home page

మాపార్టీ తుడిచిపెట్టి పోతుంది

 | 
Raghu
ఆదాయం పెరిగిందంటూనే... ఖజానా ఖాళీ అయిందనడం ముఖ్యమంత్రి కే చెల్లింది
 నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
 ఒకపక్క రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగింది... అప్పులు చేయలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వింత, అసంబద్ధమైన వాదన విడ్డూరంగా ఉందని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణం రాజు విమర్శించారు. జిపిఎస్ అద్భుతమైన స్కీమ్ అని పేర్కొంటూనే, ఓ పి ఎస్ ను అమలు చేస్తే రాష్ట్రంలో ఉద్యోగులే ఉండరని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. మంగళవారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణం రాజు తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... ఓ పి ఎస్ స్కీమును పునరుద్ధరిస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా జిపిఎస్ పథకాన్ని ప్రవేశపెట్టడం పట్ల ఉద్యోగులు తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే వందిమాగాదులైన కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు మాత్రం, ఆయన్ని సన్మానించాలని ప్రయత్నించగా, జగన్మోహన్ రెడ్డి విజ్ఞతను ప్రదర్శించి తప్పించుకున్నారన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న జిపిఎస్ పథకాన్ని, దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రశంసిస్తాయని పేర్కొన్న జగన్ మోహన్ రెడ్డి, ఓ పి ఎస్, సిపిఎస్ పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రాలు కూడా, భవిష్యత్తులో జిపిఎస్ పథకాన్నే అమలు చేస్తాయని చెప్పడం చూస్తే, ఇవి పిట్టల దొర కబుర్లు, సోది కబుర్లే నని స్పష్టం అవుతుంది. జిపిఎస్ పథకాన్ని అమలు చేయడానికి దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆసక్తి చూపుతాయని ఒక వైపు చెబుతూనే, మరొకవైపు ఓపిఎస్ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందంటూ జగన్మోహన్ రెడ్డి వితండవాదాన్ని చేస్తున్నారు. గత ప్రభుత్వం కంటే తక్కువే అప్పులు చేశామని, పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని, జగన్ అధికారంలోకి వచ్చాకే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెరిగిందని, కరోనాను కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లి తరిమికొట్టారని, రాష్ట్ర జిడిపి విపరీతంగా పెరిగిందని ఒక వైపు ప్రచారం చేసుకుంటూనే, అంతలోనే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిందనడం ముఖ్యమంత్రి ద్వంద వైఖరిని తెలియజేస్తోంది. జిపిఎస్ పథకం కాకుండా, ఉద్యోగులకు ఓపిఎస్ పథకం అమలు చేస్తే... నాడు నేడు పథకం కింద అభివృద్ధి చేసిన స్కూళ్లకు విద్యార్థులు రాక, మూసి వేయవలసి వస్తుందన్నారు. స్కూళ్లకు విద్యార్థులు రాకపోతే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి, టీచర్లను ఉద్యోగంలో నుంచి తొలగిస్తారన్న జగన్మోహన్ రెడ్డి, ఆర్టీసీ ఉద్యోగులకు కూడా అదే పరిస్థితి ఎదురవుతుందన్నారు. రైతు భరోసా కేంద్రాలు పనిచేయకపోవడంతో, అక్కడ పనిచేసే ఉద్యోగులను చంద్రబాబు తొలగిస్తారని చెప్పారు. ఓ పి ఎస్ ను అమలు చేసి అధికారం నుంచి తాను మారిపోతే నూతన ఉద్యోగాలు ఇవ్వకపోవడమే కాకుండా, ఉన్న ఉద్యోగులను చంద్రబాబు నాయుడు తొలగిస్తారని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని రఘురామకృష్ణంరాజు అన్నారు. టిడిపి ప్రభుత్వ హయాం లో ఉద్యోగులకు ఓపిఎస్ పథకమే అమలు చేశారని గుర్తు చేశారు. అప్పుడు విధుల్లో నుంచి ఎవరినైనా ఉద్యోగులను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తొలగించిందా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాలలో ఓపిఎస్ పథకం అమల్లో ఉందని అక్కడ ఎవరినైనా ఉద్యోగులను తొలగించారా? అని నిలదీశారు.
