయవద్దన్న అడ్వకేట్ జనరల్ అభ్యర్థన పై న్యాయమూర్తి స్పందిస్తూ... ఈ కేసులోని ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఆ తరువాత ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం స్వీకరణ పై ఒక నిర్ణయం తీసుకుంటామని, ఈ కేసును డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేశారని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. ఒకవేళ వైకాపా పార్టీ నుంచి నన్ను బహిష్కరిస్తే, సాధారణ ఎంపీగా నన్ను గుర్తించాలని కోరుతూ అమైన్మెంట్ సబ్మిట్ చేస్తానని తెలిపారు. ఈ కేసులో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో పాటు ప్రతి వాదులైన అందరికీ నోటీసులు అందుతాయన్నారు. సాక్షి దినపత్రికను ఎలా విక్రయిస్తున్నారో, సిమెంటు పోర్టల్ ద్వారా తన సొంత కంపెనీకి, అనుయాయుల కంపెనీలకు ఎలా లబ్ధి చేకూరుస్తున్నారో త్వరలోనే తేలనుందని అన్నారు.
 జగన్మోహన్ రెడ్డి పై వ్యక్తిగత ద్వేషం లేదు... రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని చూసే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశా 
 జగన్మోహన్ రెడ్డి పై నాకు ఎటువంటి వ్యక్తిగత ద్వేషం లేదు. లాకప్ లో నన్ను చిత్రహింసలకు గురి చేస్తున్నప్పుడు వీడియో చూసి ఆనందించినప్పటికీ, నా మిత్రుడి కుమారుడిగా ఆయనపై కోపం లేదు. రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని చూసి తట్టుకోలేకనే న్యాయస్థానంలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశానని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ భావిస్తున్నట్లుగా నాకు ముఖ్యమంత్రి పై వ్యక్తిగత కక్ష లేదు. నన్ను లాకప్ లో చిత్రహింసలు పెట్టారు, హత్య చేయాలని చూశాడనో కాదు... నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి, ప్రజలే నన్ను కాపాడుకుంటారు. ప్రతి వ్యక్తికి మరణాన్ని దేవుడు ముందే లిఖిస్తాడు. ఆ మరణాన్ని పోస్ట్ పోన్ చేయడం ఫ్రీ పోన్ చేయడం ఎవరి తరం కాదు. రాజ్యాంగబద్ధమైన పదవిలో అడ్వకేట్ జనరల్ ఉండగా, ప్రజల చేత ఎన్నుకున్న ప్రజా ప్రతినిధిగా నేను ఉన్నాను. ఎవరి హక్కులు, అధికారాలు వారికి ఉంటాయి. ఎవరికి ఎవరు తక్కువేమీ కాదు. ప్రభుత్వం పేరిట వాదిస్తున్నానని చెప్పి , వ్యక్తిత్వ హననానికి పాల్పడే ముందు అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలని రఘురామకృష్ణం రాజు హితవు పలికారు .
 పోలీస్ విధివిధానాలు తెలియజేయాలని డీజీపీకి లేఖ రాస్తా
 పోలీసుల విధి విధానాలు తెలియజేయాలని కోరుతూ రాష్ట్ర డిజిపి కి లేఖ రాస్తానని రఘురామకృష్ణం రాజు తెలియజేశారు. టెర్రరిస్టులను మినహాయించి ఎవరినైనాపోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో విధిగా యూనిఫామ్ ధరించాలని, ఐడి కార్డు ప్రదర్శించాలని... ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం తెదేపా ఇంచార్జ్ బీటెక్ రవిని ఎలా చిత్రహింసలకు గురిచేశారో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఏబీఎన్ ఛానల్ కు వివరించారు. బీటెక్ రవిని అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసు తమ ప్రవర్తన నియమావళికి పూర్తి భిన్నంగా వ్యవహరించారు. గతంలో నన్ను కూడా ఇలాగే అదుపులోకి తీసుకోవాలని ఇంటలిజెన్స్ ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తిని మఫ్టీలో , నా ఇంటి ముందు కాపలా పెట్టారు. అనుకోకుండా ఒక వ్యక్తి అతనికి తారాసపడడం, మాటల మధ్యలో మరో రెండు గంటల్లో పోలీసులు వచ్చి రఘురామకృష్ణం రాజును అదుపులోకి తీసుకోనున్నారని చెప్పడంతో నేను అప్రమత్తమయ్యాను. రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి నా ఇంటి ముందు ఎందుకు పెట్టారో చెప్పాలని పోలీసులను కో రగా, నా ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండే గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు రక్షణ కోసం ఆయన్ని కాపలాగా పెట్టామని చెప్పారన్నారు. పోలీసుల తరహాలో దొంగ పోలీసులు వచ్చి నన్ను అపహరించి, మార్గమధ్యలోనే కడతేర్చాలన్నది కొంతమంది ప్లాన్. ఇప్పుడు బీటెక్ రవి విషయంలోనూ అదే పథకాన్ని అమలు చేశారు. కాకపోతే బీటెక్ రవి భార్య అప్రమత్తంగా వ్యవహరించడంతో ఆయనకు ముప్పు తప్పింది. గత్యంతరం లేని పరిస్థితిలో పది నెలల క్రితం నమోదు చేసిన కేసులో అరెస్టు చేశామని చెప్పి మేజిస్ట్రేట్ ముందు ఆయన్ని