 విశాఖలో మరింత దారుణంగా మా పార్టీ తుడిచి పెట్టుకోబోతుంది
 రాష్ట్రవ్యాప్తంగా తుడిచిపెట్టుకపోనున్న మా పార్టీ, విశాఖలో మరింత దారుణంగా తుడిచి పెట్టుక పోవడానికి మా పార్టీ నాయకుల భూదాహమే కారణమని రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఋషికొండకు గుండు కొట్టి జెమోరె టూరిజం కాటేజీల ముసుగులో నివాస సముదాయాన్ని నిర్మించుకున్నాడు. A1 కు ఒక కొండ ఉన్నప్పుడు A2 అయినా నాకు ఒక కొండ లేదా? అని భావించి కాబోలు... ఆనందపురం జంక్షన్ సమీపంలోని విష్ణు పాదాలు, విగ్రహాలు దొరికిన తుర్లవాడ కొండపై మా ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డి కన్నేశారు . ఇప్పటికే విశాఖపట్నంలో వేల ఎకరాల భూములను మా పార్టీ నాయకులు కబ్జా చేశారు. దసపల్లా హిల్స్ భూములను బలవంతంగా లాక్కున్నారు. సారా వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ లో కూడా వీరి పెత్తనమే కొనసాగుతోంది. వీరి అంతులేని ధన దాహానికి, రాష్ట్రం అంతులేని రుణ దాహంతో అపసోపాలు పడుతుంది. పది ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాల గుర్తింపుతో కేజీ నుంచి పీజీ వరకు అంతర్జాతీయ యూనివర్సిటీని నెలకొల్పాలనే కోరిక విజయసాయి రెడ్డికి కలిగింది. ప్రైవేటు యూనివర్సిటీ ఏర్పాటుచేసి, సీట్లు అమ్ముకునే విజయ సాయి రెడ్డి, మార్కెట్ ధరకు కాకుండా 120 ఎకరాల భూమికి కేవలం 15 కోట్ల రూపాయలు చెల్లిస్తానని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఎకరా మూడు కోట్ల రూపాయల ధర చేసే భూమికి, కేవలం 13 నుంచి 14 లక్షల రూపాయలు చెల్లిస్తానన్నడం ఆశ్చర్యంగా ఉంది. మార్కెట్ ధర కంటే తక్కువ రేటుకు భూములు తీసుకుంటే, రానున్న ప్రభుత్వం అనుమతులు రద్దు చేస్తుంది. మార్కెట్ ధరకు భూములు కొనుగోలు చేసి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో యూనివర్సిటీని నిర్మించి కూతురు నేహా రెడ్డికి బహుమతిగా అందజేస్తే ఎవరికీ ఏ అభ్యంతరం ఉండదు. ఋషికొండపై వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తామని రానున్న ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగనున్న అయ్యన్నపాత్రుడు కూడా పేర్కొనడం అభినందనీయం. ఋషికొండను జగన్మోహన్ రెడ్డి, తుర్లవాడ కొండ ను విజయసాయిరెడ్డి దోచుకునే ప్రయత్నాలను ప్రజలంతా గమనిస్తున్నారు. విశాఖపట్నం కొండ ప్రాంతాలలో రైతులకు గత ప్రభుత్వాల హయాంలో డి ఫామ్ పట్టాలను అందజేయగా, వాటిని మా పార్టీ నాయకులు బలవంతంగా
 తమ పేరిట రాయించుకున్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడమే కాకుండా... రైతన్నలకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అండదండలని సాక్షి దినపత్రికలో వార్తా కథనాలు రాయడం సిగ్గుచేటు. విశాఖపట్నంలో ఎవరెవరు ఏ ఏ పేర్ల మీద ఎంతెంత స్థలాలను కొనుగోలు చేశారో స్థానిక ప్రజలకు తెలుసు. మా పార్టీ నాయకులు ఎన్ని కబుర్లు చెప్పినా విశాఖపట్టణం ప్రజలు విశ్వసించరు. విశాఖపట్నంలో సర్వం జగన్మయం అన్నట్టుగా పరిస్థితి తయారయ్యింది.. చివరకు సింహాద్రి అప్పన్నకు కూడా శఠగోపం పెట్టారని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
 నభూతో... అన్నట్టు కొనసాగనున్న గుడివాడ సభ
 మంగళవారం నాడు సాయంత్రం జరగనున్న గుడివాడ యువ గళం పాదయాత్ర బహిరంగ సభ ఇప్పటివరకు చుట్టుపక్కల ప్రాంతాలలో జరిగిన సభల కంటే నభూతో... అన్నట్టు కొనసాగనుందని రఘురామకృష్ణంరాజు తెలిపారు. గన్నవరంలో గతిలేక వలస నాయకుడిని చేర్చుకున్నారని, స్థానిక ఎంపీ యువ గళం పాదయాత్రలో పాల్గొనలేదని సాక్షి దినపత్రికలో చెత్త చెత్త కథనాలను రాశారు. నారా లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్రకు కనీ విని ఎరగని రీతిలో విశేష స్పందన లభించింది. స్వచ్ఛందంగా మహిళలు, వృద్ధులు తరలివచ్చారు. 14 నుంచి 15 గంటల పాటు ఏకధాటిగా నారా లోకేష్ పాదయాత్ర నిర్వహిస్తూ, ప్రజలతో మమేకమయ్యారు. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం మన పార్టీ సభలు నిర్వహించి, బిర్యానీ పొట్లాలు ఇచ్చి, మందు పోయించి బస్సులు ఏర్పాటు చేసిన, సభకు వచ్చిన వారు భారీ కేడ్లను దాటుకొని, ప్రహరీ గోడలు దూకి పారిపోయారని గుర్తు చేశారు. నారా లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్రకు అర్ధరాత్రి రెండు నుంచి రెండున్నర గంటల మధ్య కూడా మేడలు మిద్దెలు ఎక్కిన జనం ఆయన్ని తిలకించడానికి పోటీపడ్డారంటే, వారు డబ్బులు ఇస్తే వచ్చిన జనం కాదని స్పష్టం అవుతుంది. గుంటూరులో నిర్వహించిన యువ గళం పాదయాత్రకు స్థానిక ఎంపీ గల్లా జయదేవ్ హాజరు కాలేదని, విజయవాడలో కేశినేని నాని పాల్గొనలేదని సాక్షి దినపత్రిక పనికిమాలిన వార్త రాసింది. గల్లా జయదేవ్ ఎందుకు హాజరు కాలేదో అందరికీ తెలిసిందే. ఇక కేశినేని నాని అమర్నాథ్ యాత్రకు వెళ్లి వచ్చి, ఆయన ఒక పెళ్లికి హాజరయ్యారు. అయినా నరసాపురం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నోసార్లు వచ్చిన నేను కూడా హాజరు కాలేదు. కేశినేని నాని ఏదో సాక్షి దినపత్రికకు సన్నిహితుడైనట్లుగా, వారు వెళ్లొద్దంటేనే వెళ్లలేదన్నట్లుగా వార్తలు రాయడం హాస్యాస్పదంగా ఉంది. గన్నవరంలో వలస నాయకుడిని తెచ్చుకున్నది ఎవరు?, టిడిపి గుర్తుపై గెలిచిన వల్లభనేని వంశీ మోహన్, అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినప్పటికీ, ప్రస్తుతం మన పార్టీ సభ్యుడిగానే చలామణి అవుతున్నారు. ప్రజాసేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లో ప్రవేశించిన యార్లగడ్డ వెంకట్రావును సాంతం నాకేసి, ఇప్పుడు బయటకు విసిరిపడేసినంత పని చేశారు.. యార్లగడ్డ వెంకట్రావు, చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశంలో పార్టీలో చేరారు. నారా లోకేష్, యార్లగడ్డ వెంకట్రావు కాంబినేషన్లో గుడివాడ సభ గ్రాండ్ సక్సెస్ కావడం ఖాయం. నారా లోకేష్ పాదయాత్ర చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి తన కాలికి పరీక్షలు చేయించుకున్నారని, గుడివాడ సభ తర్వాత మరికొన్ని పరీక్షలు చేయించుకోవలసి వస్తుందని ఎద్దేవా చేశారు. సోమవారం