హాజరు పరిచారు. నేరస్తులు, పోలీసులు
కుమ్మక్కై ఒక నేరస్తుడి పరిపాలనలో జనాలను ఎత్తుకుపోయి చంపేసే ప్రయత్నాన్ని చేస్తున్నారు. పోలీసులు నిబంధనలేవీ పాటించడం లేదు. యూనిఫాం లేకుండా సివిల్ దుస్తులలో వెళ్లి అరెస్టు చేయడానికి వీలు లేదు. అడిగిన చోట ఐడి కార్డును ప్రదర్శించాలి. కానీ రాష్ట్ర పోలీసులు ఆ నిబంధన లేని పాటించడం లేదు. రాజకీయ నాయకులను, జర్నలిస్టులను అరెస్టు చేయాలంటే కచ్చితంగా పోలీసులు యూనిఫామ్ లోనే వెళ్లి వారికి నోటీసులు సర్వ్ చేసిన తర్వాతే అదుపులోకి తీసుకోవాలి. పోలీసుల విధివిధానాలు తెలియజేయాలని ఎవరైనా కోర్టును ఆశ్రయించే ముందు, రాష్ట్ర డిజిపి కి నేను ఒక లేఖ రాస్తానని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.
 ఉపాధ్యాయులను ఎన్నికలలో భాగస్వాములు చేయలేమన్న రాష్ట్ర ప్రభుత్వం...
ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వ ఉద్యోగులను భాగస్వాములను చేయలేమని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కు నివేదించింది. ఎన్నికల ప్రక్రియలో సచివాలయ సిబ్బందిని భాగస్వాములను చేస్తామని చెప్పింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో నాలుగైదు ఎన్నికలను నిర్వహించిన అనుభవం ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉంది. అటువంటి వారిని ప్రిసైడింగ్ అధికారులుగా, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులుగా నియమించలేమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు, నాతో పాటు అన్ని రాజకీయ పక్షాల వారు ఎన్నికల కమిషన్ అధికారులను కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఎన్నికల ప్రక్రియలో ముక్కు సూటిగా వ్యవహరించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించడం హర్షనీయం. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఉపాధ్యాయుల పాత్ర ఉండాలి లేకపోతే దారుణాలు జరిగే ప్రమాదం ఉంది. డెమోక్రసీ ఫోరమ్ ఫర్ సిటిజన్స్ ఈ విషయంలో చాలా చురుకుగా వ్యవహరిస్తుంది. అటువంటి స్వచ్ఛంద సంస్థ పై కూడా నీలా పనిందలు వేసేలా మిల్లెట్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం దారుణం. కపిల్ సిబల్ వంటి సీనియర్ న్యాయవాది చేత వాదనలను ఎలా వినిపిస్తున్నారని, చంద్రబాబు నాయుడు ఆర్థిక సహకారంతోనే సుప్రీంకోర్టులో డెమోక్రసీ ఫోరం ఫర్ సిటిజన్స్ కేసు దాఖలు చేసిందని మిల్లెట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసహ్యంగా ఉన్నాయి. ప్రజా ప్రయోజనాలతో కూడిన కేసులను వాదించడానికి కపిల్ సిబల్, హరీష్ సాల్వే వంటి వారు రూపాయ కూడా ఫీజు తీసుకోరు. అందరూ మీలాగే డబ్బుల విషయంలో నిక్కచ్చిగా ఉండరు అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి పై రఘురామకృష్ణం రాజు సెటైర్లు వేశారు. ఎన్నికల నిర్వహణలో ఉపాధ్యాయుల, సచివాలయ సిబ్బంది, వాలంటీర్ల పాత్ర పై రాజ్యాంగాన్ని అనుసరించి సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పును ఇస్తుందని ఆయన ఆశా భావాన్ని వ్యక్తం చేశారు. దొంగ ఓట్ల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కృషి చేయాలన్నారు. జీరో డోర్ నెంబర్ ఓట్లపై, ఒకే ఇంట్లో అధికంగా ఉన్న ఓట్లపై విపక్ష పార్టీల ప్రతినిధులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి దొంగ ఓట్లనుతొలగించే విధంగా కృషి చేయాలని రఘురామకృష్ణంరాజు కోరారు.