నాడు నారా లోకేష్ నిర్విరామంగా 12 గంటల పాటు పాదయాత్ర చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉదయం ఒక గంట, సాయంత్రం మరొక గంట పాదయాత్ర చేసే వారిని, గురువారం సాయంత్రం పాదయాత్రకు విరామం ప్రకటించి సిబిఐ కోర్టుకు హాజరయ్యే వారన్నారు. కానీ నారా లోకేష్ నిర్విరామంగా పాదయాత్ర చేస్తూ, నాలుగు కిలోమీటర్లు కూడా నడవలేరని ప్రత్యర్ధులు చేసిన అపహాస్యాన్ని తిప్పికొడుతూ ఇప్పటికే 2500 కిలోమీటర్ల పాద యాత్ర పూర్తి చేశారన్నారు. మరో 1500 కిలోమీటర్ల మేర పాదయాత్ర పూర్తి చేసి, రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయనన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నాయకుడిగా చరిత్రకెక్కనున్నారని తెలిపారు.
 దొంగ ఓట్ల నమోదుపై అప్రమత్తమైన ప్రజలు
 రాష్ట్రంలో అధికార పార్టీ విచ్చలవిడిగా నమోదు చేస్తున్న దొంగ ఓట్లపై ప్రజలు అప్రమత్తమయ్యారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో దొంగ ఓట్ల నమోదుకు సహకరించిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయ్యన్నపాత్రుడు నియోజకవర్గంలో 40,000 ఓట్లు నిర్మూలించినట్లు తెలుస్తోంది. అలాగే రామకృష్ణ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లో ఏడు నుంచి ఎనిమిది వేలకు తగ్గకుండా దొంగ ఓట్లను అధికార పార్టీ నేతలు నమోదు చేయించారు. దొంగ ఓట్ల నమోదుపై, ప్రజల ఓట్ల తొలగింపు పై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఈనెల 28వ తేదీన సమయాన్ని కోరినట్లు తెలుస్తోంది. ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వారే ఈ వెధవ దాష్టికాలకు పాల్పడుతున్నారు. ఎక్కడైనా దొంగ ఓట్ల నమోదు, ఓట్ల తొలగింపు పై ప్రతిపక్ష పార్టీల నేతలే ఫిర్యాదు చేస్తున్నారు. మా పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడం లేదంటే, దొంగ ఓట్ల నమోదు, ప్రజల ఓట్ల తొలగింపుకు పాల్పడుతున్నది అధికార పార్టీ నాయకులేనని స్పష్టం అవుతుంది. ఉరవకొండ లో దొంగ ఓట్ల నమోదు, ప్రజల ఓట్ల తొలగింపు పై కేశవ్ తో పాటు, తాను కూడా ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. దొంగ ఓట్లపై నాకు ఆధారాలతో ఫిర్యాదు కాపీని అందజేస్తే, ఎన్నికల సంఘం అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నిస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు సాక్షి పేపర్ ను విక్రయించి, ప్రజాధనాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేసిన ఆ పత్రిక యాజమాన్యం ఆగడాలపై ఉషోదయ పబ్లికేషన్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నాటి నుంచి ఇప్పటివరకు మార్గదర్శిపై వేధింపు దాడులు కొనసాగుతున్నాయి. అయినా మొక్కవోని దీక్షతో రామోజీ రావు పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ వి ఆర్ విత్ యు రామోజీరావు అని తెలియజేస్తున్నారు. ఇప్పటికే మాయమాటలకు దెబ్బ తిన్నాం. ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నామని రఘురామకృష్ణంరాజు అన్నారు.